చిత్తూరు ‘దేశం’లో ముసలం
ఎమ్మెల్యే టికెట్టు డీకే.సత్యప్రభకే
జంగాలపల్లికి చేయిచ్చిన చంద్రబాబు
అసంతృప్తిలో జంగాలపల్లి వర్గం
సాక్షి,చిత్తూరు: చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో ము సలం ప్రారంభమైంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు టికెట్టు ప్రకటించేవరకు ఎవరికీ గ్యారెంటీ లేదన్నట్లుగా పరిస్థితి తయారైంది. చిత్తూరు అసెంబ్లీ టికెట్టు ఆశిస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివా సులుకే బాబు చేయిచ్చారు. ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన డీకే.ఆదికేశవులు భార్య డీకే.సత్యప్రభకు చిత్తూరు అసెంబ్లీ టిక్కెట్టు ఖరారు చేసేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నట్లు సమాచారం.
జంగాలపల్లి శ్రీనివాసులు(జేఎంసీ) ప్రారంభంలో టీడీపీలో ఉండి ఆ తరువాత చిరంజీవి ప్రజారాజ్యం పెట్టాక అందులోకి వెళ్లారు. తిరిగి పార్టీలోకి వచ్చాక, ఆయనకు జిల్లా టీడీపీ నాయకత్వ బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు. దీనితో జిల్లా అధ్యక్షుడుగా ఉన్న తనకు అసెంబ్లీ సీటుకు ఢోకాలేదని భావించారు జంగాలపల్లి.
చిత్తూరు తెలుగుదేశంలోని కొంతమంది నాయకుల ప్రోద్బలంతోనే ఆదికేశవులు నాయుడు భార్య డీకే. సత్యప్రభ, కుమారుడు డీకే.శ్రీనివాస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో జంగాపల్లిని సైడ్ చేసి, వీరి కుటుంబానికే ఎమ్మెల్యే టికెట్టు ఇవ్వాలనేది ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో జరిగిన నిర్ణయంగా పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జంగాలపల్లి చంద్రబాబును కలిసి టికెట్టు విషయం ప్రస్తావించగా సరైన హామీ లభించనట్టు తెలిసింది. భవిష్యత్‌లో మంచి పదవి ఇస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం.
ఇదే నిజమైతే ఇప్పటి వరకు జిల్లా పార్టీ భారం మోసిన జంగాలపల్లికి చంద్రబాబు చేయిచ్చినట్లే. అందరూ కలిసి పని చేయాలని పార్టీ అధినేత చెప్పినా చిత్తూరు నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు కలిసి పనిచేసే పరిస్థితి కనపడడం లేదు. జంగాలపల్లికి అసెంబ్లీ టికెట్టు ఇవ్వకుండా చేయాలని చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన ఒకరిద్దరు నాయకులు మొదటి నుంచీ పావులు కదుపుతూ వచ్చారు. ఈ క్రమంలో అనూహ్యంగా డీకే.ఆదికేశవులు భార్య డీకే.సత్యప్రభ, కుమారుడు డీకే.శ్రీనివాస్‌ను తెరపైకి తెచ్చారు.
ఇందులో గుడిపాల మండలంలోని ఒక సామాజికవర్గానికి చెందిన నాయకుల పాత్ర కూడా కీలకంగా ఉందని తెలుగుతమ్ముళ్లు చెబుతున్నారు. తొలి నుంచి తమ నాయకుడికే అసెంబ్లీ టికెట్టు వస్తుందని నమ్ముకున్నాం, ఇప్పుడు చంద్రబాబు రిక్తహస్తం చూపించడం సరికాదని జంగాలపల్లె అనుచరవర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపుపై చూపించనుంది.