రేపే టీఎస్ ఐసెట్
సాక్షి, హైదరాబాద్/కేయూ క్యాంపస్: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు గురువారం (19న) నిర్వహించనున్న టీఎస్ ఐసెట్-2016కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కె. ఓంప్రకాశ్ మంగళవారం వెల్లడించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమని.. పరీక్ష ప్రారంభానికి గంట ముందు నుంచే పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తామన్నారు. కాకతీయవర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ పరీక్షకు 72,474 మంది అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.
రాష్ట్రంలోని 16 రీజినల్ సెంటర్ల పరిధిలో 127 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, అన్నీ ప్రభుత్వ విద్యాసంస్థలేనని తెలి పారు. పరీక్ష కోసం 127 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 32 మంది ప్రత్యేక పరిశీలకులను, 140 మంది లోకల్ అబ్జర్వర్లను నియమించామని, ఐసెట్‌కు తొలిసారిగా బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నామని ఓంప్రకాశ్ వివరించారు. ఇందుకోసం ప్రతి పరీక్ష కేంద్రంలో బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. వారు అభ్యర్థుల వేలిముద్రలతోపాటు డిజిటల్ ఫొటోలనూ తీసుకుంటారన్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్లతోపాటు పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం, బ్లూ లేదా బ్లాక్ పెన్నులు తెచ్చుకోవాలని సూచించారు. అభ్యర్థుల కోసం గతేడాది ఐసెట్ ప్రశ్నపత్రం, ‘కీ’ని www.tsicet.org వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. పరీక్ష కేంద్రాలకు సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధమన్నారు. ఈ నెల 21న ప్రాథమిక ‘కీ’ని విడుదల చేస్తామని, 24 వరకు అభ్యంతరాలను స్వీకరించి 31న తుది ‘కీ’తోపాటు ఫలితాలను వెల్లడిస్తామన్నారు.