మహమ్మారి
పదం నుంచి పథంలోకి 11
పిఠాపురం క్రీ .శ ...700 , నేటి పిఠాపురం
జంధ్యం తెగలాగి వీపుమీద తన్నిన తాపుకి కోట బయటకొచ్చి పడ్డాడు సుబ్బిశాస్త్రి. ఏ పాపమూ ఎరుగనని ఎంత మొత్తుకున్నా విన్నవాళ్లు లేరు. గుడిలో అమ్మవారి రత్నాలహారాన్ని దొంగిలించి సిద్ధులగుట్టలో చాకలిసానికి ఇచ్చాడని పంచాయితీలో అందరూ నమ్మారు. బ్రాహ్మణ పుట్టుక వల్ల పెద్ద శిక్ష తప్పింది. కాలో చెయ్యో నరక్కుండా వెలివేసి వదిలారు. కారుతున్న రక్తం పంచె చెంగుతో తుడుచుకుంటూ ఎటువెళ్లాలో దిక్కుతోచక నిట్టూరుస్తూ లేచి అలాగే నిలుచుండి పోయాడు.
గుడిలో నగల భోషాణానికి వేసిన ఐదు తాళాలూ వేసినవి వేసినట్లే ఉన్నాయి. తాళం చెవులు ఒక్కొక్కటి కరణం శ్రీకంఠయ్య, గణాచారి శివలింగప్ప, పంచాణం కంసాలి కొమరయ్య, తలారి నాగయ్య లెంక, భొగంసాని చంద్రవ్వల ఇళ్లలో ఉంటాయి. వాటిలో ఏ ఒక్కటి లేకపోయినా పెట్టె తెరవటం సాధ్యం కాదు. మూసి వున్న భోషాణంలో హారం ఆ చాకలిదానికి ఎలా చేరిందో తెలీదు. గారడీ విద్య చేసే లింగబోయడి సహాయంతో తాను ఆ హారాన్ని మాయం చేసి తనకిచ్చాడని దాని వాంగ్మూలం. దానికి ఋజువు హారానికి చుట్టబెట్టిన పట్టుగుడ్డ. అది తన ఉత్తరీయం నుండి చింపినదే. ఇంట్లో బట్టలబుట్టలోని కొత్త ఉత్తరీయంలో ముక్క బయటకెలా వచ్చినట్లు? సాక్ష్యానికి లింగడు కూడా లేడు. ఎక్కడ మాయమయ్యాడో?
సిద్దులగుట్ట్ట పురహూతి ఉపాసకులకీ నెలవు. ఒకవేళ గారడీ ద్వారానే హారాన్ని దొంగిలిస్తే అదెలా జరిగిందో అక్కడి మంత్రగాళ్లకి తెలియకపోదు. నిశ్చయానికి వచ్చి దూరంగా కనిపించే గుట్టవైపు నడిచాడు.
అదొక చంపుడుగుడి.
చేతిలో కుళ్లి ఈగలు ముసురుతున్న మనిషి తలతో పురహూతిక భయంకరమైన విగ్రహం చూసే ధైర్యం లేక తల వంచుకుని బిరబిరా అడుగులేస్తూ మహామారీచి వద్దకి చేరాడు సుబ్బిశాస్త్రి. మహామారీచివి లోతైన పెద్ద కళ్లు. నుదుటిపై నల్లని బొట్టు. తల మీద మర్రిపాలతో చుట్టిన సిగకొప్పు. మెడలో పుర్రెల మాల. బంగారం, పాదరసాల మిశ్రమంతో పూసిన మైపూత తప్ప వేరే ఆచ్ఛాదనం లేని శరీరం.
మొదట చూసి భయకంపితుడైన మాట నిజమే. కానీ ఆమె తనని కన్నతల్లిలా చేరదీసింది. వంటిమీద గాయాలని చిటికెలో నయం చేసింది. తన గోడు విని సాయం చేసేందుకు ముందుకొచ్చిన ఆ మహాతల్లి అంటే ఒకప్పటి భయం స్థానంలో భక్తీ, ప్రేమా చోటుచేసుకున్నాయి. ఆమె పురహూతి ఉపాసకురాలు. మట్టిని బంగారం చేయగల పరుసవేది. రసవిద్యతో మృత్యువుని జయించింది.ఆమెది వందల యేళ్ల వయస్సు. కానీ ఆమె శరీరంలో యవ్వనపు పటిమ ఏమాత్రమూ తగ్గలేదు. నిగ్రహ తంత్రాలయిన మారణ, వశీకరణ, స్తంభన, ఉచాటన, విద్వేషణ విద్యలలో ఆమెకి తిరుగులేదట.
‘రారా కొడకా! నీ పంట పండింది. ఈ రాత్రికే గుహ్యసాధకుల మండలం. నీకు అభిశేచకం చేసి గుహ్యసమాజంలో ఒకడిని చేస్తాను. సాధన చేస్తే అష్ట సిద్ధులూ నీ పరం చేస్తాను. నిన్నెదిరించే మంత్రగాడు లేకుండా చేస్తాను. ఇక నీ ఊరిని బూడిదే చేస్తావో గెలుచుకొని ఏలుకుంటావో నీ ఇష్టం’ అని కపాలపాత్రలోని గౌడీ సారాయిని గొంతులో పోసుకుంటూ ‘ఇంతకీ గుహ్యసాధనకి నీ జోడు ఎన్నుకున్నావా?’ అడిగింది మహామారీచి. ‘లేదు తల్లీ. ఇంకా నిర్ణయించుకోలేదు’ అన్నాడు. ‘ఏరా? ఇంత మంది జోగినులలో నీకు ఒక్కముండ కూడా నచ్చలేదా? సరే. నన్ను కూడుతావా? డాకినీ విద్యలో నన్ను మించినది లేదు. నచ్చానా చెప్పు’ అంటూ ఒళ్లు విరుచుకుందా మహమ్మారి.
జుగుప్స కలిగించే ఆలోచన!తల్లిలాంటి దానితో పొందా? కానీ తాంత్రిక సాధనలో అది మామూలే. సరేనని తలూపాడు, సుబ్బిశాస్త్రి.అర్ధరాత్రి! దివిటీల వెలుగులో అష్టభుజి యంత్రం చుట్టూ గుండ్రంగా కూర్చున్న సిద్ధుల మధ్య హ్రీం! క్రీం! బీజమంత్రాలతో యంత్రపూజ సాగింది. మద్యం, మాంసం, మత్స్యం నైవేద్యం అయినంతనే ఎర్రకలువలు, కదంబమాలలతో అలంకరించుకొన్న జోగినులు ఆ సిద్ధుల జతకట్టారు. వాళ్లలో తనకు ఎదురు వాంగ్మూలం చెప్పిన చాకలి దానిని చూడగానే సుబ్బిశాస్త్రి తల గిర్రున తిరిగింది. చివరగా వయ్యారపు నడకతో వచ్చి సుబ్బిశాస్త్రి ఒడిలో చేరింది మహామారీచి. పాతిక నిండని పడుచుపిల్లలా కనిపిస్తున్న ఆ సిద్దురాలిని చూస్తున్న సుబ్బిశాస్త్రి గుండె ఆశ్చర్యమే కాక ఒక కొత్త ఉత్తేజంతో స్పందించింది.
అతడి గుండెదడకి సరిపోయేలా ఎనుము తోలు డప్పులపై తొడ ఎముకలతో మోదుతూ ప్రవేశించిన ఇద్దరు భయంకరులైన సిద్ధుల మధ్య సూన్యంలోకి చూస్తూ మెడలో వేపరెమ్మలు, నిమ్మకాయల హారంతో, చేతిలోని గండకత్తెరని తిప్పుతూ, చిందులు వేస్తూ వచ్చి మధ్యలో నిలిచిన యువకుడిని చూడగానే సుబ్బిశాస్త్రి ప్రాణం లేచివచ్చింది. అతడు నెలరోజులుగా ఊరిలో కనపడకుండా పోయిన తన స్నేహితుడు లింగబోయడే. అతడు సాక్ష్యం చెబితే శిక్ష నుంచి బయటపడొచ్చు.
కానీ నిలిచిన వెంటనే ఎడమచేత సిగని అందిపుచ్చుకొని కుడిచేతిలోని గండకత్తెరని గిర్రునతిప్పి ఒకే వేటు తన మెడపై వేసుకున్నాడు. తలలేని మొండెం పురహూతిక విగ్రహం వైపు రెండడుగులు వేసి కుప్పకూలి పోయింది. దాని చేతిలోని తలబంతి దొర్లుకుంటూ సుబ్బిశాస్త్రి ముందు ఆగింది. రాలిన తలను చూసి సుబ్బిశాస్త్రి నిరాశతో కుప్పకూలిపోయాడు.
కొంతకాలంలోనే సుబ్బిశాస్త్రికీ మహామారీచికీ స్నేహం కుదిరింది. మహామారీచి అసలు పేరు మాణిక్యం. సిద్దగుట్ట మహమ్మారి రూపం ఒక వేషం మాత్రమే. ప్రతి ఆరేళ్లకి ఒక కొత్తపిల్లకి ఆ వేషం కడతారు. లేకుంటే, వందల ఏళ్లుగా యవ్వనంతో ఉండటం నరమానవులకి సాధ్యమా?‘ఎంత త్వరగా పారిపోతే అంత మంచిది’ అని సుబ్బిశాస్త్రి చెవిలో చెప్పింది మాణిక్యం. ఆరెళ్లు పూర్తవుతున్నందువల్ల ఆ ప్రాణానికి ప్రమాదం.‘నిజమే. కాని ఎక్కడికని పారిపోతాం. ఊళ్లో అయితే మావాళ్ల మధ్య ఎవరికీ భయపడే అవసరం లేదు. కానీ అది సాధ్యం కాదు.’అతడి భుజంపై తల ఆన్చి ఆలోచనలలో పడింది మాణిక్యం, ‘సాధ్యమే! ఎందుకు కాదు? పద మీ ఊరెళదాం’ అంటూ ఒక్క ఉదుటున లేచింది. ‘దొంగతనం చేసిందెవరో నాకు తెలుసు’.
‘కానీ మనం చెబితే వినేదెవరు? దానికి తోడు లింగడు కూడా చచ్చాడు.’ అడిగాడు విషయం తెలుసుకున్న సుబ్బిశాస్త్రి.‘ఆరేళ్లుగా జనాన్ని మోసం చేయడమే వృత్తిగా బతికినదాన్ని. నా యుక్తులూ, శక్తులూ చూద్దువుగాని, పద.’మంత్రగత్తె మాణిక్యం గారడీలు చూడ్డానికి ఊరంతా పోగయ్యారు. ఆమె కనికట్టు మహిమతో ప్రతి ఒక్కరికీ కంసాలి కొమరయ్య పెరట్లో పాతిపెట్టిన నాలుగు భోషాణం తాళం చెవుల నకళ్లు కనిపించాయి. తవ్వి చూస్తే తాళం చెవులు దొరికాయి. పంచాయతీలో, కళపెళా కాగే నూనెలో చెయ్యిపెట్టి నిజం చెప్పమనే సరికి అసలు విషయం ఏకరువు పెట్టాడు కొమరయ్య. అసలేమయిందంటే కొమరయ్య నగని దొంగలించడం లింగడు చూశాడు. లింగడికి మత్తుమందుపెట్టి చాకలిదాని సహాయంతో రహస్యంగా సిద్ధులగుట్ట చేర్చాడు. లింగడికి ఊళ్లో సుబ్బిశాస్త్రి తప్ప ఎవరూ స్నేహితులు లేరు. ఏమైనా ఆరాతీస్తే అతడే తీయాలి. అందుకే, చాకలిదాని సాయంతో అతడింట్లోని బట్టని తెప్పించి సుబ్బిశాస్త్రిని కూడా నేరంలో ఇరికించాడు. కానీ లింగబోయడు చంపుడుగుళ్లో మహామారీచికి నిజం చెప్పడం వల్ల కంసాలి కొమరయ్య బండారం బయటపడింది.
చంపుడుగుళ్లు
తంత్రం అనే పదాన్ని టెక్నాలజీకి పర్యాయపదంగా వాడుతున్నాం. ప్రఖ్యాత చరిత్రకారుడు ఎన్.ఎన్.భట్టాచార్య- భారతీయ తంత్రం ఆదిమకాలం నుంచి మానవునికి వారసత్వంగా వచ్చిన శాస్త్రీయ జ్ఞానాన్ని తనలో ఇముడ్చుకున్న ఒక హేతువాద పద్ధతి అంటారు. భారతీయ తంత్రం అతి పురాతనమైనది. దాని ఛాయలు ఋగ్వేదంలోనే ఉన్నాయి. అధర్వణవేదం తంత్రవిద్యలకి మూలగ్రంథం అనుకోవచ్చు. తాంత్రిక పద్ధతులు వజ్రయాన బౌద్ధంలో, జైనంలో, శాక్త, శైవాల్లో కూడా కనిపిస్తాయి. మంత్రతంత్రాలు, మూఢనమ్మకాలు మానవుడికి స్వాభావికం. ఏ దేశమైనా, మతమైనా, సమకాలీన సమాజపు విలువలనీ, నియమాలనీ స్థిరపరిచేవైతే అవి మంచివి. లేదంటే క్షుద్రమైనవీ. సభ్యసమాజానికి దూరంగా, రహస్యంగా కొన్ని మానవాతీత శక్తులు సంపాదించడమే ధ్యేయంగా ఈ మార్గాన్ని ఆచరించే వారిని వామాచారులు అన్నారు. సభ్య మతాచారాలు కుడిచేతికి సంబంధించినవైతే తాంత్రిక పద్ధతులు ఎడమచేతివి.
దక్షిణదేశంలో వామాచార సిద్ధులు నివసించిన ప్రదేశాలకు బంగారం, రంగురాళ్ల నిక్షేపాలకు సంబంధం ఉంది. బంగారాన్ని తీసిన తావులోనే అనేక సిద్ధ, శాక్త స్థావరాలు ఏర్పడ్డాయి. ఒక చిత్తూరు జిల్లాలోనే పైడిపల్లి, కనకమ్మసత్రం, పొన్నూరు అనే ఊళ్లలో జైనుల జ్వాలామాలినీ అనే తాంత్రిక దేవత విగ్రహాలు తవ్వకాలలో దొరికాయి. పైడమ్మ, పైడితల్లి, బంగారమ్మ, కనకమ్మ, హొన్నమ్మ, అవనాక్షి, పొన్నియమ్మ అనే శాక్తేయ దేవతల పేర్లు బంగారానికి సంబంధించినవే. విలువైన పదార్థాల ఉనికిని రహస్యంగా ఉంచేందుకు ప్రజలలో భయోత్పాతం కలిగించే ఆచారాలు, కథలు ప్రచారం చేస్తారు. అశ్లీలమైన ఆచారాలు, నరబలులకి ఆటపట్టయిన చంపుడుగుళ్లంటే హడలుతో ప్రజలు వాటికి దూరంగా మసిలారు. ఆంధ్రదేశంలో శక్తిపీఠాలుగా పేరుగన్న ఊర్లన్నీ మధ్యయుగంలో సిద్ధసాధనకి, రసవాదానికి, తాంత్రిక వామాచారాలకీ ఆలవాలాలే. మట్టిని బంగారం చేసే పరుసవేది విద్య, సంజీవని ద్వారా చావును జయించడం, వశీకరణం, ధనాంజనం వేసి నిధుల జాడలు కనుగొనడం లాంటివి సాధించిన సిద్ధుల గురించి సాహిత్యంలో అనేక ప్రస్తావనలు ఉన్నాయి. విక్రమార్కుడు ఒక సిద్ధుని కాళికకి బలియిచ్చి సర్పవేది, పరకాయప్రవేశ విద్యలని సంపాదించిన కథ ఉంది. భవభూతి మాలతీమాధవం, మహేంద్రవర్మ మత్తవిలాసం, ఆనందగిరి శంకరవిజయం ఇలా ఎన్నో గ్రంధాలలో వామాచార ప్రస్తావన ఉంది. అంతేకాదు తాంత్రిక పద్ధతులను, ఫిలాసఫీని ఆవిష్కరించే ఎన్నో గ్రంథాలు రాయబడ్డాయి. వీటిలో శారదాతిలక, శక్తిసంగమ, తంత్రరాజ ముఖ్యమైనవి. ముఖ్యంగా ఆంధ్రదేశానికి సంబంధించినవి యోగినీజాలం, యోగినీహృదయం, మంత్రమాలిని, అఘోరేశి, క్రీడాఘోరేశ్వరి, మారీచి, మహామారీచి అనే గ్రంథాలు.
మతంలో వెయ్యితలల్తో ప్రబలిన ఈ మహమ్మారిని నయంచేసి ఒక నూతన మతవ్యవస్థని సృజించగల వైద్యుడి అవసరం వచ్చింది. బ్రహ్మసూత్రాల్లోని ఆధ్యాత్మికత ఆలంబనగా, మహాయాన బౌద్ధంలోని మాధ్యమికవాదం సమరశంఖంగా, ప్రజల గుండెల్లోని భక్తి ప్రపత్తులే అస్త్రాలుగా, ఆదిశంకరుడు ఒక సరికొత్త స్మార్త వ్యవస్థకి శ్రీకారం చుట్టాడు. ఆసేతుహిమాచల పర్యంతం విజయదుందుభి మోగించి ఊరూరా దేవాలయాలనే జయకేతనాలు ఎగురవేసాడు.
సాయి పాపినేని