తాడేపల్లిలో నిఘా నేత్రం
సీసీ కెమెరాల ఏర్పాటుకు పరిశీలన
తాడేపల్లి రూరల్ : తాడేపల్లి మునిసిపాలిటీ, జాతీయ రహదారి వెంబడి నిఘా నేత్రాలను (సీసీ కెమరాలను) ఏర్పాటు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు ఎక్కడెక్కడ కెమెరాలు ఏర్పాటు చేయాలనేది గురువారం పరిశీలించారు. రానున్న పుష్కరాలకు పోలీసు విభాగం నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుంటూరు వెస్ట్ జోన్ డీఎస్పీ సరిత ఈ పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రధానంగా ఏడు పుష్కర నగర్లతోపాటు ఉండవల్లి సెంటర్, ప్రకాశం బ్యారేజి, పుష్కర ఘాట్లు, జాతీయ రహదారి వెంబడి ప్రధాన కూడళ్లు పాత టోల్ గేటు, క్రిస్టియన్‌పేట తదితర ప్రాంతాల్లో 44 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు ఉన్నతాధికారుల దృష్టికి డీఎస్పీ సరిత తీసుకువెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ పరిశీలనలో సీసీ కెమెరాల టెక్నీషియన్ భరత్, తాడేపల్లి పీఎస్ఐ నారాయణ, ఆర్ఎస్ఐ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.