మరో ముగ్గురిపై అనర్హత...
న్యూఢిల్లీ: ఆసియా యూత్ క్రీడల నుంచి భారత క్రీడాకారుల తిరుగుముఖం పట్టడం ఇంకా ఆగడంలేదు. నిర్వాహకుల తప్పిదమో లేక మన క్రీడాధికారుల పొరపాటు తెలియదు కానీ భారత ఆటగాళ్లు బరిలోకి దిగకుండానే ఇంటికి వచ్చేస్తున్నారు. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు నిర్ణయించిన వయస్సుకంటే ఎక్కువగా ఉన్నందుకు ఇప్పటికే భారత్‌కు చెందిన 24 మంది క్రీడాకారులపై నిర్వాహకులు అనర్హత వేటు వేశారు.
తాజాగా ఈ జాబితాలో ముగ్గురు వెయిట్‌లిఫ్టర్లు చేరారు. చంద్రిక తరఫ్దార్ (48 కేజీలు), జ్యోతి మాల్ (53 కేజీలు), అక్షయ్ భగవాన్ (62 కేజీలు)లు నిర్ణీత వయస్సుకంటే ఎక్కువగా ఉండటంతో వీరిపై వేటు పడింది. చైనాలోని నాన్జింగ్లో జరుగుతోన్న ఆసియా యూత్ క్రీడల్లో అథ్లెటిక్స్, వెయిట్‌లిఫ్టింగ్ అంశాల్లో 1997 జనవరి 1 తర్వాత జన్మించిన వారికే పాల్గొనే అర్హత ఉంది. చంద్రిక, జ్యోతి, అక్షయ్ 1996లో జన్మించడంతో వారు అనర్హతకు గురయ్యారు. అయితే మిగతా క్రీడాంశాల్లో మాత్రం 17 ఏళ్లకంటే ఎక్కువ వయస్సున్న వారు పాల్గొనవచ్చు. ‘భారత్‌కు చెందిన ముగ్గురు వెయిట్‌లిఫ్టర్ల ఎంట్రీలను తిరస్కరించారు. అయితే కారణాలు ఇంకా తెలియరాలేదు’ అని భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య అధికారి ఒకరు తెలిపారు.