స్వరాజ్య సమరగానంలో సుస్వరం
భారత కోకిలగా ప్రసిద్ధిగాంచిన సరోజిని నాయుడు గొప్ప రచయిత్రి, ఉపన్యాసకురాలు, గాయనీమణి, స్వాతంత్య్రో ద్యమ నాయకురాలు. నాటి భారత మహిళా చైతన్యానికి, స్వతంత్ర వ్యక్తిత్వానికి ప్రతీక. హైదరాబాద్‌లో సంప్రదాయ బెంగాలీ కుటుంబంలో 1879 ఫిబ్రవరి 13న సరోజిని జన్మిం చారు. తల్లితండ్రులు వరదా సుందరీదేవి, అఘోరనాథ్ చటో పాధ్యాయ. 12 ఏళ్ల ప్రాయంలోనే మద్రాస్ వర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్లో ఉత్తీర్ణురాలైన అతి పిన్న వయస్కురాలిగా ఈమె రికార్డు కెక్కింది. నిజాం ఉపకార వేతనంతో లండన్ వెళ్లి, కింగ్స్ కాలేజీలో విద్య నభ్యసిస్తూ అనా రోగ్యంతో 1898లో హైదరాబాద్ తిరిగొచ్చారు. గోవిందరాజులు నాయుడిని కులాంతర వివాహం చేసుకున్నారు. పన్నెండేళ్ల ప్రాయంలో మహర్ మునీర్ అనే పర్షియన్ నాటిక రాసిన సరోజిని ఇంగ్లండ్‌లో రాయల్ లిటరరీ సొసైటీలో సభ్యురాలిగా చేరారు. ప్రముఖ ఆంగ్ల రచయితలు ఎడ్మండ్ గాస్సీ, సిమన్స్ల పరిచయంతో గద్యరచనను చేపట్టిన సరోజిని 1905లో గోల్డెన్ థ్రెషోల్డ్ అనే పద్య సంకలనాన్ని లండన్‌లో ప్రచురించారు. తర్వాత ది బర్డ్ ఆఫ్ టైమ్, ది బ్రోకెన్ వింగ్స్, ఫీస్ట్ ఆఫ్ యూత్, ది మ్యాజిక్ ట్రీ, ది విజార్డ్ మార్క్, ఎ ట్రెజరీ ఆఫ్ పోయెమ్స్ లను ఆమె ప్రచురించారు. భారతీయ ఆత్మను ప్రతిఫలించిన ఆమె పద్యాలకు అరవిందుడు, రవీంద్రనాథ్ టాగూర్, జవహర్లాల్ నెహ్రూ ముగ్ధులయ్యారు. రాగయుక్తంగా, శ్రావ్యంగా, వినసొంపుగా ఉండే ఆమె గాత్రం వల్ల అందరూ ఆమెను భారతకోకిల అని పిలిచేవారు.
నాటి కాంగ్రెస్ నేత గోపాలకృష్ణ గోఖలే సలహా మేరకు, 1905లో కాంగ్రెస్ పార్టీలో సభ్యురాలిగా చేరారు. 1915లో గాంధీని కలుసుకున్నాక క్రియాశీల రాజకీయాల్లోకి, జాతీయోద్యమంలోకి ప్రవేశించారు. 1915-18 మధ్య కాలంలో దేశమంతా పర్యటించి వాగ్ధాటితో ప్రజలను కదిలించారు. ఖిలాఫత్ ఉద్యమం, రౌలత్ చట్టం, ఉప్పు సత్యాగ్రహం పోరాటాలలో ఆమె చురుకుగా పాల్గొన్నారు. భారత హోంరూల్ ప్రతినిధిగా లండన్ వెళ్లారు. 1925లో కాన్పూర్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన రెండవ మహిళగా, తొలి భారతీయ మహిళగా ఖ్యాతి పొందారు. ఈ కాలంలోనే ప్లేగు వ్యాధి నిర్మూలనకు కృషి చేసినందుకు బ్రిటిష్ ప్రభుత్వం కైజర్-ఇ-హింద్ అనే బిరుదును ప్రదానం చేసింది. 1931లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశాలకు గాంధీ, మదన్ మోహన్ మాలవ్యలతో కలసి లండన్ వెళ్లారు. 1942లో క్రిప్స్ రాయబారాన్ని వ్యతిరేకించి క్విట్ ఇండియా ఉద్యమం లో పాల్గొని జైలుకెళ్లారు. స్వాతంత్య్రోద్యమానికి విదేశీ మద్దతు కూడగట్టడానికి ఆఫ్రికా, అమెరికా, కెనడాలో పర్యటించారు. స్వాతంత్య్రానంతరం 1947 ఆగస్టు 15 నుంచి 1949 మార్చి 2 వరకు నాటి ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసి దేశంలో తొలి మహిళా గవర్నర్‌గా రికార్డుకెక్కారు. 70 ఏళ్ల వయస్సులో గవర్నర్‌గా పనిచేస్తూనే 1949 మార్చి 2న లక్నోలోని తన కార్యాలయంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. భారత కోకిల సరోజినికి నివాళి.
(నేడు సరోజిని నాయుడు 136వ జయంతి)
తండ ప్రభాకర్ గౌడ్ తొర్రూరు, వరంగల్