సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ఇసుక అక్రమ రవాణాలో పోలీసుల పాత్రపై విమర్శల పరంపరకు ముగింపు పలికేందుకు కొత్త ఎస్పీ వి.శివకుమార్ చేపట్టిన చర్యలు ఇసుక మాఫియాకు ఇబ్బం దులు సృష్టిస్తున్నాయి. జిల్లాలోని నదులు, వాగుల నుంచి హైదరాబాద్‌తోపాటు ఇతర జిల్లాలకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న మాఫియాపై కఠినంగా వ్యవహరించాలని పది రోజుల క్రితం ఎస్పీ శివకుమార్ పోలీసు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా సరిహద్దులు దాటి ఇసుక రవాణా జరిగితే సంబంధిత పోలీస్‌స్టేషన్ ఎస్సైలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ రవాణా జరిగే స్టేషన్ పరిధిలోని సీఐలకు చార్జీమెమోలు
ఇస్తామని, డీఎస్పీలు ఈ విషయంలో పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. ఇన్నాళ్లు పోలీసుల సహకారంతోనే జిల్లా నుంచి ఇసుక రాత్రి సమయాల్లో సరిహద్దులు దాటి వెళ్లేది. ఏ సమయంలో ఏ మార్గంలో ఇసుక లారీలు హైదరాబాద్‌కు బయలుదేరుతాయో పోలీసులకే బాగా తెలిసేది.
ఎస్పీ ఆదేశాలతో ఇప్పుడు లారీల నియంత్రణ బాధ్యత పోలీసు సిబ్బందిపైనే పడింది. గతంలోలాగాసహకరించినా... ఉదాసీనంగా ఉన్నా తమ ఉద్యోగాలకే ఎసరు వస్తుందనే ఉద్దేశంతో ఇసుక రవాణా విషయంలో పోలీసులు ఎస్పీ ఆదేశాలకు అనుగుణంగా విధులు నిర్వర్తించడం ప్రారంభించారు. వారం రోజులుగా జిల్లా సరిహద్దుల నుంచి ఇసుక ఎక్కడికీ వెళ్లకుండా చేస్తున్నారు. ఇది ఇసుక మాఫియాకు ఇబ్బందికరంగా మారింది. ప్రతి రోజు సగటున 500 లారీల ఇసుక హైదరాబాద్‌కు వెళ్తుండేది. ఒక్కో లారీకి రూ.15-20 వేల వరకు ధర పలుకుతోంది. ఈ లెక్కన అక్రమంగా జిల్లా నుంచి వెళ్తున్న ఇసుక విలువ రోజుకు రూ.75 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటుంది.
ఇంత ఆదాయం పోతుండడంతో ఇసుక మాఫియా ఎలాగైనా ఆంక్షలను తొలగింపజేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని పరిస్థితి ఉండడంతో రాజకీయ పెద్దలను ఆశ్రయించారు. ఇసుక రవాణా ఎక్కువగా జరుగుతున్న సిరిసిల్ల, మానకొం డూర్, హుజూరాబాద్, వేములవాడ నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అక్కడి ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలతో తమ ఇబ్బందులను చెప్పుకున్నారు. ఎప్పటిలాగే అధికార, ప్రతిపక్ష పార్టీల ముఖ్యనేతలు కూడబలుక్కుని ఇసుక రవాణాకు అడ్డంకులు కలిగించవద్దని స్థానికంగా ఉన్న పోలీసు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. పోలీసు బాస్ నుంచే ఆదేశాలు ఉన్నాయని చెప్పి కిందిస్థాయి అధికారులు తప్పించుకుంటున్నారు.
దీంతో రాజకీయ నేతలు ఏకంగా జిల్లా అధికారులకే ఫోన్లు చేసి ఆంక్షలు వద్దని చెబుతున్నారు. జిల్లా దాటి వెళ్లకుండా చూస్తే వచ్చే ఇబ్బందులు ఏమిటని అధికారులు ప్రశ్నిస్తుండడంతో ఏమీ చెప్పలేకపోతున్నారు. ఇలా అయితే పని జరగదని భావించి రెండు రోజులుగా కొత్త పల్లవి అందుకున్నారు. ఇసుక రవాణాకు సంబంధించి జిల్లా సరిహద్దులు దాటకుండా ఆంక్షలు పెట్టడంతో ప్రజాప్రతినిధులు ఆ విషయాన్ని సూటిగా చెప్పకుండా.. గ్రామాల్లో స్థానిక అవసరాలకు ఇసుక ఇబ్బంది అవుతోందని, ఆంక్షలను సడలించాలని జిల్లా అధికారులకు సూచిస్తున్నారు. నిబంధనల ప్రకారం ట్రాక్టర్లను పట్టుకునే అవకాశం ఉండదని, ఎందుకు పట్టుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. ట్రాక్టర్లతో పగలు వందల కొద్ది ట్రిప్పులు ఒకచోట పోసి రాత్రి పూట లారీల్లో తరలిస్తున్న విషయాన్ని విస్మరిస్తున్నారు. రెండు రోజులుగా రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఏం చేయాలనే విషయంపై కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు శనివారం లేదా సోమవారం సమావేశం అవుతున్నట్లు తెలిసింది. వీరి నిర్ణయంపై ఇసుక మాఫియా వ్యాపారం ఆధారపడి ఉండనుంది. మరోవైపు ఎస్పీ ఆదేశాలను కొందరు కిందిస్థాయి పోలీసు అధికారులు దుర్వినియోగం చేస్తున్నారు. గ్రామాలకు ట్రాక్టర్లతో రవాణా చేసే ఇసుక విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.
అక్రమ రవాణాకు సహకరించే ట్రాక్టర్ల యజమానులు, స్థానిక ప్రజల అవసరాలకు రవాణా చేసేవారు ఎవరనేది పోలీసులకు తెలిసినా... ఆంక్షల పేరిట స్థానికులను ఇబ్బంది పెడుతున్నారు. కేసులు నమోదు చేస్తామని చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ అంశాలే జిల్లా సరిహద్దులపై ఆంక్షలు తొలగించుకునేందుకు ఇసుక మాఫియాకు సహకరిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇసుక కొత్త విధానంపై రాష్ట్ర ప్రభుత్వం 2012 నవంబర్ 15న ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ నీరు, చెట్టు, భూమి(వాల్టా) చట్టానికి అనుగుణంగా వివిధ శాఖలతో జిల్లా అధికారుల కమిటీ పరిశీలించి ఇసుక రీచ్‌లను గుర్తించాలి. జిల్లాలో ఈ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఇసుక అక్రమ రవాణా ఆగడంలేదు. కొత్త విధానంలోని లోపాలు ఇసుక అక్రమ రవాణాకు దోహదపడుతున్నాయి. కొత్త విధానంలోని లోపాలపై గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి పలువురు కోర్టుకు వెళ్లడంతో దీని అమలు రాష్ట్రవ్యాప్తంగా ఆగిపోయిందని అధికారులు చెబుతున్నారు.
లారీలకు.. దారివ్వండి!
Published Sat, Nov 16 2013 2:27 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement