విజేతలు స్పర్శ్, కృష్ణా జట్లు
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో పురుషుల టీమ్ టైటిల్‌ను హైదరాబాద్ స్పర్శ్ జట్టు కైవసం చేసుకుంది. మహిళల టీమ్ టైటిల్‌ను కృష్ణా జిల్లా జట్టు గెలుచుకుంది. రాష్ట్ర బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ వైఎంసీఏ బాస్కెట్‌బాల్ కోర్టులో జరిగిన పురుషుల ఫైనల్లో హైదరాబాద్ స్పర్శ్ జట్టు 17-13 పాయింట్ల తేడాతో సికింద్రాబాద్ వైఎంసీఏ జట్టుపై విజయం సాధించింది. స్పర్శ్ ఆటగాడు శ్రీనాథ్ దూకుడుగా ఆడి 6 పాయింట్లను నమోదు చేశాడు.
వైఎంసీఏ జట్టులో రోహిత్ చక్కటి ఆటతీరును ప్రదర్శించి 8 పాయింట్లు సాధించినప్పటికీ ఫలితం లేకపోయింది. మహిళల విభాగం ఫైనల్లో కృష్ణా జిల్లా జట్టు 12-11 పాయింట్ల తేడాతో లయోలా-ఎ జట్టుపై పోరాడి గెలిచింది. ఈ టోర్నీలో విజేత జట్టుకు మూడు వేల రూపాయలు, రన్నర్స్ జట్టుకు రెండు వేల రూపాయల నగదు పురస్కారం లభించాయి. ఈ పోటీల విజేతలకు అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ ఆటగాడు ఎల్.సి. ఉమాకాంత్ బహుమతులను అందజేశారు.