తాడేపల్లిగూడేనికి రింగ్ రోడ్డు
తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రింగ్ రోడ్డు నిర్మాణంతో పాటుగా పాత ఓవర్‌బ్రిడ్జి నుంచి రైల్వేస్టేషన్ వరకు మార్గం సుగమం చేసేందుకు ప్రతిపాదనలు చేసినట్టు దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు గురువారం తెలిపారు. పట్టణంలో రూ.19 కోట్లతో నిర్మిస్తున్న రహదారి పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. హౌసింగ్ బోర్డు గణేష్‌నగర్ బాపూజీ పుంతరోడ్డు, కుంచనపల్లి రోడ్డు మీదుగా జువ్వలపాలెం ఫుట్ బ్రిడ్జి వద్ద రహదారి వంతెన నిర్మించి ప్రధాన రహదారికి అనుసంధానం చేస్తామన్నారు. కొత్త ఫ్లై ఓవర్‌పై వన్‌వే ట్రాఫిక్ అమలు చేస్తామని చెప్పారు. ఈ వంతెన జంక్షన్ నుంచి కొండయ్య చెరువు వరకు రూ.75 లక్షలతో సీసీ రోడ్డు నిర్మిస్తామన్నారు. హైవేకు ఇరువైపులా సమాంతర రహదారులు ఏర్పాటుచేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బాదంపూడి జంక్షన్ నుంచి ప్రత్తిపాడు ‘సాక్షి’ జంక్షన్ వరకు 16వ నంబరు జాతీయ రహదారికి ఇరువైపులా సమాంతర రహదారులు నిర్మిస్తామన్నారు. కేంద్ర ఉపరితల రవాణాశాఖా మంత్రి ఈ ప్రతిపాదనలకు అంగీకరించారని మంత్రి చెప్పారు. మునిసిపల్ ఇంజినీర్ బ్రహ్మాజీ, ఆర్అండ్బీ డీఈ ఏడుకొండలు, బీజేపీ నాయకులు యెగ్గిన నాగబాబు ఆయన వెంట ఉన్నారు.