మార్గదర్శకాలు ఇస్తేనే ప్రాధాన్యాలు చెప్తాం
ఐఏఎస్‌ల సంఘం తీర్మానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఐఏఎస్‌ల పంపిణీకి మార్గదర్శకాలు ఇవ్వకుండా ఏ రాష్ట్రానికి వెళతారని ప్రాధాన్యతలు అడగటం సమంజసం కాదని రాష్ట్ర ఐఏఎస్‌ల సంఘం అభిప్రాయపడింది. ఈ మేరకు గురువారం ఇక్కడ జరిగిన ఐఏఎస్‌ల సంఘం సమావేశం తీర్మానించింది. ఇదే విషయాన్ని శుక్రవారం గవర్నర్ నరసింహన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతిని కలిసి సంఘం ప్రతినిధులు స్పష్టం చేయనున్నారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి గురువారం సచివాలయంలో విభజనపై అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఎక్కువ సమయం ఐఏఎస్ అధికారుల పంపిణీపైనే ఆయన మాట్లాడారు. ఆప్షన్స్ చెప్పిన తరువాత రోస్టర్ విధానంలో లాటరీ పద్ధతిలో ఐఏఎస్ అధికారుల పంపిణీ జరుగుతుందని వివరించారు. అయితే మెజారిటీ ఐఏఎస్‌లు ఏ ప్రాంతం వారిని ఆ ప్రాంతానికి కేటాయించకుండా ఆప్షన్స్‌లో రోస్టర్ విధానం అవలంబించటాన్ని వ్యతిరేకించారు.