అందుకే... 33 రోజుల్లో పూర్తి చేశా!
‘అష్టాచమ్మా’, ‘గోల్కొండ హైస్కూల్’, ‘ఉయ్యాల - జంపాల’ చిత్రాలు నిర్మించి విజయాలందుకొన్న నిర్మాత పి. రామ్మోహన్.
ఆయన ఇప్పుడు దర్శకుడిగా ముందుకొస్తున్నారు.
సంతోష్ శోభన్, అవికాగోర్ జంటగా రామ్మోహన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘తను - నేను’ ఈ 27న రిలీజ్.
ఈ సందర్భంగా ఆయన సినీ అనుభవాలు ఆయన మాటల్లోనే...
* నేను ఎంబీఏ చదివా. వ్యాపారం చేసుకొంటున్న సమయంలో డి. సురేశ్‌బాబుతో పరిచయం ఏర్పడింది. ఆయన ప్రోత్సాహంతో రామానాయుడు స్టూడియోలో ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకొనేందుకు చేరాను. చిత్ర నిర్మాణానికి సంబంధించి ఓనమాలు నేర్చుకున్నాను. ప్రొడక్షన్ విలువలు, కథల గొప్పతనం గురించి రామానాయుడు గారి నుంచి తెలుసుకున్నా.
* రామానాయుడు ఫిలిమ్ స్కూల్లో చదువుకున్న సాయి రమేశ్ అనే కుర్రాడు ‘తను- నేను’ చిత్రం కథ నాకు అమ్మేసి, అమెరికా వెళ్లిపోయాడు. మూడేళ్ళుగా నా దగ్గరే ఉందీ కథ. ఈ కథతో దర్శకులను కలిస్తే రకరకాల కారణాలతో వారు సినిమా చేసేందుకు ఒప్పుకోలేదు. ఇక నేనే దర్శకత్వం వహించాలని సురేశ్‌బాబు గారితో అన్నా. ‘తప్పకుండా మీరే చేయండి’ అంటూ రానా అన్నాడు. అలా చివరకు సురేశ్‌బాబు సపోర్ట్‌తో సినిమా పూర్తి చేశా.
* నా ‘గోల్కొండ హైస్కూల్’ చిత్రంలో పనిచేసిన సంతోశ్ శోభన్ ‘తను-నేను’ ఆడిషన్స్‌కి వచ్చాడు. వెంటనే, ఓకే చేప్పేశా.
* ఈ చిత్రంలో హీరోయిన్ తండ్రి పాత్రలో రవిబాబు కనిపిస్తారు. ఆయనతో పనిచేయడానికి మొదట్లో చాలా టెన్షన్ పడేవాడిని. చాలా సీన్స్‌లో టెక్నికల్‌గా ఆయన నన్ను గైడ్ చేసేవారు.
* మూడేళ్ళుగా ఈ స్క్రిప్ట్‌పై అవగాహన ఉండటంతో నాకు ఏం కావాలో బాగా తెలుసు. ప్రతి ఫ్రేమ్ నా మైండ్‌లో ఉండేది. ఆర్టిస్టులతో ముందుగా 45 రోజులు రిహార్సల్స్ చేయించా. అందుకే, ఈ షూటింగ్ 33 రోజుల్లో పూర్తి చేయగలిగా.
* ‘సోగ్గాడే చిన్నినాయనా’ కథ ఐడియా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ చెబితే నేను అది డెవలప్ చేసి ఇచ్చాను. యువ హీరోలతో సినిమాలు చేయాలనుంది, కానీ ‘తను -నేను’ రిలీజ్ అయ్యాక వచ్చే స్పందనను బట్టి ఆలోచిస్తా.
* విశ్వదేవ్, పునర్నవి భూపాలం జంటగా అనుదీప్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘పిట్టగోడ’ సినిమా నిర్మాణం ప్రారంభిస్తున్నా.