Vijaya Lakshmi jakkampudi
-
మీకో రూలు..ప్రజలకో రూలా?: జక్కంపూడి
ముఖ్యమంత్రి చంద్రబాబు తమవారికో రూలు.. ప్రజలకో రూలు అన్నవిధంగా పాలన సాగిస్తున్నారని వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ లేకపోయినా విజయవాడలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని నిరంకుశంగా తొలగించిన చంద్రబాబు.. భక్తుల మనోభావాలు, ఆచార, సంప్రదాయాలకు విరుద్ధంగా రాజమహేంద్రవరం పుష్కర ఘాట్లో 15 అడుగుల ఎత్తున రూపొందించిన శ్రీకష్ణుడి వేషంలోని ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆదివారం నెలకొల్పడమే ఇందుకు నిదర్శనమన్నారు. సినీ ప్రపంచంలో గొప్ప నటుడైన ఎన్టీఆర్ విగ్రహం పెట్టవద్దని ఎవ్వరూ అనరని, అయితే ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏర్పాటు చేయడాన్నే తాము ప్రశ్నిస్తున్నామని అన్నారు. అధికార మదంతో చంద్రబాబు ఇష్టానుసారం వ్యవహ రిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని, తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. విభజన చట్టం హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తేకుండా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని నిలదీయకుండా చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. తన అవినీతి, అక్రమాలతో రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని విజయలక్ష్మి ధ్వజమెత్తారు. -
‘ప్రభుత్వానికి కోర్టులపై గౌరవం లేదు’
రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టులు, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదన్న విషయం తేటతెల్లమవుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని తన నివాసంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. చట్టప్రకారం ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ చెల్లనేరదని, అయినా సస్పెండ్ చేశారని అన్నారు. రోజా కోర్టు ఆర్డరు ఇచ్చి, తనను అసెంబ్లీకి రానివ్వాలని అడిగితే రావడానికి వీల్లేదంటున్నారన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మాట్లాడనివ్వకుండా గూండాగిరీ చే స్తూ, ప్రజాస్వామ్యం నోరు నొక్కేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం తనవాళ్ళకు ఏవిధంగా డబ్బు కూడబెట్టాలి, ఏరకంగా భూ కబ్జాలు చేయాలి, ఇసుక, మట్టి దోపిడీ చేయాలి అనే ఆలోచనతో పనిచేస్తోందని ఆరోపించారు. టీడీపీ ని ఎన్నుకున్నందుకే తిప్పలు పడుతున్నామన్న భావన అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోందన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతాయన్నారు. రైతులకు రుణమాఫీ చేయలేకపోయినా.. కనీసం పంటలకు నీరిద్దామన్న ఆలోచన కూడా సర్కారుకు లేదని విమర్శించారు. రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.