బాలీవుడ్ సంగీతంతో ఐఎస్‌పై యుద్ధం
ట్రిపోలి:ఎవరైనా శత్రువును మట్టి కరిపించి విజయం సాధిస్తే ఆనందోత్సవాలతో నృత్యం చేస్తారు. సంగీత హోరులో ఊగిపోతారు. తన్మయంలో తేలిపోతారు. శత్రువును ఓడించేందుకే సంగీతాన్ని ఆయుధంగా చేసుకోవడాన్ని మాత్రం ప్రపంచంలో ఎక్కడా ఇంతవరకు చూడలేదు. అంతర్యుద్ధంతో రగిలిపోతున్న లిబియాలో ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులను తుదముట్టించేందుకు బ్రిటిష్ సైనికులు సంగీతాన్ని, అందులోనూ బాలివుడ్ సంగీతాన్ని ఆయుధంగా చేసుకొని సరికొత్త పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.
ఐఎస్ఐఎస్ టైస్టులు బాలివుడ్ సంగీతాన్ని ఇస్లాం మతానికి వ్యతిరేకమని భావిస్తారు. దాన్ని వినడాన్ని దైవ దూషణ కింద పరిగణిస్తారు. ఈ విషయం తెలిసిన పాకిస్తాన్లో పుట్టి బ్రిటన్ సైన్యంలో ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేస్తున్న ఓ అధికారి వారిపై మానసిక యుద్ధానికి వ్యూహ రచన చేశారు.
దాని ప్రకారం లిబియా ప్రభుత్వానికి అండగా పోరాటం జరుపుతున్న రెండు బ్రిటన్ దళాలు ఐఎస్ఐఎస్పై ఈ మానసిక యుద్ధాన్ని ప్రారంభించాయి. బాలివుడ్ సంగీతాన్ని టెర్రరిస్టులు భరించలేరని, ఆ సంగీతానికి దూరంగా పారిపోతారని లేదా చిర్రెత్తినట్లు ప్రవర్తిస్తారని ఆ దళాలు అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాయి.
ఇప్పటికే కోస్తా తీరంలోని బెన్ జావెద్, నొఫీలియా పట్టణాలను టెర్రరిస్టులు నుంచి స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ సంకీర్ణ దళాలు మొహమ్మద్ గడాఫీ జన్మస్థలమైన సిర్తే నగరంవైపు రెండు భారీ మైకుల్లో బాలివుడ్ సంగీతపు హోరును వినిపించుకుంటూ దూసుకెళుతున్నాయి. వాటి బాణీలకు అనుగుణంగా సైనికులు నృత్యం చూస్తూ ఉత్సాహంగా ముందుకు వెళుతున్నారు.
ఈ ప్రయోగం ఏదో బాగుందనుకున్న అమెరికా జాయింట్ ఆపరేషన్స్ కమాండ్ దళం కూడా బాలీవుడ్ సంగీతాన్ని ఆయుధంగా వాడుతోంది. సోషల్ మీడియా విప్లవం కారణంగా లిబియాలో మొహమ్మద్ గడాఫీ ప్రభుత్వం కూలిపోవడం, ఆ స్థానంలో ఐక్య సంఘటనా ప్రభుత్వం ఏర్పడడం తదితర పరిణామాలు తెలిసినవే. ప్రభుత్వ శక్తుల మధ్య ఐక్యత లేకపోవడం వల్ల ఆ నాటి నుంచి లిబియాలో అంతర్యుద్ధం చెలరేగుతోంది. ఈ పరిస్థితులను ఆసరా చేసుకొని ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులు లిబియాను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోంది.