రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టులు, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదన్న విషయం తేటతెల్లమవుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని తన నివాసంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు.
చట్టప్రకారం ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ చెల్లనేరదని, అయినా సస్పెండ్ చేశారని అన్నారు. రోజా కోర్టు ఆర్డరు ఇచ్చి, తనను అసెంబ్లీకి రానివ్వాలని అడిగితే రావడానికి వీల్లేదంటున్నారన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మాట్లాడనివ్వకుండా గూండాగిరీ చే స్తూ, ప్రజాస్వామ్యం నోరు నొక్కేస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబు ప్రభుత్వం తనవాళ్ళకు ఏవిధంగా డబ్బు కూడబెట్టాలి, ఏరకంగా భూ కబ్జాలు చేయాలి, ఇసుక, మట్టి దోపిడీ చేయాలి అనే ఆలోచనతో పనిచేస్తోందని ఆరోపించారు. టీడీపీ ని ఎన్నుకున్నందుకే తిప్పలు పడుతున్నామన్న భావన అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోందన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతాయన్నారు.
రైతులకు రుణమాఫీ చేయలేకపోయినా.. కనీసం పంటలకు నీరిద్దామన్న ఆలోచన కూడా సర్కారుకు లేదని విమర్శించారు. రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.