తాడిపత్రిలో సడలిన ఉద్రిక్తత
తాడిపత్రి: వినాయక నిమజ్జనం సందర్భంగా అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చిన్నపొలమడలోని ప్రభోదానంద ఆశ్రమం వద్ద హింసాత్మక ఘటనలతో నెలకొన్న ఉద్రిక్తత సోమవారం అదుపులోకి వచ్చింది. శాంతిభద్రతల అదనపు డీజీ హరీష్‌కుమార్‌గుప్తా, ఐజీ రవిశంకర్ అయ్యర్, ఆక్టోపస్ డీఎస్పీ రాధతోపాటు ఆక్టోపస్ బృందాలు, ప్రత్యేక పోలీసు బలగాలు ఆదివారం అర్ధరాత్రి ఆశ్రమం వద్దకు చేరుకున్నాయి. సోమవారం ఉదయం ఆశ్రమం వద్దకు వచ్చిన కలెక్టర్ వీరపాండియన్, అధికారుల బృందం ఆశ్రమంలోకి వెళ్లి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సహకరించాలని కోరడంతో భక్తులు శాంతించారు. అనంతరం 20 బస్సుల్లో 500 మంది భక్తులను స్వస్థలాలకు తలించారు. శాంతిభద్రతల సమస్య అదుపులోకి వచ్చిందని కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక నిఘా తో పాటు ఆశ్రమానికి పారా మిలటరీ బలగాలతో గట్టి భద్రత కల్పిస్తామన్నారు. అంతకుముందు అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు.
భక్తులను బలవంతంగా తరలించొద్దు: హైకోర్టు
ప్రబోధాశ్రమంలో ఉన్న భక్తులను బలవంతంగా తరలించరాదని ఉమ్మడి హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆశ్రమంతోపాటు ఆశ్రమ నిర్వాహకులకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది.
చిన్నపొలమడ ఘటనలో సీఐ, ఎస్ఐ సస్పెన్షన్?
చిన్నపొలమడలో చోటు చేసుకున్న ఘర్షణలకు బాధ్యులను చేస్తూ సీఐ సురేంద్రనాథ్‌రెడ్డి, రూరల్ ఎస్ఐ రామకృష్ణారెడ్డిలను సస్పెండ్‌చేస్తూ సీమ రేంజ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ ఉత్తర్వులు జారీచేసినట్లు తెలిసింది. నిమజ్జనం సందర్భంగా వీఆర్‌లో ఉన్న సీఐ సురేంద్రనాథ్‌రెడ్డి బందోబస్తు నిమిత్తం చిన్నపొలమడకు వెళ్లారు. గతంలో జరిగిన సంఘటలను అంచనా వేయలేక ఆశ్రమం ముందు ఊరేగింపునకు అనుమతివ్వడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో జేసీ అనుచరులు ఆశ్రమంపైకి రాళ్లు రువ్వుతున్నా నిలువరించలేకపోవడం వల్లే సమస్య ఉత్పన్నమైందని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఆ ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసినట్లు విశ్వసనీయ సమాచారం.