నాగపట్నం నాయకుడెవరు?
సాక్షి, చెన్నై :
ఉప్పు ఉత్పత్తికి, చేపల పరిశ్రమకు కేంద్రంగా, నాగూర్ దర్గా, వేలాంగని మేరీ మాత ఆలయం, శింగార వేలర్, సుందరరాజస్వామి, నీలాదిలక్ష్మి, నీలకరై మారి యమ్మ వంటి ప్రసిద్ధి చెందిన ఆలయాలకు నిలయంగా నాగపట్నం ప్రఖ్యాతి గాంచింది.
పర్యాటకంగా అభివృద్ధి దిశలో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న ఈ నియోజకవర్గంలో లోక్‌సభ ఎన్నికల వేడి రాజుకుంది. రిజర్వుడు స్థానంగా ఉన్న నాగపట్నానికి నాయకుడు తామే కావాలన్న లక్ష్యంతో రాజకీయ పక్షాల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.
అసెంబ్లీ స్థానాలు :
పునర్విభజనానంతరం వేదారణ్యం, తిరువారూర్, నన్నిలం, నాగపట్నం, తిరుత్తురైపూండి, కీళ్ వేలూర్ అసెంబ్లీ స్థానాలతో కొత్త పుంతలు తొక్కుతూ నాగపట్నం లోక్‌సభ రూపుదిద్దుకుంది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో వేదారణ్యం నుంచి ఎన్వీ కామరాజ్(అన్నాడీఎంకే), నన్నిలం నుంచి ఆర్ కామరాజ్(అన్నాడీఎంకే), నాగపట్నం నుంచి కేఏ జయపాల్(అన్నాడీఎంకే), కీళ్ వేలూర్ నుంచి పీ మహాలింగం అలియాస్ వీపీ నాగమలై(సీపీఎం), తిరువారూర్ - ఎంకే కరుణానిధి(డీఎంకే), తిరుత్తొరై పూండి నుంచి కె ఉలగనాథన్(సీపీఐ) గెలిచారు.
డీఎంకే అధినేత ఎం కరుణానిధి స్వగ్రామం తిరువారూర్ ఈ లోక్‌సభ పరిధిలోనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే తరపున ఆయనొక్కరే గెలిచారు. మిగిలిన ఐదు స్థానాలను అన్నాడీఎంకే కూటమి దక్కించుకుంది. అయితే, సీపీఎం, సీపీఐలు అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చిన దృష్ట్యా, ప్రస్తుతం ఆ పార్టీ ఖాతాలో మూడు స్థానాలే ఉన్నాయి.
ఓటర్లు:
ఈ లోక్‌సభ పరిధిలో 11 లక్షల 88 వేల 738 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఐదు లక్షల 96 వేల 019 మంది పురుషులు, ఐదు లక్షల 92 వేల 712 మంది స్త్రీలు, ఏడుగురు ఇతరులు ఉన్నారు. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఐదు సార్లు, కమ్యూనిస్టులు ఐదు సార్లు, డీఎంకే నాలుగు సార్లు, అన్నాడీఎంకే ఒక్కసారి మాత్రమే విజయకేతనం ఎగుర వేసింది.
కాంగ్రెస్, సీపీఐలకు పట్టున్న ఈ నియోజకవర్గాన్ని డీఎంకే తన గుప్పెట్లోకి తీసుకుంది. ప్రకృతి వైఫరీత్యాలకు తరచూ గురయ్యే నాగపట్నం లోక్‌సభ పరిధిలో ముస్లిం, క్రైస్తవ సామాజిక వర్గాలతో పాటుగా జాలర్ల ఓటు బ్యాంకు న్యాయ నిర్ణేతలు.
2009 ఎన్నికల్లోకి వెళితే..:
సిట్టింగ్ ఎంపీగా ఏకేఎస్ విజయన్ నియోజకవర్గాన్ని పర్యాటకంగా అభివృద్ధి దిశలో నడిపించడంలో సఫలీకృతులు అవుతూ వస్తున్నారు. 2009 ఎన్నికల్లో మళ్లీ ఆయన్ను సీటు వరించింది. ఆయన విజయానికి కళ్లెం వేయడం లక్ష్యంగా అన్నాడీఎంకే కూటమి తరపున సీపీఐ అభ్యర్థిగా సెల్వరాజ్ బరిలో దిగారు.
ఈ ఇద్దరినీ ఢీ కొడుతూ డీఎండీకే అభ్యర్థి ముత్తుకుమార్ రేసులో నిలబడ్డారు. ఏడు లక్షల 62 వేల 988 ఓట్లు పోలయ్యాయి. ఇందులో మూడు లక్షల 69 వేల 915 ఓట్లతో విజయన్ మళ్లీ విజయ ఢంకా మోగించారు. సీపీఐ అభ్యర్థి సెల్వరాజ్ మూడు లక్షల 21 వేల 953 ఓట్లతో గట్టి పోటీ ఇచ్చారు. డీఎండీకే అభ్యర్థి ముత్తుకుమార్ 51 వేల 376 ఓట్లతో పరువు నిలబెట్టుకున్నారు.
నాయకుడు :
ముచ్చటగా మూడో సారి నాయకుడు అనిపించుకునేందుకు ఏకేఎస్ విజయన్ సిద్ధం అయ్యారు. సిట్టింగ్ ఎంపీకి మళ్లీ సీటును డీఎంకే కేటాయించింది. అన్ని రకాలుగా వెనుకబడి ఉన్న నియోజకవర్గాన్ని కాస్తో కూస్తో అభివృద్ధి పరచడంలో విజయన్ తన వంతు కృషి చేశారని చెప్పవచ్చు. ఢిల్లీలోని కేంద్ర మంత్రులకు పదే పదే లేఖాస్త్రాలను సంధించి మరీ తన నియోజకవర్గాన్ని పట్టించుకోవాలని వేడుకునే వారు.
అలాగే, ఎవరు పిలిచినా సరే వారి కార్యక్రమాలకు వెళ్లడం, ఒక కుటుంబ సభ్యుడిగా వారితో కలసి పోవడం విజయన్ నైజం. ఆయనకు ఉన్న వ్యక్తిగత హవా, మంచి పేరు మళ్లీ సీటు దక్కేలా చేసిందని చెప్పవచ్చు. తాను చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ గెలుపు లక్ష్యంగా నియోజకవర్గంలో విజయన్ దూసుకెళ్తోంటే, ఆయన స్పీడ్‌కు బ్రేకులు వేయడానికి స్థానికంగా పట్టున్న డాక్టర్‌ను అన్నాడీఎంకే రంగంలోకి దించింది.
డాక్టర్ కే గోపాల్‌కు అండగా మంత్రి ఆర్ కామరాజ్ నియోజకవర్గంలో తిష్ట వేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నారు. డీఎంకే వైఫల్యాలను టార్గెట్ చేసి ప్రచారంలో కే గోపాల్ దూసుకెళ్తోన్నారు. ఇక, సీపీఐ, సీపీఎంలకు పట్టున్న ప్రాంతాలు అనేకం. తమ బలాన్ని చాటుకునేందుకు సీపీఐ తరపున జీ పళని స్వామి రేసులో నిలబడ్డారు.
కార్మికులు, జాలర్ల ఓటు బ్యాంకును టార్గెట్ చేసి ప్రచారంలో పళని స్వామి ఉరకలు తీస్తుంటే, బీజేపీ కూటమి తరపున తాము రేసులో ఉన్నామని పీఎంకే ప్రకటించింది. కూటమిలోని డీఎండీకే, బీజేపీ, ఎండీఎంకే ఇతర మిత్రుల ఓటు బ్యాంకు మీదే ఆధారపడాల్సిన పరిస్థితి పీఎంకే అభ్యర్థికి ఏర్పడింది. తమకు పెద్దగా పట్టు లేనప్పటికీ అభ్యర్థిని కాంగ్రెస్ రేసులో దించడం విశేషం.
ఆ పార్టీ అభ్యర్థిగా సెంథిల్ పాండియన్ ఒంటరిగా బరిలోకి దిగారు. ప్రకృతి వైపరీత్యాలకు తరచూ నష్టాన్ని చవి చూస్తున్న నాగపట్నంలో మార్పు తీసుకురావడంలో నాయకులు విఫలం అయ్యారన్నది జగమెరిగిన సత్యం. నాగపట్నంకు ‘నాయకుడు’ ఎవరు అవుతారో వేచి చూడాల్సిందే!