గోధుమల దిగుబడి పెంపుకు కొత్త పద్ధతి!
లండన్: గోధుమల దిగుబడిని పెంచడానికి ఉపకరించే కొత్త పద్ధతిని వ్యవసాయ పరిశోధనల సంస్థ రోథమ్స్టెడ్, ఆక్స్ఫర్డ్ వర్సిటీల పరిశోధకులు కనుగొన్నారు. మొక్కల్లో సాధారణంగా ఉండే టీ6పీ అనే రసాయనాన్ని శాస్త్రవేత్తలు కృత్రిమంగా తయారుచేశారు. దీనిని గోధుమ మొక్కలపై పిచికారీ చేయడం ద్వారా గింజల పరిమాణం, వాటిలోని పిండి పదార్థాలను 20 శాతం మేర పెంచవచ్చని వారు పేర్కొంటున్నారు.
కిరణజన్య సంయోగ క్రియలో ఉత్పత్తి అయ్యే సుక్రోజ్, గోధుమ గింజలు ఏర్పడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. సుక్రోజ్ను గోధుమ చెట్లు ఎలా ఉపయోగించుకోవాలనే దానిని టీ6పీ నియంత్రిస్తుంటుంది. టీ6పీ ఎక్కువగా ఉంటే, పంట దిగుబడి అంత ఎక్కువగా వస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అనంతరం టీ6పీని కొద్దిగా సవరించి, కృత్రిమంగా తయారు చేశారు. తర్వాత దానిని ద్రావణంతో కలిపి గోధుమ మొక్కలపై పిచికారీ చేశారు.