ఏడేళ్లుగా మూతపడిన ‘స్కియాడ్’
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు స్థానికంగా లభించని శిక్షణ
- అప్పులు చేసి వేలాది రూపాయలు వెచ్చిస్తున్న వైనం
ఎస్కేయూ: అనంతపురంలోని బీసీ స్టడీ సర్కిల్ పక్కనే ఏర్పాటు చేసిన స్కియాడ్ (శ్రీకృష్ణదేవరాయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అకడమిక్ డెవలప్మెంట్ సెంటర్) ఏడేళ్లుగా మూతపడే ఉంది. గ్రూప్ - 1, 2 డీఎస్సీ, బ్యాంక్ ఉద్యోగాలు లాంటి పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణ తీసుకోవాలంటే వేలాది రూపాయలు చెల్లించాల్సి వస్తుండటంతో కరువు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లకు ఉపశమనం కలిగించే ఉద్దేశ్యంతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ, వృత్త్యంతర శిక్షణతోపాటు వసతి కల్పించడం, మెటీరియల్ అందించడం తదితర సదుపాయాలను ఈ సెంటర్ ద్వారా కల్పిస్తూ వచ్చారు.
దీని నిర్వహణకు అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తూ వచ్చింది. పర్యవేక్షణ బాధ్యతలను మాత్రం ఎస్కేయూకు అప్పగించి వర్సిటీ ప్రొఫెసర్‌ను స్కియాడ్ కో-ఆర్డినేటర్‌గా నియమించారు. మొదట్లో ఇది మంచి సేవలు అందించింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ఏడేళ్ల నుంచి దీనిని మూసేశారు. ఫలితంగా పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు వేలాది రూపాయలు అప్పులు చేసి హైదరాబాద్, విశాఖపట్టణం నగరాలకు వెళ్లి శిక్షణ తీసుకోవాల్సి వస్తోంది. స్కియాడ్ కో-ఆర్డినేటర్లు, ఎస్కేయూ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సరైన సమాచారం ఇవ్వడంలో విఫలం కావడం వల్లే నిధులు మంజూరు కాలేదనే విమర్శలు కూడా ఉన్నాయి.
కమిటీ నివేదికతోనైనా మోక్షం వచ్చేనా?
స్కియాడ్ స్థితిగతులపై నివేదిక సమర్పించేందుకు ఎస్కేయూ పాలకమండలి సభ్యుడు డాక్టర్ ఎం.బాబు అధ్యక్షతన ఈ ఏడాది ఓ కమిటీని నియమించారు. ఇందులో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎంవీ లక్ష్మయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రభాకర్ సభ్యులుగా ఉన్నారు. నిధుల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, భవనాలు ఆధునికీకరించాలని, సిబ్బందిని నియమించాలని పలు సిఫార్సులు, సూచనలు చేస్తూ కమిటీ నివేదిక తయారు చేసింది. రెండు వారాల కిందట దానిని వర్సిటీ ఉన్నతాధికారులకు అందించింది.