'అతడు ఉగ్రవాదంటే నమ్మలేక పోతున్నా'
ఢాకా: కొన్నాళ్ల క్రితం తప్పిపోయిన తన కుమారుడు ఉగ్రవాది అని పోలీసులు నిర్థారించడంతో తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యానని బంగ్లాదేశ్ లోని అవామీలీగ్ శాసన సభ్యుడు ఇంతియాజ్ ఖాన్ బాబుల్ అన్నారు. మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడు రోహన్ ఉగ్రవాదిగా మారడం ఊహించలేకపోయానన్నారు. మా ఇంట్లో ఉగ్రవాదానికి సంబంధించి ఎటువంటి సాహిత్యం లేదని, తన కుమారుడు ఈ దారుణానికి ఒడిగట్టి ఉండకపోవచ్చని ఖాన్ అన్నారు.
శుక్రవారం ఢాకాలోని హోలీ అర్టిసాన్ బేకరీలోకి చోరబడిన సాయుధులు 60 మందిని బంధించి అందులో 20 మంది విదేశీయుల్ని అతి కిరాతకంగా గొంతు కోసి చంపిన విషయం తెలిసిందే. నరమేధానికి కారణమైన ఆరుగురు ఉగ్రవాదుల్ని ఆర్మీ మట్టు పెట్టింది. ఇందులో ఐదుగురు ఉన్నత కుటుంబాలకు చెందిన వారున్నారు. వీరంతా 18 ఏళ్ల లోపున్న వారేనని, దేశీయ ఉగ్రవాద సంస్థ అయిన జమేతుల్ ముజాహుదీన్ బంగ్లాదేశ్(జేఎమ్ బీ) కి చెందిన వారని ప్రభుత్వం ప్రకటించింది.