=‘టోల్’ కొత్త టెండర్‌కు హెచ్‌ఎండీఏ సన్నాహాలు
=అప్‌సెట్ ప్రైస్ నిర్ధారణకు వాహనాల లెక్కింపు
=వచ్చే ఏడాది 3% పెరగనున్న టోల్ ట్యాక్స్
సాక్షి, సిటీబ్యూరో: నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుపై నిత్యం ప్రయాణించే వాహనాల సంఖ్యను లెక్క తేల్చేందుకు హెచ్‌ఎండీఏ నడుం బిగించింది. ఇందుకోసం ప్రత్యేకంగా సర్వే నిర్వహిస్తోంది. టోల్ బూత్‌ల వద్ద సిబ్బందిని నియమించి వచ్చిపోయే వాహనాలను లెక్కించే కార్యక్రమాన్ని చేపట్టింది. 24 గంటలూ మూడు షిఫ్టుల్లో సిబ్బంది విధులు నిర్వహిస్తూ 7 రకాల వాహనాలను విడివిడిగా లెక్కిస్తూ రికార్డు చేస్తున్నారు. ప్రస్తుతం ఔటర్ రింగ్‌రోడ్డుపై టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్న పి.కె. హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ టెండర్ ఒప్పందం గడువు 2014 మార్చి 26తో ముగియనుంది. ఆలోగా మళ్లీ టెండర్ నిర్వహించి కొత్త ఏజెన్సీని ఖరారు చేయాల్సి ఉంది.
వాస్తవానికి ఔటర్ నిర్మాణం పూర్తయ్యేనాటికి అత్యాధునిక టోల్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే... టోల్ మేనేజ్‌మెంట్ సిస్టం (టీఎంఎస్) టెండర్ వివాదం హైకోర్టులో ఉండటంతో ఔటర్‌పై అత్యాధునిక టోల్ వ్యవస్థ ఏర్పాటయ్యేందు మరింత సమయం పట్టనుంది. అప్పటివరకు మేన్యువల్‌గా టోల్ వసూలు బాధ్యతను మళ్లీ ప్రైవేటు ఏజెన్సీకే అప్పగించాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. పెద్దఅంబర్‌పేట నుంచి శంషాబాద్ మీదుగా షామీర్‌పేట వరకు 127 కి.మీ. మార్గంలో ఏడాది (12 నెలల) పాటు టోల్ ట్యాక్స్ వసూలు బాధ్యతను అప్పగించేందుకు తాజాగా టెండర్ ఆహ్వానించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
అంచనాల కోసం సర్వే...
గతంలో నెలకు రూ.1.60కోట్లు హెచ్‌ఎండీఏకు చెల్లించేందుకు పి.కె. హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ముందుకు వచ్చి 18 నెలల వ్యవధికి టెండర్‌ను దక్కించుకొంది. అప్పట్లో రోజుకు (24గం.) 11వేల నుంచి 15వేల వాహనాలు ఔటర్‌పై ప్రయాణిస్తున్నట్లు అధికారులు లెక్కలు తేల్చి ఆ మేరకు కనీస మొత్తాన్ని నిర్ణయించారు.
అయితే వాహనాల రాకపోకలు గణనీయంగా పెరిగాయి. పటాన్‌చెరు-షామీర్‌పేట రహదారి కూడా వినియోగంలోకి రావడంతో ప్రస్తుతం ఔటర్‌పై రోజుకు 30వేలకు పైగా వాహనాలు ప్రయాణిస్తున్నట్లు ప్రాథమిక గణాంకాల్లో వెల్లడైంది. పెద్దఅంబర్ పేట నుంచి శంషాబాద్ మీదుగా షామీర్‌పేట వరకు రోజుకు ఎన్ని కార్లు, ఎన్ని లారీలు, మరెన్ని మల్టీయాక్సిల్ వెహికల్స్ వస్తున్నాయి? అన్నది లెక్క తేల్చేందుకు ఈ నెల 24నుంచి ఓఆర్‌ఆర్ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. దీని ఆధారంగా ఆదాయాన్ని లెక్కించి టోల్ నిర్వహణ ఖర్చులు మినహాయించి రాబడిని తేలుస్తారు.
ఈ మేరకు అప్‌సెట్ ప్రైస్ (కనీస మొత్తం)ను నిర్ణయించి టెండర్ పిలవాలని హెచ్‌ఎండీఏ భావిస్తోంది. జనవరి 10నాటికి సర్వే ప్రక్రియను పూర్తి చేయాలన్నది ఓఆర్‌ఆర్ అధికారులు లక్ష్యంగా పెట్టుకొన్నారు. నేషనల్ హైవే అథార్టీ నిబంధనల ప్రకారం ఔటర్‌పై ప్రస్తుతం వసూలు చేస్తున్న టోల్ ట్యాక్స్ మార్చి తర్వాత మరో 3% అదనంగా పెరగనుందని సమాచారం. తాజా టెండర్ ప్రకారం మార్చి నెలాఖరు నుంచి బాధ్యతలు స్వీకరించే కొత్త ఏజెన్సీ పాత రేట్ల ప్రకారం టోల్ వసూలు చేస్తుందా? లేక 3% అదనంగా పెంచి టోల్ మోత మోగిస్తుందా అన్నది వేచి చూడాల్సిందే.
జనవరి 15న టెండర్...
కొత్త టెండర్‌కు సంబంధించి అంచనాలు, నియమ నిబంధనలు ఇతర లాంఛనాలన్నీ త్వరగా పూర్తిచేసి జనవరి 15న బిడ్స్ ఆహ్వానించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎక్కువ సంస్థలు బిడ్డింగ్‌లో పాల్గొంటే పోటీ పెరిగి హెచ్‌ఎండీఏ మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బిడ్‌లో నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ కోట్ చేసిన సంస్థకే టెండర్ దక్క నుంది. టెండర్ ప్రకటన తర్వాత నిబంధనల ప్రకారం 30-45రోజులు వ్యవధి ఇచ్చి ఫిబ్రవరి నెలాఖరుకు ఏజెన్సీని ఖరారు చేస్తామని అధికారులు చెబుతున్నారు. వెంటనే ఒప్పందం కుదుర్చుకొని మార్చి 27నుంచి టోల్ వసూలు బాధ్యతను అర్హమైన ఏజెన్సీకి అప్పగిస్తామంటున్నారు. ఇప్పటివరకు (18నెలల పాటు) టోల్ వసూలు వల్ల హెచ్ ఎండీఏకు సుమారు రూ.22కోట్ల దాకా అదనపు ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఔటర్‌పై వాహనాల సంఖ్య పెరగడంతో ఆదాయం మరో రూ.15-20కోట్లదాకా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
‘ఔటర్’ ట్రాఫిక్ పై సర్వే
Published Mon, Dec 30 2013 5:10 AM | Last Updated on Sat, Sep 2 2017 2:05 AM
Advertisement
Advertisement