చిక్కుల్లో కమల్ హాసన్
తిరునెల్వేలి: ప్రముఖ నటుడు కమల్ హాసన్ చిక్కుల్లోపడ్డారు. హిందువులు పవిత్రంగా భావించే మహాభారత ఇతిహాసంపై కమల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టుగా తమిళనాడులోని వలియూర్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో మే 5వ తేదీన హాజరై వివరణ ఇవ్వాలని కోర్టు ఆయన్ను ఆదేశించింది. నరుంబూనాథర్ ఆలయ భక్తుల సమాఖ్య కార్యదర్శి ఆదినాథ సుందరం ఫిర్యాదు మేరకు ఈ కేసును విచారణ చేసి, తమకు నివేదిక సమర్పించాల్సిందిగా పజువూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ను వలియూర్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ సెంథిల్ కుమార్ ఆదేశించారు.
గత మార్చి 12న ఓ తమిళ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ మహాభారతంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్టు పిటిషన్‌దారు పేర్కొన్నారు. సినిమాలలో మహిళలపై ఎక్కువగా హింసాత్మక దృశ్యాలు చూపించడం గురించి అడిగిన ఓ ప్రశ్నకు కమల్ బదులిస్తూ.. దేశంలో ప్రజలు మహిళలను తక్కువ భావనతో చూస్తారని, మహాభారతంలో కూడా ఓ మహిళను పాచికలాటలో పందెం కాశారని చెప్పారు. భారతీయులు మహాభారత్‌ను అమితంగా గౌరవిస్తారని, ఈ ఇతిహాసంలో మహిళను జూదంలో పావుగా చూపించారని తెలిపారు. హిందువులను, మహాభారత్‌ను అవమానించేలా కమల్ వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని, భారీ జరిమానా వేయాలని పిటిషన్‌దారు కోర్టును కోరారు.