పరిహారం ఇప్పిస్తేనే పనులు సాగనిస్తాం
తేల్చిచెప్పిన కంతనపల్లి బ్యారేజీ ముంపు బాధితులు
నిర్వాసితులతో సమావేశమైన భూసేకరణ కలెక్టర్ సుందర్‌అబ్నార్
ఏటూరునాగారం : కంతనపల్లి బ్యారేజీ నిర్మాణ పనుల్లో కోల్పోతున్న భూములు, ఇళ్లకు ముందుగా నష్టపరి హారం ఇప్పిస్తేనే పనులు సాగనిస్తామని నిర్వాసితులు తేల్చిచెప్పారు. గురువారం మండలంలోని కంతనపల్లి గ్రామాన్ని భూసేకరణ కలెక్టర్ సుందర్‌అబ్నార్ సందర్శించారు. అనంతరం గ్రామస్తులు, రైతులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు పనుల కోసం యంత్రాలను ఏర్పాటు చేయడానికి ప్రస్తుతం 50 ఎకరాల భూమిని నిర్మాణ సంస్థకు అప్పగించాలని, కావలసిన నష్టపరిహారం ఇప్పిస్తామని పనులను అడ్డుకోవద్దని కోరారు. దీనికి స్పందించిన గ్రామస్తులు ‘పనులు మొదలైన తర్వాత అధికారులు వస్తూ పోతూంటారు.. మా బాధలు ఎవరూ పట్టించుకోరు.. పనులు ప్రారంభించకముందే పరిహారం చెల్లిం చాలని’ స్పష్టం చేశారు. పెట్టుబడులకు అప్పులు తెచ్చి పంటలు వేశామని, వాటిలో యంత్రాలు ఏర్పాటు చేస్తే పూర్తిగా నష్టపోతామని చెప్పారు.
2014 జనవరి 01న భూసేకరణపై నూతన చట్టం వెలువడిందని, నియమ నిబంధనలు పూర్తి స్థాయిలో అమలులోకి రాకపోవడం వల్ల నష్టపరిహారం విషయం తేల్చలేకపోతున్నామని అబ్నార్ పేర్కొన్నారు. రెండు మూడు నెలల్లో చట్టం రూపాంతరం జరిగిన తర్వాత పరిహారం చెల్లిస్తామని చెప్పారు. కొంత మంది నిర్వాసితులు దళారులను, అడ్వకేట్లను ఆశ్రయిస్తున్నారని, అలా చేయడం వల్ల నష్టపోయే ప్రమాదముందని తెలిపారు. ప్రభుత్వం నుంచి పరహారం వచ్చిన తర్వాత మీకు సమ్మతి కాకుంటే అడ్వకేట్లను ఆశ్రయించవచ్చని సూచిం చారు.
ప్రాజెక్టు పనులు అడ్డుకోవడం వల్ల అభివృద్ధిలో తెలంగాణ వెనుకబడుతుందని, అందరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ముప్పనపల్లి, బుట్టాయిగూడెం, తూపాకులగూడెం, లక్ష్మీపురం, రాజన్నపేట గ్రామాలకు చెందిన ప్రజలు మాట్లాడుతూ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కోసం తమ భూముల్లో సర్వే చేసి హద్దురాళ్లు పాతారని, వాటి సంగతేమిటని ప్రశ్నించారు. మూడేళ్ల వరకు వ్యవసాయం చేసుకోవచ్చని, భూములకు ఎలాంటి నష్టం ఉండదని అబ్నార్ పేర్కొన్నారు. కేవలం మొదటి దశ కింద సర్వే చేసి హద్దురాళ్లు పాతారని, ప్రాజెక్టుకు అవసరమైనప్పుడు ముందస్తుగానే పరిహారం, సమాచారం ఇచ్చి భూములను స్వాధీనం చేసుకుంటామని వివరించారు.
మరమ్మతులు చేపట్టకుండా నిలిపివేసిన పెద్ద చెరువు కింద ఉన్న 480 ఎకరాల ఆయకట్టు ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని, ప్రాజెక్టు పూర్తయ్యే వరకు చెరువుకు మరమ్మతులు చేపట్టి సాగునీరందించాలని రైతులు కోరారు. ఈ విషయంపై స్పందించిన అబ్నార్ చెరువుకు మరమ్మతులు చేపట్టి సాగునీరు అందేలా చూడాలని ఇరిగేషన్ ఈఈ గంగాధర్‌ను ఆదేశించారు. ఆయన వెంట డిప్యూటీ కలెక్టర్ డేవిడ్, సర్పంచ్ దబ్బకట్ల శ్రీనివాస్, గ్రామస్తులు పాపారావు, శ్రీనివాస్, కావిరి చిన్నకృష్ణ, మహిళలు ఉన్నారు.