బహిరంగ ప్రదేశాల్లో.. ఐఫోన్‌తో అసభ్య వీడియోలు
సింగపూర్: ఓ నీచుడు ఐ ఫోన్‌తో బహిరంగ ప్రదేశాల్లో మహిళలను అసభ్యకరంగా చిత్రీకరించాడు. దాదాపు 60 మంది మహిళలను వారికి తెలియకుండా అర్ధనగ్న వీడియోలు తీశాడు. చివరకు గుట్టురట్టు కావడంతో కటకటాలపాలయ్యాడు. ఈ కేసులో సింగపూర్‌లో భారత సంతతికి చెందిన నంతకుమార్ పాల కృష్ణన్‌కు ఆర్నెళ్లు జైలు శిక్ష పడింది.
34 ఏళ్ల నంతకుమార్ ఐఫోన్ 4ను తన ల్యాప్‌టాప్ బ్యాగులో పెట్టుకుని తిరిగేవాడు. బ్యాగులో పుస్తకాల పైభాగంలో కెమెరా పైకి ఉండేలా ఐఫోన్‌ను ఉంచుతాడు. కెమెరాను రికార్డింగ్ మోడ్‌లో ఉంచి, బ్యాగుకు జిప్ వేయకుండా అలాగే వదిలేసేవాడు. స్కర్ట్లు ధరించిన మహిళలను అతను టార్గెట్ చేసేవాడు. బహిరంగ ప్రదేశాలు, షాపింగ్ మాల్స్ తదితర ప్రాంతాల్లో మహిళల పక్కన, వెనుక వైపున ఈ బ్యాగును కిందపెట్టేవాడు. ఇలా మహిళల అర్ధనగ్న దృశ్యాలను వీడియో తీశాడు. ఓ షాపింగ్ మాల్లో ఓ మహిళను అసభ్యంగా వీడియో తీస్తుండగా అతని బండారం బయటపడింది. నిందితుడు ఆమె వెనుక నేలపై బ్యాగ్ ఉంచాడు. ఆమె సహోద్యోగికి సందేహం వచ్చి ప్రశ్నించడంతో ఏమీ తెలియనట్టుగా క్షమాపణలు చెప్పాడు. కాగా మహిళ సహోద్యోగి బ్యాగ్ తెరిచి చూడగా, ఐఫోన్ కెమెరా రికార్డింగ్ మోడ్‌లో ఉన్నట్టు గుర్తించాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన మహిళతో సహా చాలా మంది మహిళల అసభ్య దృశ్యాలు అతని ఫోన్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడిని కోర్టులో హాజరపరచగా ఆర్నెళ్లు జైలు శిక్ష విధించారు.