నెట్ యూజర్లపై నిఘా
లండన్: ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ యూజర్లపై క్రమంగా నిఘా కన్ను పెరుగుతోంది. ఇంతవరకు సర్వీసు ప్రొవైడర్ల వద్ద మాత్రమే ఉండే యూజర్ల బ్రౌజింగ్ హిస్టరీ వివిధ దేశాల పోలీసు వ్యవస్థ చేతుల్లోకి వెళుతోంది. ఈ విషయంలో బ్రిటన్ అన్ని దేశాలకన్నా ఒక అడుగు ముందే ఉన్నది. ఇంతవరకు యూజర్లు ఎన్ని వెబ్సైట్లలో బ్రౌజ్ చేశారో సమస్త సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా బ్రిటన్ ‘కొత్త ఇన్వెస్ట్గేటరీ పవర్స్ బిల్’ తీసుకొస్తోంది. ఇంటర్నెట్పై పోలీసులకు విస్తృత అధికారాలను కల్పిస్తున్న ఈ బిల్లు ముసాయిదాను రూపొందించింది.
ఈ బిల్లులో పేర్కొన్న పోలీసు అధికారాల ప్రకారం వారు ఎప్పుడైనా, ఏ యూజర్ బ్రౌజింగ్ హిస్టరీని ఇమ్మంటే ఆ యూజర్ బ్రౌజింగ్ హిస్టరీ కాదనుకుండా సంబంధిత సర్వీసు ప్రొవైడర్ ఇవ్వాల్సిందే. ఇందుకోసం ప్రతి యూజర్ బ్రౌజింగ్ హిస్టరీ ఏడాది కాలంపాటు సర్వీస్ ప్రొవైడర్ తప్పనిసరిగా భద్రపర్చాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వానికున్న కంప్యూటర్ హ్యాకింగ్ అధికారాలను కూడా విస్తృతం చేశారు. మొదటి బిల్లులో పోలీసులకు మాత్రమే హ్యాకింగ్ అధికారాలు ఇవ్వగా ఇప్పుడు పునర్ రూపొందించిన బిలులో ఆదాయం పన్నుశాఖ, హోం శాఖల అధికారాలకు కూడా హ్యాకింగ్ అధికారాలను కట్టబెట్టారు.
మొదటి బిల్లులో పోలీసుల్లో ముఖ్యదర్యాప్తు బృందానికి మాత్రమే, అదీ దొంగ వెబ్సైట్ల యూజర్ల బ్రౌజింగ్ వివరాలను తెలుసుకునే అవకాశం ఉండగా, పునర్ రూపొందించిన బిల్లులో ప్రతి యూజర్ బ్రౌజింగ్ హిస్టరీని పోలీసు వ్యవస్థలోని ప్రతి విభాగానికి తెలుసుకునే హక్కును కల్పించారు. టెలిఫోన్ కాల్ డాటాను అడిగట్లే ఇప్పుడు(ఇంటర్నెట్ కనెక్షన్ రికార్డ్స్-ఐసీఆర్) యూజర్ బ్రౌజింగ్ వివరాలను అడుగుతారు.
మొదటి బ్రౌజింగ్ బిల్లుపైనే విపక్షాల నుంచి విమర్శలు వచ్చినా పట్టించుకోని ప్రభుత్వం పోలీసు అధికారుల ఒత్తిడి మేరకు వారికి విస్తృత అధికారాలను కల్పిస్తూ సవరించిన బిల్లును తీసుకొచ్చింది. ఇంకా ఈ బిల్లును బ్రిటన్ ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. ఆధునిక యుగంలో నేరాల నైజం మారిపోయిందని, సున్నితమైన పంథాలో నేరాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టాలంటే ఇంటర్నెట్ యూజర్లపై తమ పట్టు ఉండాలన్నది బ్రిటన్ పోలీసు అధికారుల వాదన. దీనిపై సోషల్ మీడియా ఎలా స్పందిస్తుందో చూడాలి.