#మీటూ : ‘అతడి మీద అసహ్యంతో డెటాల్ తాగేశా’
కేవలం పని ప్రదేశాల్లోనే కాదు... సొంతింట్లో కూడా మహిళలకు భద్రత లేదంటున్నారు సింగర్ సునీతా సారథి. వేధింపుల గురించి బయటపెట్టినంత మాత్రాన పరువేమీ పోదు.. కనీసం అలా చేస్తేనైనా ఇంకోసారి వెకిలిగా ప్రవర్తించేవాళ్లు కాస్త వెనక్కి తగ్గుతారేమో ఓసారి ఆలోచించమంటున్నారు.
‘చిన్న నాటి నుంచే వేధింపులు ఎదుర్కొంటున్నాం. వినడానికి నమ్మశక్యంగా లేదు కదా. అయితే నేనిప్పుడు పెడుతున్న ఈ పోస్టు ఎంతో మంది మహిళలు తమ భయంకర అనుభవాలను పంచుకోవడానికి, ధైర్యంగా ముందడుగు వేయడానికి పనికి వస్తుంది. నాకు అప్పుడు ఐదేళ్లు అనుకుంటా. మా అమ్మ వాళ్ల కజిన్ తరచుగా మా ఇంటికి వస్తుండే వాడు. వచ్చిన ప్రతీసారి ముద్దుచేసే పేరుతో నన్ను మా వాళ్ల నుంచి దూరంగా తీసుకెళ్లేవాడు. ఇది చూసి అందరు అతడికి నేనంటే చాలా ప్రేమ ఉంది అనుకునే వారు. అయితే కొన్నేళ్ల తర్వాత నాకు అర్థమైంది అతడు ఎందుకలా ప్రవర్తించేవాడో. ముద్దుచేసే పేరిట మృగవాంఛ తీర్చుకునే ఆ వ్యక్తిని చూడాలన్నా అసహ్యం వేసేది. అందుకే అతడితో మాట్లాడటం పూర్తిగా మానేశా. కానీ మా బంధువులు ఆ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. సింగర్ అయింది దీనికి పొగరు పట్టింది. అందుకే అంత బాగా చూసుకున్న మామయ్యను కనీసం పలకరించడం లేదు అని. కానీ ఆ చెత్త వెధవ ఎంత చెత్తగా ప్రవర్తించాడో అనుభవించిన నాకు మాత్రమే తెలుసు.
ఇక ఇంకో మగానుభావుడి గురించి చెప్పాలి. అతడు మా అమ్మావాళ్ల కొలీగ్. అప్పుడప్పుడూ ఫ్యామిలీతో కలిసి మా ఇంటికి వచ్చే వాడు. వచ్చీరాగానే నన్ను ఎత్తుకునేవాడు. కూతుర్ని కాకుండా నన్ను ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆడించేవాడు. ఇంకా..... వాళ్లు వెళ్లిపోగానే డెటాల్ వేసుకుని ముఖమంతా శుభ్రం చేసుకునేదాన్ని. ఆ అసహ్యాన్ని తట్టుకోలేక ఓసారి డెటాల్ తాగేశాను. ఇలా ఎందుకు చేస్తున్నానో మా వాళ్లకి అర్థం కాక నన్నో పిచ్చిదానిలా చూసేవారు. ఇవన్నీ మా ఇంట్లో నా తల్లిదండ్రుల ముందే ఎదురైన అనుభవాలు.
కెరీర్ విషయానికొస్తే.. అక్కడ కూడా ఇలాంటి దెయ్యాలే ఉండేవి. తాను చెప్పినదానికి సరేననలేదని నాకు అవకాశాలు రాకుండా చేశాడు. ఇలా ఎంతో మంది మృగాళ్లు ఉన్నారు నా జీవితంలో’ అంటూ సునీతా సారథి తన మీటూ స్టోరీని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. కేవలం పని ప్రదేశాల్లోనే కాదు.. సొంత ఇంట్లో కూడా చిన్న నాటి నుంచే తనలా వేధింపులు ఎదుర్కొంటున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి : నిర్మాత పైశాచికత్వం; ఆ ఫొటోలో ఉన్నది నేనే!)
నవ్వినా ఫరవాలేదు..
‘మనకు ఎదురైన అనుభవాలు ఇలా బయటి ప్రపంచానికి చెప్పినందుకు నవ్వేవాళ్లు, ఇష్టం వచ్చినట్లుగా కామెంట్ చేసే వాళ్లు, కత్తుల్లాంటి మాటలతో మనల్ని మరింత ఇబ్బందిలోకి నెట్టాలని చూసే వాళ్లు చాలా మందే ఉంటారు. మనల్ని మరోసారి నొక్కిపెట్టే ప్రయత్నమిదే ఇది. కానీ నిజం నిర్భయంగా మాట్లాడాలి.. వెకిలిగా ప్రవర్తించే వాళ్లకు భయపడవద్ద’ని సునీత సూచించారు.