ముఖ్యమంత్రి చంద్రబాబు తమవారికో రూలు.. ప్రజలకో రూలు అన్నవిధంగా పాలన సాగిస్తున్నారని వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం ఆమె విలేకర్లతో మాట్లాడారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ లేకపోయినా విజయవాడలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని నిరంకుశంగా తొలగించిన చంద్రబాబు.. భక్తుల మనోభావాలు, ఆచార, సంప్రదాయాలకు విరుద్ధంగా రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో 15 అడుగుల ఎత్తున రూపొందించిన శ్రీకష్ణుడి వేషంలోని ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆదివారం నెలకొల్పడమే ఇందుకు నిదర్శనమన్నారు.
సినీ ప్రపంచంలో గొప్ప నటుడైన ఎన్టీఆర్ విగ్రహం పెట్టవద్దని ఎవ్వరూ అనరని, అయితే ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏర్పాటు చేయడాన్నే తాము ప్రశ్నిస్తున్నామని అన్నారు. అధికార మదంతో చంద్రబాబు ఇష్టానుసారం వ్యవహ రిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని, తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. విభజన చట్టం హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తేకుండా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని నిలదీయకుండా చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. తన అవినీతి, అక్రమాలతో రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని విజయలక్ష్మి ధ్వజమెత్తారు.