Special vigilance
-
రేపటి నుంచి డిగ్రీ పరీక్షలు
ఎచ్చెర్ల:డిగ్రీ పరీక్షల నిర్వహణకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. బుధవారం నుంచి జరగనున్న పరీక్షల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న 93 ఎఫిలియేటెడ్ కళాశాలల నుంచి రెగ్యులర్, సప్లిమెంటరీతో కలిపి 50,440 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షల నిర్వహణపై వీసీ హనుమంతు లజపతిరాయ్ రెక్టార్ మిర్యాల చంద్రయ్య, రిజస్ట్రార్ వడ్డాది కృష్ణమోహన్, పరీక్షల నిర్వహణాధికారి పెద్దకోట చిరంజీవులతో సోమవారం సమావేశమయ్యారు. గత ఏడాది తలెత్తిన సమస్యలు, ఈసారి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై చర్చించారు. 43 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వీసీ చెప్పారు. అన్ని కేంద్రాల్లో ప్రత్యేక అబ్జర్వర్లు, స్క్వాడ్‌ను నియమిస్తామన్నారు. పరిశీలకుల సమక్షంలో గంట ముందు ప్రశ్న పత్రాల కట్టలు తెరవనున్నట్టు పేర్కొన్నారు. ప్రత్యేక సీల్ చేసిన ప్రశ్న పత్రాలను స్ట్రాంగ్ రూంల్లో భద్ర పరిచామని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రశ్నపత్రాలు ముందుగా తెరిచినట్టు తెలిస్తే ఆ కళాశాల అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో ఆరోపణలు ఉన్న కళాశాలలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. తృతీయ ఏడాది పరీక్షలు ఈ నెల నాలుగు నుంచి 17వ తేదీ వరకు మధ్యాహ్నం రెండు నుంచి ఐదు గంటల వరకు జరుగుతాయని వివరించారు. అలాగే మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఈ నెల 19 నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు జరుగుతాయని వివరించారు. ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, ద్వితీయ ఏడాది పరీక్షలు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్షలు జరుగుతున్న తీరును వర్సిటీ అధికారులు కూడా ఆకస్మికంగా పరిశీలిస్తారన్నారు. డిగ్రీ మూడేళ్లకు సంబంధించి సుమారు మూడు వేల మంది విద్యార్థులు రీవ్యాల్యూయేషన్‌కు దరాఖాస్తులు చేసుకున్నారని, వీరికి వారం రోజుల్లో మార్కుల జాబితాలు అందజేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. -
డీసీసీబీ బ్రాంచ్‌లపై ప్రత్యేక నిఘా !
సాక్షి ప్రతినిధి, విజయనగరం : బినామీ రుణాలు వెలుగు చూసిన నేపథ్యంలో సహకార శాఖ అప్రమత్తమయింది. తాజాగా చేస్తున్న రుణమాఫీలో బినామీలు లబ్ధి పొందే అవకాశం ఉందని భావించి, ప్రత్యేక దృష్టి సారించింది. రుణ మాఫీ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలున్న జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) బ్రాంచ్‌లపై నిఘా పెట్టాలని నిర్ణయించింది. ఈమేరకు జిల్లా సహకార శాఖాధికారికి ఆ శాఖ రిజిస్ట్రార్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని డీసీసీబీ బ్రాంచ్లన్నింటికీ అసిస్టెంట్ రిజిస్ట్రార్లను పర్యవేక్షక అధికారులుగా నియమించాలని, విజయనగరం, పార్వతీపురం డివిజన్లలో డివిజనల్ సూపర్వైజర్ స్థాయి అధికారులను నియమించాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. దీంతో హుటాహుటిన జిల్లా సహకార అధికారి వెంకటరావు బ్రాంచ్కొక పర్యవేక్షక అధికారిని నియమించారు. అలాగే డివిజన్కొక సూపర్వైజర్ను నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరి పర్యవేక్షణలో లబ్ధిదారుల ఖాతాలకు మాఫీ మొత్తాన్ని జమ చేయనున్నారు. ఈ క్రమంలో ముందుగా లబ్ధిదారుల నుంచి అఫిడవిట్(రుణ మొత్తాన్ని తీసుకున్నట్టు)ను తీసుకోనున్నారు. ఈ సమయంలో రికార్డుల్లో ఉన్న మేరకు రుణం తీసుకోలేదని ఎవరైనా రైతులు చెబితే ఆ మొత్తం బినామీలు తీనేశారని భావించనున్నారు. తదనుగుణంగా చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలోని సహకార సంఘాల్లో పెద్ద ఎత్తున బినామీ రుణా లు తీసుకున్నారు. గతంలో పలు సొసైటీల్లో జరిగిన విచారణలో ఈ విషయం బయటపడింది. తాజాగా రావివలస, చెముడు పీఏసీఎస్‌లలో కూడా ఇటువంటి వ్యవహారలు వెలుగుచూశాయి. సొసైటీలన్న తర్వాత బినామీ రుణాలు ఉండటం ఖాయమనే అభిప్రాయం అందరికీ వచ్చేసింది. చివరికీ అసెంబ్లీలో కూడా చర్చకొచ్చింది. దీనికంతటికీ ఫైనాన్స్ బ్యాంకింగ్ అయిన డీసీసీబీ మూలమనే వాదన వినిపిస్తోంది. సీబీసీఐడీ విచారణకు సైతం ఇటీవల సర్కార్ ఆదేశించింది. ఈ నేపధ్యంలో సహకార శాఖ రిజిస్ట్రార్ ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. సహకార బ్రాంచ్‌ల రుణమాఫీ లావాదేవీలపై నిఘా పెట్టాలని నిర్ణయించారు. జిల్లాలోని డీసీసీబీ పరిధిలో గల 15 బ్రాంచ్‌లలో 87,777మంది పేర్లను రుణమాఫీ కోసం అప్లోడ్ చేశారు. సుమారు రూ.90.46కోట్ల బకాయిలున్నట్టు తేల్చారు. అయితే, ఇందులో 39,259 మందికి రూ.46.33 కోట్ల మేరకు తాజాగా మాఫీ కింద మంజూరైంది. ఇప్పుడా మొత్తం రైతుల ఖాతాల్లో బ్రాంచ్‌ల వారీగా జమ అవుతోంది. ఈ క్రమంలో ఎటువంటి తేడాలు జరిగినా సంబంధిత మేనేజర్లు బాధ్యత వహించాలని ఇప్పటికే సర్కార్ హెచ్చరించింది. అయితే, వారిపై నమ్మకం లేదో, మరేంటో తెలియదు గాని తాజాగా రుణమాఫీ జమ విషయంలో మరింత నిఘా పెట్టాలన్న ఉద్దేశంతో పర్యవేక్షణ అధికారులను నియమించాలని జిల్లా సహకార అధికారికి రాష్ట్ర రిజిస్ట్రార్ ఆదేశించారు. జమ చేసే ముందు ఎంత రుణం తీసుకున్నారన్నదానిపై రైతుల నుంచి అఫిడవిట్ తీసుకోవాలని, దాంట్లో పేర్కొన్న మొత్తాన్ని, రికార్డుల్లో ఉన్న రుణ మొత్తాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలని సూచించారు. దీనివల్ల బినామీ రుణాలెంతమేరకు ఉన్నాయో తెలుతాయని రిజిస్ట్రార్ సందీప్‌కుమార్ సుల్తానియా శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రిజిస్ట్రార్ దగ్గర నుంచి ఉత్తర్వులు రావడమే తరువాయి వెంటనే జిల్లా సహకార అధికారి వెంకటరావు డీసీసీబీ పరిధిలో ఉన్న 15 బ్రాంచ్‌లకు పర్యవేక్షణ అధికారుల(అసిస్టెంట్ రిజిస్ట్రార్ స్థాయి)ను నియమించారు. విజయనగరం వీటి అగ్రహారం బ్రాంచ్‌కు కె.అప్పలనాయు డు, నెల్లిమర్ల బ్రాంచ్‌కు వి.వి.ఎస్.శర్మ, పూసపాటిరేగ కు ఎం.వాణి శైల జ, గంట్యాడకు డి. స్వర్ణలత, గజపతినగరానికి ఎస్.సుగుణాకరరావు, చీపురుపల్లికి ఎం.బాబ్జీరావు, గరివిడిరి కె.దక్షిణామూర్తి, కొత్తవలసకు పి.లక్ష్మణరావు, ఎస్కోటకు ఎస్.రామకృష్ణ, పార్వతీపురానికి ఎ.జార్జ్, సాలూరుకు ఎస్.మాధవరావు, బొబ్బిలికి పి.జనార్దనరావు, సీతానగరానికి ఎం.గౌరీప్రసాద్, తెర్లాంకు కె.వి.రమణమూర్తి, బలిజపేటకు ఎం.త్రినాథ్, విజయనగరం డీసీసీబీ బ్రాంచ్‌కు బి.మురళీధరరావులను పర్యవేక్షక అధికారులుగా నియమించారు. వీరితో పాటు విజయనగరం డివిజన్‌కు సూపర్వైజరీ అధికారిగా జిల్లా సహకార శాఖ అడిట్ ఆఫీసర్ పి.బాంధవరావును, పార్వతీపురం డివిజన్‌కు డిప్యూటీ రిజి స్ట్రార్ కె. కృష్ణారావును నియమించారు. వీరందరికీ బ్రాంచ్‌ల వారీ గా రుణ మాఫీ లబ్ధిదారుల జాబితా, రుణ రికార్డులను సమకూర్చాలని ఇప్పటికే డీసీసీబీ సీఈఓను జిల్లా సహకార శాఖ అధికారి వెంకటరావు కోరారు. మొత్తానికి డీసీసీబీ బ్రాంచ్‌లపై నిఘా పెరిగింది. రుణమాఫీ నిధులు జమ నేపథ్యంలో బినామీల భాగోతం తేలనుంది. -
నకిలీ విజిలెన్స్ అధికారి గుట్టు రట్టు
- నిందితుడు మాజీ ఎంపీటీసీ సభ్యుడు - పోలీసుల అదుపులో డ్రైవర్, కారు - కేసు నీరుగార్చేందుకు యత్నం కరీంనగర్ క్రైం : అతడో మాజీ ఎంపీటీసీ సభ్యుడు. ప్రజాప్రతినిధిగా ఉంటే ఏముందనుకున్నాడో ఏమో ఏకంగా స్పెషల్ విజిలెన్స్ అధికారిగా అవతారమెత్తాడు. తాను ప్రత్యేక అధికారినని చెప్పుకుంటూ వ్యాపారులను బెదిరిస్తూ అందిన కాడికి దోచుకున్నాడు. లక్షల రూపాయలు వసూలు చేసిన అ తడి బండారాన్ని చివరకు పోలీసులు బట్టబయలు చేశారు. కమాన్‌పూర్ మండలంలోని పిల్లిపల్లి గ్రామానికి చెందిన పిల్లి చంద్రశేఖర్ కమాన్‌పూర్-2 మాజీ ఎంపీటీసీ సభ్యుడు. ముదిరాజ్ సంఘ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న అతడు ప్రస్తుతం టీఆర్ఎస్లో కొనసాగుతున్నాడు. కొన్ని నెలలుగా విజిలెన్స్ అధికారుల దాడులు పెరిగిపోవడంతో అతడు కూడా విజిలెన్స్ అధికారిగా అవతారమెత్తాడు. ఓ కారు(ఏపీ 36 ఎస్ 2727 స్విఫ్ట్ డిజైర్)లో తిరుగుతూ తన సహాయకుడు పిట్టల సమ్మయ్య సాయంతో గోదాములు, వ్యాపార సముదాయాలకు తనిఖీకి వెళ్లేవాడు. తాను హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక విజిలెన్స్ అధికారినని చెప్పి రిజిస్టర్లు, రికార్డులు పరిశీలించేవా డు. రికార్డులు సరిగా లేవని, పెద్దమొత్తంలో జరిమానా వేయాల్సి ఉంటుందని భయపెట్టేవాడు. తాను ముందుగా వచ్చానని పెద్దసార్లు వస్తే ఇంకా ఎక్కువ జరిమానా విధిస్తారని భయపెట్టేవాడు. అతడి సహాయకుడు సమ్మయ్య కూడా సార్ బాగా స్ట్రిక్ట్ కేసులు నమోదు చేస్తాడంటూ వ్యాపారులను భయపెట్టేవాడు. చివరకు బేరం కుదుర్చుకుని అందినకాడికి పట్టుకుని వెళ్తుండేవాడు. ఇలా ఇప్పటివరకు పెద్దపల్లి, సుల్తానాబాద్, జగిత్యాల, కరీంనగర్, కోరుట్ల ప్రాంతాలో రూ. 20 లక్షలకు పైగా వసూలు చేశారని సమాచారం. చిక్కిందిలా.. నాలుగు రోజుల క్రితం నగరంలోని గంజ్ ప్రాంతంలో ఉన్న ఓ బియ్యం వ్యాపారికి చెందిన గోదాం వద్దకు వెళ్లిన చంద్రశేఖర్, అతడి సహాయకుడు సమ్మయ్య రికార్డులు పరిశీలించా రు. వ్యాపారి రికార్డులు సరిగానే ఉన్నా పలు కారణాలు చెబుతూ నీపై కేసులు నమోదవుతాయని భయపెట్టారు. వీరిపై అనుమానం వచ్చిన వ్యాపారి వారి మాటలు రికార్డు చేశాడు. చంద్రశేఖర్ రూ.5 లక్షలు డిమాండ్ చేయగా, రూ. లక్ష ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. రూ. 50 వేలు ఇచ్చి, సాయంకాలం మిగతా ది ఇస్తానని చెప్పా డు. ఆ తర్వాత వన్‌టౌన్ సీఐ కరుణాకర్‌కు సమాచారం అందిం చాడు. పోలీసులు చంద్రశేఖర్‌ను నకిలీ అధికారిగా గుర్తించారు. సాయంకాలం సమ్మయ్య డబ్బుల కోసం రాగా అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి విచారించారు. పలు ప్రాంతాల్లో ఇలాగే వసూలు చేశామని చెప్పడంతో పిల్లి చంద్రశేఖర్, సమ్మయ్యపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం చంద్రశేఖర్ పరారీలో ఉన్నాడు. పోలీసులపై ఒత్తిడి... నకిలీ విజిలెన్స్ అధికారిగా పలువురిని మోసం చేసిన పిల్లి చంద్రశేఖర్ అధికార పార్టీలో ఉండడంతో కేసు నీరుగార్చేం దుకు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అతడు కమాన్‌పూర్ మండలానికి చెందిన ఎంపీటీసీల క్యాంపునకు వెళ్లాడని తెలిసింది. ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోలీసులు విచారణ చేపడితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై ప్రత్యేక నిఘా
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: రాబోయే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులపై ప్రత్యేక నిఘా ఉంటుందని కలెక్టర్ సౌరభ్‌గౌర్ అన్నారు. ఎన్నికల వ్యయం ధరల నిర్ధారణపై మీడియా ప్రకటనల విభాగం, హోటల్స్, క్లాత్ మర్చంట్స్, ట్రావెల్ సంస్థలు, షామియాన, మైక్, లైటింగ్ తదితర సంస్థలతో కలెక్టర్ కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీలో నిలిచే అభ్యర్థులు ప్రచార కార్యక్రమంలో వినియోగించే సేవలకు అరుున ఖర్చు వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. ప్రచారంలో అభ్యర్థులు భోజనాలు, విందులు ఏర్పాటుచేయరాదన్నారు. నగదు పంపిణీ, మద్యం విక్రయూల నియంత్రణకు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పరిమితికి మించి ఖర్చు చే సే అభ్యర్థులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఖర్చులో 40 శాతం మీడియూలో ప్రచారానికి వినియోగించే అవకాశం ఉందన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ప్రజాప్రతినిధుల చట్టం 1951, ఎన్నికల నిర్వహణ చట్టం 1961, ఇండియన్ పీనల్ కోడ్ 1860, ఆదాయపు పన్ను చట్టం కింద చర్యలు తీసుకుంటామన్నారు. అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఫలితాలు వెల్లడైనంత వరకు సెక్షన్-10 ఏ ప్రకారం వివిధ శాఖలు ఖర్చులను లెక్కిస్తామన్నారు. అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసిన రోజునే నూతనంగా బ్యాంకు ఖాతాను తెరచి వివరాలను రిటర్నింగ్ అధికారికి అందించాలన్నారు. ఆ ఖాతా నుంచే చెల్లింపులు జరపాలని సూచించారు. పోస్టర్లు , కరపత్రాలు ముద్రించే సంస్థలు వాటిపై తమ పేరు, చిరునామాను స్పష్టంగా ముద్రించాలని ఆదేశించారు. రూ. 50 వేలకు పైబడి రవాణా చేస్తే వాటి వివరాలు విధిగా చూపించాలన్నారు. రూ. 10వేలు దాటిన మద్యం, గిఫ్ట్ ఆర్టికల్స్ రవాణా చేయడం నేరమన్నారు. ఏజేసీ ఎండీ హషీమ్ షరీఫ్ మాట్లాడుతూ వివిధ సంఘాలు తమ సరఫరా చేసే ధరల వివరాలను ఈ నెల 3 నాటికి అందించాలన్నారు. మీడియా సర్టిఫికేషన్, మోనిటరింగ్ కమిటీ కింద పెయిడ్ న్యూస్, ప్రకటనలు ఇటీవల కాలంలో అధికంగా వస్తున్నాయని, వీటిపై ఎన్నికల సంఘం దృష్టి సారించిందని చెప్పారు. ప్రకటనలకు కనీసం మూడు రోజుల ముందు ఎంసీఎంసీ కమిటీ నుంచి అనుమతి పొందాలన్నారు. మీడియాలో ఒక అభ్యర్థికి అనుకూలంగా ప్రజలను ప్రభావితం చేసే వార్తలు, ఫొటోలు పెయిడ్ న్యూస్‌గా పరిగణించడం జరుగుతుందని చెప్పారు. సమావేశంలో రవాణా శాఖ ఉపకమిషనర్ ఎస్.వెంకటేశ్వరరావు, డీపీఆర్వో ఎల్.రమేష్, ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ సత్యనారాయణ, మీడియా ప్రకటన విభాగం ప్రతినిధులు, వివిధ వాణిజ్య, వ్యాపార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.