బ్రిటన్ పార్లమెంటులో కశ్మీర్‌పై చర్చ
తీవ్ర నిరసన తెలిపిన భారత్
లండన్ : బ్రిటన్ పార్లమెంటులో గురువారం కశ్మీర్ అంశంపై చర్చ జరిగింది. కశ్మీర్ లోయలో నెలకొన్న సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని బ్రిటన్ ప్రకటించింది. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. కశ్మీర్ విషయంలో మూడో శక్తి జోక్యాన్ని సహించబోమని స్పష్టం చేసింది. ‘జమ్మూకశ్మీర్‌తోపాటు భారత్–పాకిస్తాన్ మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి షిమ్లా ఒప్పందం, లాహోర్ డిక్లరేషన్ కు అనుగుణంగా శాంతియుత విధానంలో ద్వైపాక్షిక చర్చలు జరగాలి. అంతేతప్ప మూడో వ్యక్తి జోక్యం చేసుకునేందుకు అవకాశం లేదు’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు.
బుధవారం యూకే హౌజ్ ఆఫ్ కామన్స్ లో జరిగిన చర్చలో భారత్–పాక్ మధ్య శాంతి చర్చల ప్రక్రియ మొదలవ్వటమే కశ్మీర్ సమస్యకు దీర్ఘకాల పరిష్కారమని.. ఈ చర్చలు జరిగేలా బ్రిటన్ చొరవlతీసుకోవాలని సభ్యులు కోరారు. ‘లడఖ్, జమ్మూ, కశ్మీర్ ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న అమాయక ప్రజలకోసం.. మధ్యవర్తిత్వానికి మేం సిద్ధం. లడఖ్, జమ్మూ, కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమే. భారత్–పాక్ ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి తీర్మానానికి కట్టుబడి ఉండాలి’ అని కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ తెలిపారు.