కనీస వేతనం రూ. 10,700
- అన్‌స్కిల్డ్ కార్మికుల వేతనంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
- ప్రస్తుతమున్న రూ. 7,500కు మరో రూ. 3,200 చేర్చి ఖరారు
- స్కిల్డ్ కార్మికులకు రూ.18 వేల నుంచి 22 వేలుగా నిర్ణయం
- రెండు రోజుల్లో వెలువడనున్న ఉత్తర్వులు
- మొత్తం 17 లక్షల మంది కార్మికులకు లబ్ధి
సాక్షి, హైదరాబాద్
రాష్ట్రంలో అన్‌స్కిల్డ్ కార్మికులకు కనీస వేతనాన్ని రూ. 10,700గా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న కనీస వేతనం రూ. 7,500కు అదనంగా రూ. 3,200 కలిపింది. దేశవ్యాప్తంగా కనీస వేతనం రూ. 10 వేలు ఉండేలా చట్టం చేస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో అంతకన్నా ఎక్కువగానే కనీస వేతనం ఉండేలా చర్యలు తీసుకుంది. అలాగే నైపుణ్య కార్మికులకు కనీస వేతనం రూ. 18 వేల నుంచి రూ. 22 వేల వరకు ఉండేలా ఖరారు చేసింది. ఇందుకు సంబంధించి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువరించనుంది.
ధరల పెరుగుదలకు అనుగుణంగా రాష్ట్రంలో కనీస వేతనాన్ని రూ. 12 వేలకు పెంచాలంటూ కార్మిక సంఘాలు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కార్మికశాఖ ఈ మేరకు ప్రభుత్వానికి వివరిస్తూ నివేదికను అందజేసింది. అయితే పరిశ్రమ యాజమాన్యాలతోపాటు వివిధ వర్గాల వారితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ పలుమార్లు చర్చించి కనీస వేతనం రూ.10,700గా ఉండాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. దీనికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదముద్ర వేశారు. నైపుణ్యరహిత కార్మికులందరికీ పరిశ్రమలన్నీ కచ్చితంగా ప్రభుత్వం నిర్దేశించిన వేతనాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయంతో స్కిల్డ్, అన్‌స్కిల్డ్ రంగాలకు చెందిన దాదాపు 17 లక్షల మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉందని కార్మికశాఖ అంచనా వేస్తోంది.
కనీస జీవన ప్రమాణాల మేరకు..
నిత్యావసరాల ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని కనీస జీవన ప్రమాణాలకు అనుగుణంగా కనీస వేతనాలను నిర్ణయించేందుకు కార్మికశాఖ పలు రంగాలకు చెందిన నిపుణులతో కమిటీని వేసింది. ఈ మేరకు కమిటీ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిత్యావసరాలు, దుస్తులు, పిల్లల చదువులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని కనీస వేతనాన్ని లెక్కించింది. మరోవైపు కేంద్రం దేశవ్యాప్తంగా కనీస వేతనాన్ని రూ. 10 వేలుగా నిర్ణయించనున్న నేపథ్యంలో రాష్ట్రంలో దానికన్నా అదనంగా కనీస వేతనం ఉండేలా చర్యలు తీసుకుంటామని మేడే వేడుకల సందర్భంగా మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం కనీస వేతనాన్ని రూ.10,700గా నిర్ణయించింది.
లక్షల మందికి లబ్ధి..
రాష్ట్రంలోని మొత్తం 39,864 పరిశ్రమల్లో దాదాపు 85 లక్షల 17 వేల మంది పనిచేస్తున్నారు. వీరిలో నైపుణ్యరహిత విభాగానికి సంబంధించి దాదాపు లక్ష మందికిపైగా పనిచేస్తున్నట్లు కార్మికశాఖ గుర్తించింది. అలాగే పారిశుద్ధ్య కార్మికులతోపాటు మిగతా విభాగాల్లో 70 వేల మంది ఉన్నట్లు లెక్కవేసింది. వీరందరికీ కనీస వేతనం అందేలా చూడాలని నిర్ణయించింది. కనీస వేతనాన్ని తొలి విడతలో భాగంగా ఎలక్ట్రానిక్స్, బేకరీ, గాజు పరిశ్రమల వంటి ఎంపిక చేసిన వాటిల్లో కచ్చితంగా అమలయ్యేలా చూడాలని కార్మికశాఖ భావిస్తోంది. ఒకవేళ ఉత్తర్వులను బేఖాతరు చేస్తే కార్మిక చట్టాలను అనుసరించి వారిపై కేసులు నమోదు చేయాలని కూడా నిర్ణయించింది. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.