ఇలాగైతే టెస్టుల్లో ఎలా?
ఆశ్చర్యమేమీ లేదు...దక్షిణాఫ్రికాలో సవాల్ ఎదురు కానుందని భారత జట్టు ముందుగా ఊహించిందే. సొంత గడ్డపై అద్భుతాలు సృష్టించిన టీమిండియాకు రాబోయేది పూల బాట కాదని కూడా తెలిసిన విషయమే. అక్కడికి వెళ్లి మనవాళ్లు పాత రికార్డులు బద్దలు కొట్టి అద్భుత విజయాలు సాధిస్తారని కూడా ఎవరూ ఆశించలేదు. కానీ ఇప్పుడు సమస్య భారత్ వన్డేల్లో ఓడిపోవడం కాదు. ఓడిపోయిన తీరు. బ్యాట్స్‌మెన్ కనీసం 50 ఓవర్ల పాటు క్రీజ్‌లో నిలబడలేకపోయారు. భారత జట్టు వరుసగా రెండు వన్డేల్లో వందకు పైగా పరుగుల తేడాతో ఓడిపోవడం 2006 తర్వాత ఇదే మొదటిసారి.
బ్యాటింగ్ తడబాటు: కొన్నాళ్ల క్రితం ఇండియా ‘ఎ’ జట్టు సభ్యుడిగా ఇక్కడికి వచ్చిన ధావన్ అనధికారిక వన్డేలో డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఇప్పుడు కూడా తాను సత్తా చాటుతానంటూ సఫారీ గడ్డపై అడుగు పెట్టాడు. కానీ అప్పుడు ఆడిన ప్రిటోరియాలాంటి నాసిరకం వికెట్‌తో పోలిస్తే ఎంతో తేడా ఉండే వాండరర్స్, కింగ్స్‌మీడ్‌లలో బంతిని అంచనా వేయలేక అవుటయ్యాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగల నేర్పు ఉన్న కోహ్లి... సూపర్ ఫామ్‌లో కనిపించిన రోహిత్ శర్మలది కూడా ఇదే పరిస్థితి. ధోని ఈ విషయంలో తన అసంతృప్తిని దాచుకోలేదు. ‘గత కొన్ని సిరీస్‌లలో మా మిడిలార్డర్ పెద్దగా రాణించలేదు. అయితే అప్పుడు సమస్య తెలీలేదు. ఈ సిరీస్‌లో టాపార్డర్ ఒక్కసారిగా విఫలమైంది.
దాంతో తర్వాతి ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగింది. వారు తమ స్థాయికి తగ్గట్లుగా ఆడటం లేదు. మొత్తంగా బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు’అని అతను వ్యాఖ్యానించాడు. రెండో వన్డేలో బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై కూడా మన బ్యాట్స్‌మెన్ సఫలం కాలేదు. ఇది తనను పూర్తిగా నిరాశ పరచిందని కెప్టెన్ అన్నాడు. ‘ఫ్లాట్ పిచ్‌పై కూడా మనం పరుగులు చేయలేకపోయాం. అది ఫాస్ట్ బౌలర్లకు పెద్దగా అనుకూలించలేదు కూడా. కానీ చెత్త షాట్లు ఆడి అవుట్ కావడం ఆశ్చర్యంగా ఉంది’ అని ధోని అభిప్రాయ పడ్డాడు.
బౌలింగ్ ఓకేనా: తొలి వన్డేతో పోలిస్తే రెండో మ్యాచ్‌లో భారత బౌలింగ్ కాస్త మెరుగు పడింది. డర్బన్ వన్డేలో సునాయాసంగా 325 పరుగులు చేస్తుందనుకున్న సఫారీలను చాలా ముందుగా మన బౌలర్లు నిలువరించారు. మధ్య ఓవర్లలో ఆ జట్టును కట్టడి చేసిన తీరు మన బౌలర్లపై కాస్త విశ్వాసాన్ని పెంచింది. ముఖ్యంగా మొహమ్మద్ షమీ ఆకట్టుకున్నాడు. ఈ ప్రదర్శన టెస్టుల్లో మనకు ఉపయోగ పడవచ్చు. ‘సీమ్‌పై నియంత్రణతో చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌లో షమీ బౌలింగ్ చేస్తున్నాడు. రెండో వన్డేలో రివర్స్ స్వింగ్‌ను కూడా ఉపయోగించుకున్నాడు. ఇది చాలా కీలకం. పరిస్థితులకు అతను చాలా తొందరగా అలవాటు పడ్డాడు. ఈ సిరీస్‌లో మనకు లభించిన మరో మంచి ఆటగాడు షమీ’ అని ధోని ప్రశంసించాడు.
నేర్చుకుంటున్నారా: వన్డేల్లో మన జట్టు ఆటతీరు చూస్తే మాత్రం టెస్టులో అనుకూల ఫలితాలు ఆశించడం అత్యాశే అవుతుంది. అయితే వన్డే సిరీస్‌లో ఓటమిపాలైనా అక్కడి పరిస్థితులు, వికెట్ల గురించి తెలుసుకునేందుకు మన ఆటగాళ్లకు అవకాశం దక్కింది. టెస్టులకంటే ముందు వన్డే సిరీస్ ఉండటం కొంత వరకు ఉపయోగపడింది. ఒక్క మాటలో చెప్పాలంటే వీటిని ఫలితాలు తేల్చే పరీక్షలు అనడంకన్నా ‘నేర్చుకునే తరగతి గదులు’ అనుకోవడం మన ఆటగాళ్లకు మంచి చేస్తుందేమో. ఎందుకంటే మన బ్యాట్స్‌మెన్‌లో చాలా మందిలో మంచి ప్రతిభ ఉంది. కోహ్లి, పుజారా, రోహిత్, ధావన్‌లు సుదీర్ఘ సమయం పాటు క్రీజ్‌లో నిలిచి ప్రత్యర్థి బౌలర్లను విసిగించాల్సి ఉంటుంది. ఇలాంటి కఠిన పర్యటనల్లో ఆడి రాటుదేలితేనే భారత భవిష్యత్తు బాగుంటుంది. ద్రవిడ్ రాటు దేలింది వాండరర్స్‌లోనే... సెహ్వాగ్ మెరుపులు మొదలైందీ సఫారీ గడ్డపైనే... ఈ స్ఫూర్తితో యువ క్రికెటర్లు కాస్త మనసు పెట్టాలి.