డీసీసీబీ బ్రాంచ్‌లపై ప్రత్యేక నిఘా !
సాక్షి ప్రతినిధి, విజయనగరం : బినామీ రుణాలు వెలుగు చూసిన నేపథ్యంలో సహకార శాఖ అప్రమత్తమయింది. తాజాగా చేస్తున్న రుణమాఫీలో బినామీలు లబ్ధి పొందే అవకాశం ఉందని భావించి, ప్రత్యేక దృష్టి సారించింది. రుణ మాఫీ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలున్న జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) బ్రాంచ్‌లపై నిఘా పెట్టాలని నిర్ణయించింది. ఈమేరకు జిల్లా సహకార శాఖాధికారికి ఆ శాఖ రిజిస్ట్రార్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని డీసీసీబీ బ్రాంచ్‌లన్నింటికీ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌లను పర్యవేక్షక అధికారులుగా నియమించాలని, విజయనగరం, పార్వతీపురం డివిజన్లలో డివిజనల్ సూపర్‌వైజర్ స్థాయి అధికారులను నియమించాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. దీంతో హుటాహుటిన జిల్లా సహకార అధికారి వెంకటరావు బ్రాంచ్‌కొక పర్యవేక్షక అధికారిని నియమించారు. అలాగే డివిజన్‌కొక సూపర్‌వైజర్‌ను నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
వీరి పర్యవేక్షణలో లబ్ధిదారుల ఖాతాలకు మాఫీ మొత్తాన్ని జమ చేయనున్నారు. ఈ క్రమంలో ముందుగా లబ్ధిదారుల నుంచి అఫిడవిట్(రుణ మొత్తాన్ని తీసుకున్నట్టు)ను తీసుకోనున్నారు. ఈ సమయంలో రికార్డుల్లో ఉన్న మేరకు రుణం తీసుకోలేదని ఎవరైనా రైతులు చెబితే ఆ మొత్తం బినామీలు తీనేశారని భావించనున్నారు. తదనుగుణంగా చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలోని సహకార సంఘాల్లో పెద్ద ఎత్తున బినామీ రుణా లు తీసుకున్నారు. గతంలో పలు సొసైటీల్లో జరిగిన విచారణలో ఈ విషయం బయటపడింది. తాజాగా రావివలస, చెముడు పీఏసీఎస్‌లలో కూడా ఇటువంటి వ్యవహారలు వెలుగుచూశాయి. సొసైటీలన్న తర్వాత బినామీ రుణాలు ఉండటం ఖాయమనే అభిప్రాయం అందరికీ వచ్చేసింది. చివరికీ అసెంబ్లీలో కూడా చర్చకొచ్చింది. దీనికంతటికీ ఫైనాన్స్ బ్యాంకింగ్ అయిన డీసీసీబీ మూలమనే వాదన వినిపిస్తోంది. సీబీసీఐడీ విచారణకు సైతం ఇటీవల సర్కార్ ఆదేశించింది. ఈ నేపధ్యంలో సహకార శాఖ రిజిస్ట్రార్ ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. సహకార బ్రాంచ్‌ల రుణమాఫీ లావాదేవీలపై నిఘా పెట్టాలని నిర్ణయించారు.
జిల్లాలోని డీసీసీబీ పరిధిలో గల 15 బ్రాంచ్‌లలో 87,777మంది పేర్లను రుణమాఫీ కోసం అప్‌లోడ్ చేశారు. సుమారు రూ.90.46కోట్ల బకాయిలున్నట్టు తేల్చారు. అయితే, ఇందులో 39,259 మందికి రూ.46.33 కోట్ల మేరకు తాజాగా మాఫీ కింద మంజూరైంది. ఇప్పుడా మొత్తం రైతుల ఖాతాల్లో బ్రాంచ్‌ల వారీగా జమ అవుతోంది. ఈ క్రమంలో ఎటువంటి తేడాలు జరిగినా సంబంధిత మేనేజర్లు బాధ్యత వహించాలని ఇప్పటికే సర్కార్ హెచ్చరించింది. అయితే, వారిపై నమ్మకం లేదో, మరేంటో తెలియదు గాని తాజాగా రుణమాఫీ జమ విషయంలో మరింత నిఘా పెట్టాలన్న ఉద్దేశంతో పర్యవేక్షణ అధికారులను నియమించాలని జిల్లా సహకార అధికారికి రాష్ట్ర రిజిస్ట్రార్ ఆదేశించారు. జమ చేసే ముందు ఎంత రుణం తీసుకున్నారన్నదానిపై రైతుల నుంచి అఫిడవిట్ తీసుకోవాలని, దాంట్లో పేర్కొన్న మొత్తాన్ని, రికార్డుల్లో ఉన్న రుణ మొత్తాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలని సూచించారు. దీనివల్ల బినామీ రుణాలెంతమేరకు ఉన్నాయో తెలుతాయని రిజిస్ట్రార్ సందీప్‌కుమార్ సుల్తానియా శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రిజిస్ట్రార్ దగ్గర నుంచి ఉత్తర్వులు రావడమే తరువాయి వెంటనే జిల్లా సహకార అధికారి వెంకటరావు డీసీసీబీ పరిధిలో ఉన్న 15 బ్రాంచ్‌లకు పర్యవేక్షణ అధికారుల(అసిస్టెంట్ రిజిస్ట్రార్ స్థాయి)ను నియమించారు. విజయనగరం వీటి అగ్రహారం బ్రాంచ్‌కు కె.అప్పలనాయు డు, నెల్లిమర్ల బ్రాంచ్‌కు వి.వి.ఎస్.శర్మ, పూసపాటిరేగ కు ఎం.వాణి శైల జ, గంట్యాడకు డి. స్వర్ణలత, గజపతినగరానికి ఎస్.సుగుణాకరరావు, చీపురుపల్లికి ఎం.బాబ్జీరావు, గరివిడిరి కె.దక్షిణామూర్తి, కొత్తవలసకు పి.లక్ష్మణరావు, ఎస్‌కోటకు ఎస్.రామకృష్ణ, పార్వతీపురానికి ఎ.జార్జ్, సాలూరుకు ఎస్.మాధవరావు, బొబ్బిలికి పి.జనార్దనరావు, సీతానగరానికి ఎం.గౌరీప్రసాద్, తెర్లాంకు కె.వి.రమణమూర్తి, బలిజపేటకు ఎం.త్రినాథ్, విజయనగరం డీసీసీబీ బ్రాంచ్‌కు బి.మురళీధరరావులను పర్యవేక్షక అధికారులుగా నియమించారు. వీరితో పాటు విజయనగరం డివిజన్‌కు సూపర్‌వైజరీ అధికారిగా జిల్లా సహకార శాఖ అడిట్ ఆఫీసర్ పి.బాంధవరావును, పార్వతీపురం డివిజన్‌కు డిప్యూటీ రిజి స్ట్రార్ కె. కృష్ణారావును నియమించారు. వీరందరికీ బ్రాంచ్‌ల వారీ గా రుణ మాఫీ లబ్ధిదారుల జాబితా, రుణ రికార్డులను సమకూర్చాలని ఇప్పటికే డీసీసీబీ సీఈఓను జిల్లా సహకార శాఖ అధికారి వెంకటరావు కోరారు. మొత్తానికి డీసీసీబీ బ్రాంచ్‌లపై నిఘా పెరిగింది. రుణమాఫీ నిధులు జమ నేపథ్యంలో బినామీల భాగోతం తేలనుంది.