V.shiva kumar
-
ఈ-కాప్స్ సేవలు ప్రారంభం
కరీంనగర్‌క్రైం : క్రైం క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్(సీసీటీఎన్ఎస్)లో భాగంగా ఇంటర్ ప్రైస్ ఈ-కాప్స్ విధానాన్ని ఎస్పీ వి.శివకుమార్ బుధవారం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని కేఎస్.వ్యాస్ స్మారకహాల్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సద్వినియోగం చేసుకుంటూ పోలీసు శాఖ తన సేవలను విసృతం చేస్తోందన్నారు. మున్ముందు కాగిత రహిత పాలన అందుబాటులోకి రానున్నదని చెప్పారు. మారుమూల పోలీస్‌స్టేషన్ నుంచి దేశ రాజధాని వరకు పోలీసుల సేవలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచేందుకు సీసీటీఎన్ఎస్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఈ విధానం అమలు కోసం పోలీస్‌స్టేషన్ రైటర్లు, ఎస్హెచ్ఓలకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఆవగాహన పెంచుకుని మెరుగైన సేవలందించాలన్నారు. ఆరు నెలల పాటు సీసీటీఎన్ఎస్ విభాగం తరపున సాంకేతిక నిపుణులు ప్రతి పోలీస్‌స్టేషన్‌లో అందుబాటులో ఉంటారన్నారు. ఓఎస్డీ సుబ్బరాయుడు, డీసీఆర్బీ డీఎస్పీ సంజీవరావు, ఎన్ఐబీ ఇన్స్పెక్టర్ సర్వర్, ఆర్ఐ గంగాధర్, ఐటీ కోర్‌టీం ఇన్చార్జి ఎంఎస్.ఖురేషి, ఐటీ కోర్ టీం సభ్యులు పాల్గొన్నారు. జిల్లాలో ఫిబ్రవరిలో డయల్ 100 సేవలకు 3914 అత్యవసర ఫిర్యాదులు రాగా, పరిష్కరించినట్లు తెలిపారు. -
నక్సల్స్‌తో సమాజానికి కీడు
లింగంపేట(చందుర్తి), న్యూస్‌లైన్ : సమాజానికి నక్సలైట్లు ఏ విధంగానూ ఉపయోగపడరని ఎస్పీ వి.శివకుమార్ అన్నారు. పోలీసులతో నక్సలిజం పారిపోలేదని, సమాజ తిరస్కరణతోనే పొరుగు రాష్ట్రాలకే కార్యకలాపాలు పరిమితం చేశారని అన్నారు. చందుర్తి మండలం లింగంపేట శివారులో.. నక్సల్స్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసులు, ప్రజలస్మృతికి చిహ్నంగా నిర్మించిన స్మారక స్తూపాన్ని గురువారం సాయంత్రం ఎస్పీ, ఓఎస్డీ సుబ్బారాయుడులు ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల ఆత్మశాంతి కోసం మౌనం పాటించారు. ఎస్పీ శివకుమార్ మాట్లాడుతూ, అమాయకులను ఇన్ఫార్మర్ల పేరుతో బలితీసుకుంటూ మావోయిస్టులు ఉనికి చాటుకుంటున్నారని విమర్శించారు. నక్సల్స్ ఘాతుకాలకు బలైన ఎందరో పోలీసుల కుటుంబాలు వీధినపడ్డాయన్నారు. వనజీవనాన్ని గడుపుతున్న నక్సలైట్లను ఆలోజింపజేసేందుకు సారంగపూర్ మండలం బీర్పూర్లో అంతర్మథనం కార్యక్రమం నిర్వహించామని, వారు జనజీవన స్రవంతిలో కలిస్తే తాము ఆదుకుంటామని చెప్పారు. నక్సల్స్ తప్పిదాల ఫలితంగానే గ్రామాల్లో అభివృద్ధి నిలిచిపోయిందని విమర్శిం చారు. ప్రజల సహకారంతో పోలీసులం ఏమైనా సాధిస్తామన్నారు. బడుగు, బలహీన వర్గాల యువతకు ఉపాధి కల్పించాలనే పోలీసుభరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామయని పేర్కొన్నారు. ఓఎస్డీ సుబ్బారాయుడు మాట్లాడుతూ, హింసావాదులను తరిమికొట్టి, అభివృద్ధి కి చేయూతనందించే బాధ్యత ప్రతి పౌరునిపై ఉందన్నా రు. మందపాతరకు బలైన ఎస్సై శ్రీనివాస్‌రావు భార్య సుజాత, నక్సల్స్ హింసాత్మక సంఘటనల్లో మృతి చెంది న వారి కుటుంబాలు, డీఎస్పీలు డి. నర్సయ్య, వేణుగోపాల్‌రావు, సీఎన్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, సీఐలు శ్రీనివాస్, నాగేంద్రాచారి, రంగయ్యగౌడ్, దేవారెడ్డిలు, ఎస్సైలు ప్రతాప్, మాలకొండరాయుడు, కనుకయ్య ఉన్నారు. -
లారీలకు.. దారివ్వండి!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ఇసుక అక్రమ రవాణాలో పోలీసుల పాత్రపై విమర్శల పరంపరకు ముగింపు పలికేందుకు కొత్త ఎస్పీ వి.శివకుమార్ చేపట్టిన చర్యలు ఇసుక మాఫియాకు ఇబ్బం దులు సృష్టిస్తున్నాయి. జిల్లాలోని నదులు, వాగుల నుంచి హైదరాబాద్‌తోపాటు ఇతర జిల్లాలకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న మాఫియాపై కఠినంగా వ్యవహరించాలని పది రోజుల క్రితం ఎస్పీ శివకుమార్ పోలీసు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా సరిహద్దులు దాటి ఇసుక రవాణా జరిగితే సంబంధిత పోలీస్‌స్టేషన్ ఎస్సైలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ రవాణా జరిగే స్టేషన్ పరిధిలోని సీఐలకు చార్జీమెమోలు ఇస్తామని, డీఎస్పీలు ఈ విషయంలో పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. ఇన్నాళ్లు పోలీసుల సహకారంతోనే జిల్లా నుంచి ఇసుక రాత్రి సమయాల్లో సరిహద్దులు దాటి వెళ్లేది. ఏ సమయంలో ఏ మార్గంలో ఇసుక లారీలు హైదరాబాద్‌కు బయలుదేరుతాయో పోలీసులకే బాగా తెలిసేది. ఎస్పీ ఆదేశాలతో ఇప్పుడు లారీల నియంత్రణ బాధ్యత పోలీసు సిబ్బందిపైనే పడింది. గతంలోలాగాసహకరించినా... ఉదాసీనంగా ఉన్నా తమ ఉద్యోగాలకే ఎసరు వస్తుందనే ఉద్దేశంతో ఇసుక రవాణా విషయంలో పోలీసులు ఎస్పీ ఆదేశాలకు అనుగుణంగా విధులు నిర్వర్తించడం ప్రారంభించారు. వారం రోజులుగా జిల్లా సరిహద్దుల నుంచి ఇసుక ఎక్కడికీ వెళ్లకుండా చేస్తున్నారు. ఇది ఇసుక మాఫియాకు ఇబ్బందికరంగా మారింది. ప్రతి రోజు సగటున 500 లారీల ఇసుక హైదరాబాద్‌కు వెళ్తుండేది. ఒక్కో లారీకి రూ.15-20 వేల వరకు ధర పలుకుతోంది. ఈ లెక్కన అక్రమంగా జిల్లా నుంచి వెళ్తున్న ఇసుక విలువ రోజుకు రూ.75 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటుంది. ఇంత ఆదాయం పోతుండడంతో ఇసుక మాఫియా ఎలాగైనా ఆంక్షలను తొలగింపజేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని పరిస్థితి ఉండడంతో రాజకీయ పెద్దలను ఆశ్రయించారు. ఇసుక రవాణా ఎక్కువగా జరుగుతున్న సిరిసిల్ల, మానకొం డూర్, హుజూరాబాద్, వేములవాడ నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అక్కడి ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలతో తమ ఇబ్బందులను చెప్పుకున్నారు. ఎప్పటిలాగే అధికార, ప్రతిపక్ష పార్టీల ముఖ్యనేతలు కూడబలుక్కుని ఇసుక రవాణాకు అడ్డంకులు కలిగించవద్దని స్థానికంగా ఉన్న పోలీసు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. పోలీసు బాస్ నుంచే ఆదేశాలు ఉన్నాయని చెప్పి కిందిస్థాయి అధికారులు తప్పించుకుంటున్నారు. దీంతో రాజకీయ నేతలు ఏకంగా జిల్లా అధికారులకే ఫోన్లు చేసి ఆంక్షలు వద్దని చెబుతున్నారు. జిల్లా దాటి వెళ్లకుండా చూస్తే వచ్చే ఇబ్బందులు ఏమిటని అధికారులు ప్రశ్నిస్తుండడంతో ఏమీ చెప్పలేకపోతున్నారు. ఇలా అయితే పని జరగదని భావించి రెండు రోజులుగా కొత్త పల్లవి అందుకున్నారు. ఇసుక రవాణాకు సంబంధించి జిల్లా సరిహద్దులు దాటకుండా ఆంక్షలు పెట్టడంతో ప్రజాప్రతినిధులు ఆ విషయాన్ని సూటిగా చెప్పకుండా.. గ్రామాల్లో స్థానిక అవసరాలకు ఇసుక ఇబ్బంది అవుతోందని, ఆంక్షలను సడలించాలని జిల్లా అధికారులకు సూచిస్తున్నారు. నిబంధనల ప్రకారం ట్రాక్టర్లను పట్టుకునే అవకాశం ఉండదని, ఎందుకు పట్టుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. ట్రాక్టర్లతో పగలు వందల కొద్ది ట్రిప్పులు ఒకచోట పోసి రాత్రి పూట లారీల్లో తరలిస్తున్న విషయాన్ని విస్మరిస్తున్నారు. రెండు రోజులుగా రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఏం చేయాలనే విషయంపై కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు శనివారం లేదా సోమవారం సమావేశం అవుతున్నట్లు తెలిసింది. వీరి నిర్ణయంపై ఇసుక మాఫియా వ్యాపారం ఆధారపడి ఉండనుంది. మరోవైపు ఎస్పీ ఆదేశాలను కొందరు కిందిస్థాయి పోలీసు అధికారులు దుర్వినియోగం చేస్తున్నారు. గ్రామాలకు ట్రాక్టర్లతో రవాణా చేసే ఇసుక విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అక్రమ రవాణాకు సహకరించే ట్రాక్టర్ల యజమానులు, స్థానిక ప్రజల అవసరాలకు రవాణా చేసేవారు ఎవరనేది పోలీసులకు తెలిసినా... ఆంక్షల పేరిట స్థానికులను ఇబ్బంది పెడుతున్నారు. కేసులు నమోదు చేస్తామని చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ అంశాలే జిల్లా సరిహద్దులపై ఆంక్షలు తొలగించుకునేందుకు ఇసుక మాఫియాకు సహకరిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇసుక కొత్త విధానంపై రాష్ట్ర ప్రభుత్వం 2012 నవంబర్ 15న ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ నీరు, చెట్టు, భూమి(వాల్టా) చట్టానికి అనుగుణంగా వివిధ శాఖలతో జిల్లా అధికారుల కమిటీ పరిశీలించి ఇసుక రీచ్‌లను గుర్తించాలి. జిల్లాలో ఈ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఇసుక అక్రమ రవాణా ఆగడంలేదు. కొత్త విధానంలోని లోపాలు ఇసుక అక్రమ రవాణాకు దోహదపడుతున్నాయి. కొత్త విధానంలోని లోపాలపై గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి పలువురు కోర్టుకు వెళ్లడంతో దీని అమలు రాష్ట్రవ్యాప్తంగా ఆగిపోయిందని అధికారులు చెబుతున్నారు.