ఉనికిలి సొసైటీలో చోరీ
ఉనికిలి(అత్తిలి) : ఉనికిలి విశాల సహకార పరపతి సంఘం భవనంలో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఈ ఘటన మండలంలో కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అత్తిలి మండలం ఉనికిలిలో మెయిన్‌రోడ్డు పక్కన ఉన్న సొసైటీ ప్రధాన ద్వారం తలుపులను పగులగొట్టి లోనికి ప్రవేశించిన దుండగులు సేల్స్ కౌంటర్లోని రూ.రెండులక్షల నగదుతోపాటు నాలుగు సీసీ కెమెరాలు, రెండు కంప్యూటర్లు, ఎల్సీడీ టీవీని అపహరించుకుపోయారు. రికార్డు గదికి నిప్పటించారు. నగదు ఉన్న సొరుగులోని స్ట్రాంగ్‌రూం తాళాలు తీసుకున్న దొంగలు బంగారు ఆభరణాలు భద్రపరిచే రూం తెరిచేందుకు విఫలయత్నం చేశారు. సాధ్యం కాకపోవడంతో వెళ్తూ వెళ్తూ.. రికార్డులు భద్రపరిచిన గదికి నిప్పంటించారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో సొసైటీ భవనం పక్కనే నివాసం ఉంటున్న వృద్ధురాలు సుబ్బలక్ష్మి పొగలు రావడాన్ని గమనించి స్థానికులకు సమాచారం ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సొసైటీ అధ్యక్షుడు వట్టికూటి సూర్యనారాయణఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో కలిసి మంటలను అదుపు చేసేందుకు యత్నించారు. అగ్నిమాపక సిబ్బందికి వచ్చి మంటలను పూర్తిస్థాయిలో అదుపు చేశారు. ఎస్ఐ వి.వెంకటేశ్వరరావు సొసైటీకి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తణుకు సీఐ చింతా రాంబాబు కూడా వచ్చి సొసైటీని పరిశీలించారు. ఏలూరు నుంచి వేలి ముద్ర నిపుణలు రప్పించి ఆధారాలు సేకరించారు. పోలీసు జాగిలంతో తనిఖీలు చేపట్టారు. జాగిలం పశువుల ఆస్పత్రి వరకూ వచ్చి ఆగింది. సొసైటీ కార్యదర్శి రావి చిట్టిబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వి.వెంకటేశ్వరరావు తెలిపారు.