traffic survey
-
శరవేగంగా మెట్రో సర్వే
90 శాతం పూర్తయిన హౌస్‌హోల్డ్ సర్వే టోపోగ్రఫీ సర్వే కూడా దాదాపు పూర్తి 16 నుంచి ట్రాఫిక్ సర్వే ప్రారంభం విశాఖపట్నం సిటీ : విశాఖ మహా నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు సర్వే శరవేగంగా జరుగుతోంది. దాదాపు గత నెల రోజులుగా వివిధ సాంకేతిక బృందాలు నగరంలో విస్తృతంగా పర్యటించి సర్వే చేపడుతున్నాయి. ఫిబ్రవరి ఆఖరి నాటికి సర్వేలు పూర్తి చేస్తామని ఏపీ ప్రభుత్వ మెట్రో రైలు ప్రాజెక్టు సలహాదారు శ్రీధరన్ చెప్పినట్టుగానే విశాఖలో వేగంగా సర్వే జరుగుతుంది. తొమ్మిది వేలకుగాను బుధవారం నాటికి 8400 ఇళ్లల్లో ఇంటింటి సర్వే పూర్తయింది. 39 కిలోమీటర్ల టోపోగ్రఫీ సర్వేకి దాదాపు 30 కిలోమీటర్ల మేర సర్వే పూర్తయినట్టు తెలిసింది. సర్వేలు త్వరితగతిన పూర్తి అయ్యేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నారు. -మహా విశాఖలో మూడు కారిడార్లలో మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టేందుకు సర్వే చేపడుతున్నారు. 39 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ ప్రాజెక్టు కోసం టోపోగ్రఫీ, ట్రాఫిక్, హౌస్‌హోల్డ్ సర్వేలను ముందుగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు సర్వేలను ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేసి ఆ తర్వాత డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)ను రూపొందించాలన్నది శ్రీధరన్ ఉద్దేశం. డీపీఆర్ పూర్తయిన వెంటనే వివిధ సాంకేతిక, ఆర్థిక, అంశాలతో విశ్లేషించి మరో నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తారు. ప్రభుత్వంతో తదుపరి చర్చలు సమావేశాలు నిర్వహించి ప్రాజెక్టు ఆమోదం పొందిన తర్వాత కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. -39 కిలోమీటర్ల మెట్రో కారిడార్ ఏర్పాటుకు అవసరమైన ట్రాఫిక్ సర్వేను ఈనెల 16 నుంచి ప్రారంభిస్తారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను విశాఖ కేంద్రంగా పని చేస్తున్న ఢిల్లీ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రతినిధి రవి పర్యవేక్షిస్తున్నారు. నగరంలోని ముఖ్య కూడళ్లలో నిర్వహించే ఈ సర్వే ఆధారంగానే మెట్రో రైలు ఆగే స్టేజీల ఏర్పాటు జరుగుతుంది. ఎన్ఏడీ జంక్షన్ నుంచి మధురవాడ వరకూ 24 కిలోమీటర్లలో మెట్రో రైలు హాల్టులను గుర్తిస్తారు. ప్రయాణికుల రాకపోకలు, ఏయే వర్గాలు ఎంతెంత మొత్తం ప్రయాణాల కోసం వెచ్చిస్తున్నారో, ఏయే వేళల్లో ఎన్ని వాహనాలు నడుస్తున్నాయో, బస్సులు ఖాళీగా తిరిగే వేళలు, ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉన్న వేళలను ఈ సర్వేలో లెక్క తేల్చనున్నారు. ట్రాఫిక్ సర్వేను వేగవంతంగా చేసేందుకు అవసరమైన బృందాలను సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి ట్రాఫిక్ సర్వేని ప్రారంభించి వచ్చే వారం నుంచి 10 రోజుల్లో మొత్తం సర్వేని పూర్తి చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ ప్రజలు రవాణా అవసరాలు ఎలా తీర్చుకుంటున్నారో తెలుసుకునే హౌస్ హోల్డ్ సర్వే నగరంలోని అన్ని వార్డుల నుంచి సేకరించారు. ఇంకా 300 నుంచి 400 మంది ఇంటి యజమానుల నుంచి మాత్రమే తీసుకోవాల్సి ఉంది. ఆ సర్వే పూర్తయిన వెంటనే డేటాను కంప్యూటరీకరిస్తారు. -
మరోసారి మెట్రో సర్వే
అధ్యయనం చేస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టు బృందం ట్రాఫిక్‌తో పాటు ఇంటింటికీ వెళ్లి సర్వే నేడు శ్రీధరన్ రాక విశాఖపట్నం సిటీ: మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన ట్రాఫిక్ సర్వే సోమవారం ప్రారంభమైంది. ఇప్పటికే ఇంజినీరింగ్ సర్వే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ రెండు సర్వేలను ఎలా చేస్తున్నదీ స్వయంగా పరిశీలించేందుకు మెట్రో రైలు ప్రాజెక్టు రాష్ట్ర ప్రధాన సలహాదారు శ్రీధరన్ మంగళవారం విశాఖకు రానున్నారు. విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టు కోసం చేపడుతున్న సర్వేలు ఎలా నిర్వహిస్తున్నదీ ఆయన స్వయంగా తెలుసుకుంటారు. మరికొన్ని వివరాలు రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. గత నెలలో విశాఖలో పూర్తిగా సర్వే చేసిన శ్రీధరన్ మళ్లీ విశాఖలో మెట్రో ప్రాజెక్టు నిర్మాణాలపై లోతుగా అధ్యయనం చేయనున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఆర్వీ అసోసియేట్స్ ఇంజినీరింగ్ సిబ్బంది ట్రాఫిక్ శాంపిల్ సర్వేను చేపట్టారు. ఇప్పటికే జీఎన్ ఇంజినీరింగ్ సంస్థ నగరంలో ఏర్పాటు చేయబోయే మెట్రో రూట్లపై సర్వే చేపడుతోంది. తాజాగా ట్రాఫిక్‌తో పాటు హౌస్‌హోల్డ్ సర్వేను ఆర్వీ అసోసియేట్స్ సంస్థకు శ్రీధరన్ అప్పగించారు. ఈ బృందం నెల రోజుల పాటు నగరమంతా తిరిగి ట్రాఫిక్‌తో పాటు ఇంటింటికీ వెళ్లి ప్రజలు ప్రయాణాల కోసం ఎంత మొత్తంలో ఖర్చు చేయనున్నారో తెలుసుకుంటారు. బస్సుల్లో ప్రయాణించేది ఎందరు, సొంత వాహనాల్లో తరలి వెళ్లేది ఎందరు, ఆటోలను వినియోగిస్తున్నవారెందరు, ద్విచక్ర వాహనాలతో రాకపోకలు చేసేదెందరు, ఆటోల్లో ఒక్కొక్కరూ వెళ్లేది ఎందరు, ప్రస్తుతమున్న చార్జీలను తట్టుకోలేకపోతున్న వారెందరు.. ఇలా రకరకాల కోణాల్లో సర్వే చేపడతారు. నగరంలోని మెట్రో రైలు ఉండే ప్రాంతాల్లోనే కాకుండా నగర పరిధిలోని 72 వార్డుల్లో ప్రజల అభిప్రాయాలను సమీకరిస్తారు. ఆటోలకు, బస్సులకు, సొంత కార్లకు, ప్రైవేట్ టాక్సీలకు ఏయే ప్రాంతాల వారు ఎంతెంత స్థాయిలో ఖర్చు చేస్తున్నారో ఈ బృందం నిగ్గుతేల్చనుంది. ఈ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగానే వచ్చే మెట్రో రైలు ఛార్జీలను ఎంత మొత్తంలో, ఏయే వేళల్లో రైళ్లను నడపాలో శ్రీధరన్ కమిటీ ఓ అంచనాకు రానుంది. అందుకే ఈ సర్వేకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ సర్వే జరుగుతుండగానే మెట్రో రైలుప్రాజెక్టును నిర్మించే ప్రాంతాల్లో భూసార పరీక్షలు నిర్వహించేందుకు మరో ఇంజినీరింగ్ బృందం రానుంది. వచ్చే రెండుమూడు మాసాల్లో సర్వేలన్నింటినీ పూర్తి చేసి ఓ అంచనాతో ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు శ్రీధరన్ బృందం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈ సర్వేలకు సాంకేతిక నిపుణత జోడించి మరింత ఆధునిక వివరాలను రాబట్టుకునేందుకు శ్రీధరన్ బృందంలోని కొందరు ఇంజినీర్లు సర్వే బృందాలతో మమేకమవుతున్నారు. విశాఖలో సర్వే బృందాలతో మెట్రో ప్రాజెక్టు సలహాదారు శ్రీధరన్ మంగళవారం, బుధవారం మధ్యాహ్నం వరకూ ఉండి ఇక్కడి నుంచి విజయవాడ వెళతారని తెలిసింది. సర్వేను త్వరితగతిన పూర్తి చేసేందుకు శ్రీధరన్ కమిటీకి, ఆయన నియమించే బృందాలకు అన్ని విభాగాల అధికారులు, ప్రజలు సహకరించాల్సిందిగా జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ ఒక ప్రకటనలో కోరారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేసేందుకు మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులు శాంపిల్ సర్వే చేపడుతున్నారని వెల్లడించారు. -
‘ఔటర్’ ట్రాఫిక్ పై సర్వే
=‘టోల్’ కొత్త టెండర్‌కు హెచ్ఎండీఏ సన్నాహాలు =అప్సెట్ ప్రైస్ నిర్ధారణకు వాహనాల లెక్కింపు =వచ్చే ఏడాది 3% పెరగనున్న టోల్ ట్యాక్స్ సాక్షి, సిటీబ్యూరో: నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుపై నిత్యం ప్రయాణించే వాహనాల సంఖ్యను లెక్క తేల్చేందుకు హెచ్ఎండీఏ నడుం బిగించింది. ఇందుకోసం ప్రత్యేకంగా సర్వే నిర్వహిస్తోంది. టోల్ బూత్‌ల వద్ద సిబ్బందిని నియమించి వచ్చిపోయే వాహనాలను లెక్కించే కార్యక్రమాన్ని చేపట్టింది. 24 గంటలూ మూడు షిఫ్టుల్లో సిబ్బంది విధులు నిర్వహిస్తూ 7 రకాల వాహనాలను విడివిడిగా లెక్కిస్తూ రికార్డు చేస్తున్నారు. ప్రస్తుతం ఔటర్ రింగ్‌రోడ్డుపై టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్న పి.కె. హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ టెండర్ ఒప్పందం గడువు 2014 మార్చి 26తో ముగియనుంది. ఆలోగా మళ్లీ టెండర్ నిర్వహించి కొత్త ఏజెన్సీని ఖరారు చేయాల్సి ఉంది. వాస్తవానికి ఔటర్ నిర్మాణం పూర్తయ్యేనాటికి అత్యాధునిక టోల్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే... టోల్ మేనేజ్మెంట్ సిస్టం (టీఎంఎస్) టెండర్ వివాదం హైకోర్టులో ఉండటంతో ఔటర్‌పై అత్యాధునిక టోల్ వ్యవస్థ ఏర్పాటయ్యేందు మరింత సమయం పట్టనుంది. అప్పటివరకు మేన్యువల్‌గా టోల్ వసూలు బాధ్యతను మళ్లీ ప్రైవేటు ఏజెన్సీకే అప్పగించాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. పెద్దఅంబర్‌పేట నుంచి శంషాబాద్ మీదుగా షామీర్పేట వరకు 127 కి.మీ. మార్గంలో ఏడాది (12 నెలల) పాటు టోల్ ట్యాక్స్ వసూలు బాధ్యతను అప్పగించేందుకు తాజాగా టెండర్ ఆహ్వానించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అంచనాల కోసం సర్వే... గతంలో నెలకు రూ.1.60కోట్లు హెచ్ఎండీఏకు చెల్లించేందుకు పి.కె. హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ముందుకు వచ్చి 18 నెలల వ్యవధికి టెండర్‌ను దక్కించుకొంది. అప్పట్లో రోజుకు (24గం.) 11వేల నుంచి 15వేల వాహనాలు ఔటర్‌పై ప్రయాణిస్తున్నట్లు అధికారులు లెక్కలు తేల్చి ఆ మేరకు కనీస మొత్తాన్ని నిర్ణయించారు. అయితే వాహనాల రాకపోకలు గణనీయంగా పెరిగాయి. పటాన్చెరు-షామీర్పేట రహదారి కూడా వినియోగంలోకి రావడంతో ప్రస్తుతం ఔటర్‌పై రోజుకు 30వేలకు పైగా వాహనాలు ప్రయాణిస్తున్నట్లు ప్రాథమిక గణాంకాల్లో వెల్లడైంది. పెద్దఅంబర్ పేట నుంచి శంషాబాద్ మీదుగా షామీర్పేట వరకు రోజుకు ఎన్ని కార్లు, ఎన్ని లారీలు, మరెన్ని మల్టీయాక్సిల్ వెహికల్స్ వస్తున్నాయి? అన్నది లెక్క తేల్చేందుకు ఈ నెల 24నుంచి ఓఆర్ఆర్ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. దీని ఆధారంగా ఆదాయాన్ని లెక్కించి టోల్ నిర్వహణ ఖర్చులు మినహాయించి రాబడిని తేలుస్తారు. ఈ మేరకు అప్సెట్ ప్రైస్ (కనీస మొత్తం)ను నిర్ణయించి టెండర్ పిలవాలని హెచ్ఎండీఏ భావిస్తోంది. జనవరి 10నాటికి సర్వే ప్రక్రియను పూర్తి చేయాలన్నది ఓఆర్ఆర్ అధికారులు లక్ష్యంగా పెట్టుకొన్నారు. నేషనల్ హైవే అథార్టీ నిబంధనల ప్రకారం ఔటర్‌పై ప్రస్తుతం వసూలు చేస్తున్న టోల్ ట్యాక్స్ మార్చి తర్వాత మరో 3% అదనంగా పెరగనుందని సమాచారం. తాజా టెండర్ ప్రకారం మార్చి నెలాఖరు నుంచి బాధ్యతలు స్వీకరించే కొత్త ఏజెన్సీ పాత రేట్ల ప్రకారం టోల్ వసూలు చేస్తుందా? లేక 3% అదనంగా పెంచి టోల్ మోత మోగిస్తుందా అన్నది వేచి చూడాల్సిందే. జనవరి 15న టెండర్... కొత్త టెండర్‌కు సంబంధించి అంచనాలు, నియమ నిబంధనలు ఇతర లాంఛనాలన్నీ త్వరగా పూర్తిచేసి జనవరి 15న బిడ్స్ ఆహ్వానించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎక్కువ సంస్థలు బిడ్డింగ్‌లో పాల్గొంటే పోటీ పెరిగి హెచ్ఎండీఏ మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బిడ్‌లో నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ కోట్ చేసిన సంస్థకే టెండర్ దక్క నుంది. టెండర్ ప్రకటన తర్వాత నిబంధనల ప్రకారం 30-45రోజులు వ్యవధి ఇచ్చి ఫిబ్రవరి నెలాఖరుకు ఏజెన్సీని ఖరారు చేస్తామని అధికారులు చెబుతున్నారు. వెంటనే ఒప్పందం కుదుర్చుకొని మార్చి 27నుంచి టోల్ వసూలు బాధ్యతను అర్హమైన ఏజెన్సీకి అప్పగిస్తామంటున్నారు. ఇప్పటివరకు (18నెలల పాటు) టోల్ వసూలు వల్ల హెచ్ ఎండీఏకు సుమారు రూ.22కోట్ల దాకా అదనపు ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఔటర్‌పై వాహనాల సంఖ్య పెరగడంతో ఆదాయం మరో రూ.15-20కోట్లదాకా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.