మరోసారి మెట్రో సర్వే
అధ్యయనం చేస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టు బృందం
ట్రాఫిక్‌తో పాటు ఇంటింటికీ వెళ్లి సర్వే
నేడు శ్రీధరన్ రాక
విశాఖపట్నం సిటీ: మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన ట్రాఫిక్ సర్వే సోమవారం ప్రారంభమైంది. ఇప్పటికే ఇంజినీరింగ్ సర్వే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ రెండు సర్వేలను ఎలా చేస్తున్నదీ స్వయంగా పరిశీలించేందుకు మెట్రో రైలు ప్రాజెక్టు రాష్ట్ర ప్రధాన సలహాదారు శ్రీధరన్ మంగళవారం విశాఖకు రానున్నారు. విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టు కోసం చేపడుతున్న సర్వేలు ఎలా నిర్వహిస్తున్నదీ ఆయన స్వయంగా తెలుసుకుంటారు. మరికొన్ని వివరాలు రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. గత నెలలో విశాఖలో పూర్తిగా సర్వే చేసిన శ్రీధరన్ మళ్లీ విశాఖలో మెట్రో ప్రాజెక్టు నిర్మాణాలపై లోతుగా అధ్యయనం చేయనున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఆర్‌వీ అసోసియేట్స్ ఇంజినీరింగ్ సిబ్బంది ట్రాఫిక్ శాంపిల్ సర్వేను చేపట్టారు. ఇప్పటికే జీఎన్ ఇంజినీరింగ్ సంస్థ నగరంలో ఏర్పాటు చేయబోయే మెట్రో రూట్‌లపై సర్వే చేపడుతోంది.
తాజాగా ట్రాఫిక్‌తో పాటు హౌస్‌హోల్డ్ సర్వేను ఆర్వీ అసోసియేట్స్ సంస్థకు శ్రీధరన్ అప్పగించారు. ఈ బృందం నెల రోజుల పాటు నగరమంతా తిరిగి ట్రాఫిక్‌తో పాటు ఇంటింటికీ వెళ్లి ప్రజలు ప్రయాణాల కోసం ఎంత మొత్తంలో ఖర్చు చేయనున్నారో తెలుసుకుంటారు. బస్సుల్లో ప్రయాణించేది ఎందరు, సొంత వాహనాల్లో తరలి వెళ్లేది ఎందరు, ఆటోలను వినియోగిస్తున్నవారెందరు, ద్విచక్ర వాహనాలతో రాకపోకలు చేసేదెందరు, ఆటోల్లో ఒక్కొక్కరూ వెళ్లేది ఎందరు, ప్రస్తుతమున్న చార్జీలను తట్టుకోలేకపోతున్న వారెందరు.. ఇలా రకరకాల కోణాల్లో సర్వే చేపడతారు. నగరంలోని మెట్రో రైలు ఉండే ప్రాంతాల్లోనే కాకుండా నగర పరిధిలోని 72 వార్డుల్లో ప్రజల అభిప్రాయాలను సమీకరిస్తారు. ఆటోలకు, బస్సులకు, సొంత కార్లకు, ప్రైవేట్ టాక్సీలకు ఏయే ప్రాంతాల వారు ఎంతెంత స్థాయిలో ఖర్చు చేస్తున్నారో ఈ బృందం నిగ్గుతేల్చనుంది. ఈ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగానే వచ్చే మెట్రో రైలు ఛార్జీలను ఎంత మొత్తంలో, ఏయే వేళల్లో రైళ్లను నడపాలో శ్రీధరన్ కమిటీ ఓ అంచనాకు రానుంది. అందుకే ఈ సర్వేకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ సర్వే జరుగుతుండగానే మెట్రో రైలుప్రాజెక్టును నిర్మించే ప్రాంతాల్లో భూసార పరీక్షలు నిర్వహించేందుకు మరో ఇంజినీరింగ్ బృందం రానుంది. వచ్చే రెండుమూడు మాసాల్లో సర్వేలన్నింటినీ పూర్తి చేసి ఓ అంచనాతో ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు శ్రీధరన్ బృందం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈ సర్వేలకు సాంకేతిక నిపుణత జోడించి మరింత ఆధునిక వివరాలను రాబట్టుకునేందుకు శ్రీధరన్ బృందంలోని కొందరు ఇంజినీర్లు సర్వే బృందాలతో మమేకమవుతున్నారు. విశాఖలో సర్వే బృందాలతో మెట్రో ప్రాజెక్టు సలహాదారు శ్రీధరన్ మంగళవారం, బుధవారం మధ్యాహ్నం వరకూ ఉండి ఇక్కడి నుంచి విజయవాడ వెళతారని తెలిసింది.
సర్వేను త్వరితగతిన పూర్తి చేసేందుకు శ్రీధరన్ కమిటీకి, ఆయన నియమించే బృందాలకు అన్ని విభాగాల అధికారులు, ప్రజలు సహకరించాల్సిందిగా జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ ఒక ప్రకటనలో కోరారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేసేందుకు మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులు శాంపిల్ సర్వే చేపడుతున్నారని వెల్లడించారు.