గ్రామీణ రోడ్ల ఆధునికీకరణ
పీఆర్, ఉపాధి శాఖల కమిషనర్ రామాంజనేయులు
కొత్తపేట :
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్)– కింద 14 వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామీణ రోడ్లను సీసీ రోడ్లుగా ఆధునికీకరించామని రాష్ట్ర పంచాయతీరాజ్, ఉపాధి శాఖల కమిషనర్ వి.రామాంజనేయులు తెలిపారు. సోమవారం ఆయన కొత్తపేటలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద నిర్మించిన వర్మీ కంపోస్టు యార్డును ప్రారంభించి అక్కడే మొక్కలు నాటారు. విలేకరులతో మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం రూ.2 వేల కోట్లతో 5 వేల కిలోమీటర్ల రోడ్లను ప్రతిపాదించినట్టు తెలిపారు. ఇంతవరకూ 1,658 కిలోమీటర్ల రోడ్లు నిర్మించినట్టు తెలిపారు. ప్రతి ఇంటా వ్యక్తిగత మరుగుదొడ్లు, భూగర్బజలాల పెంపునకు వ్యక్తిగత నీటికుంటలు, మొక్కల పెంపకం, వర్మీకంపోస్టు తయారు వంటివి చేపడుతున్నట్టు తెలిపారు. వర్మీకంపోస్టు తయారీ కేంద్రాలు అన్ని పంచాయతీల్లో ఏర్పాటు చేసుకుంటే పనివారిని, ట్రాక్టర్లు, రిక్షాలు సమకూరుస్తామన్నారు. డ్వామా పీడీ నాగేశ్వరరావు, ఏపీడీ ఎ.వరప్రసాద్, ఎంపీడీఓ పి.వీణాదేవి, ఏపీఓ ఎన్.ఆనంద్, గ్రామ కార్యదర్శి వీవీ రామన్ పాల్గొన్నారు.