'నేను చాలా భయపడ్డా'
పెర్త్: క్రికెటర్ ఆడమ్ వోజస్ తలకు బంతి బలంగా తగలడంతో తాను తొలుత ఆందోళనకు గురైనట్లు సహచర క్రికెటర్ అస్టన్ టర్నర్ పేర్కొన్నాడు. అతని హెల్మెట్కు కామెరెన్ స్టీవెన్సన్ వేసిన బంతి గట్టిగా తాకడంతో తాను కాసేపు నిశ్చేష్టుడిని అయిపోయానన్నాడు. అయితే వోజస్ కుప్పకూలకపోవడంతో తనలో భయం కాస్త తగ్గినట్లు టర్నర్ తెలిపాడు.
'ఆ బంతి వోజస్ హెల్మెట్ వెనుక బాగాన తగిలిన మరుక్షణమే నాకు భయమేసింది. ఏమి చేయాలో అర్ధం కాలేదు. అవతలి వైపు ఉన్న నేను అలానే ఉండిపోయా. వోజస్ మోకాళ్లను, చేతులను భూమిపై పెట్టి కాసేపు బాధను ఓర్చుకునే ప్రయత్నం చేశాడు. కాకపోతే ఫీల్డ్లో కుప్పకూలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందనుకున్నా. ఆ తరువాత మ్యాచ్ కు సంబంధించిన వైద్య సిబ్బంది అక్కడికి వచ్చి అతనికి ప్రాథమిక చికిత్స చేయడంతో నేను కాస్త కుదుటపడ్డా'అని టర్నర్ తెలిపాడు.
షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ లో భాగంగా గురువారం తస్మానియా జట్టుతో ఆడుతున్న సమయంలో కామ్ స్టీవెన్సన్ విసిరిన బంతి వెస్ట్రన్ ఆస్ట్రేలియా కెప్టెన్ వోజస్ తలను బలంగా తాకింది. అయితే దీంతో వోజస్ ఫీల్డ్లోనే విలవిల్లాడిపోయాడు.ఆ తరువాత ఫీల్డర్లు వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని స్టేడియంలోకి తరలించారు.