కెంట్ ఇక మరింత స్మార్ట్..
♦ కెంట్ ఆర్వో సిస్టమ్స్ డెరైక్టర్ వరుణ్ గుప్తా
♦ ఉపకరణాలన్నీ ఇంటర్నెట్ సౌకర్యంతో...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాటర్ ప్యూరిఫయర్ల వ్యాపారంలో ఉన్న కెంట్ ఆర్వో సిస్టమ్స్ ‘స్మార్ట్’గా అడుగులేస్తోంది. కెంట్ సూపర్బ్ పేరుతో ప్రపంచంలో తొలి స్మార్ట్ ఆర్వో ప్యూరిఫయర్‌ను ఈ సంస్థ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదే ఊపుతో వచ్చే రెండేళ్లలో అన్ని ఉపకరణాలను ఇంటర్నెట్ సౌకర్యంతో (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) రూపొందిస్తామని కెంట్ డెరైక్టర్ వరుణ్ గుప్తా వెల్లడించారు. నూతన శ్రేణి ఉపకరణాలను హైదరాబాద్ మార్కెట్లో ప్రవేశపెట్టిన సందర్భంగా శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ‘స్మార్ట్ ఉపకరణాల వైపు మార్కెట్ దూసుకెళ్తోంది. వాటర్, ఎయిర్ ప్యూరిఫయర్లు, ఇతర ఉపకరణాలను ఇంటర్నెట్ సౌకర్యంతో తయారు చేయాలని నిర్ణయించాం. కొద్ది రోజుల్లో ఈ విభాగంలో వాటర్ ప్యూరిఫయర్‌ను విడుదల చేస్తాం. ఉపకరణంలో సమస్య ఉంటే నేరుగా సర్వీసింగ్ కేంద్రానికి సమాచారం వెళ్తుంది’ అని వివరించారు. కాగా, టచ్ స్క్రీన్ ఫీచర్ గల కెంట్ సూపర్బ్ ధర రూ.25 వేలు. నీటిలో మలినాలు, టీడీఎస్ స్థాయి, నీటి నిల్వ, ఫిల్టర్ జీవిత కాలం వంటి వివరాలను స్క్రీన్‌పై చూపిస్తుంది. ఫిల్టర్ జీవిత కాలం మరో 60 గంటలలోపు మాత్రమే ఉంటే అలర్ట్ చేస్తుంది.
సులభ వాయిదాల్లో..: సామాన్యునికి అందు బాటులోకి తేవడం లక్ష్యంగా సులభ వాయిదాల్లో(ఈఎంఐ) కొనుగోళ్లను ప్రోత్సహించడానికి మరిన్ని బ్యాంకులతో చేతులు కలుపుతున్నామని వరుణ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఇప్పటికే బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ ద్వారా 1,300లకుపైగా రిటైలర్లు కస్టమర్లకు ఈఎంఐ సౌకర్యం కల్పిస్తున్నారు. సంస్థ అమ్మకాల్లో ఈఎంఐ విభాగం వాటా 4 శాతం ఉంది’ అని చెప్పారు.
రూ.100 కోట్లతో ప్లాంటు..
కెంట్ నోయిడాలో రూ.100 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ప్లాంటు ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. నెలకు 75,000 యూనిట్ల ప్యూరిఫయర్లను తయారు చేస్తారు. కంపెనీకి ఇప్పటికే ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో నెలకు 75 వేల యూనిట్ల సామర్థ్యమున్న ప్లాంటు ఉంది. కోల్డ్ ప్రాసెస్ జ్యూసర్లు మినహా ప్యూరిఫయర్లను ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు ఏర్పాటు చేసే అంశాన్ని కంపెనీ పరిశీలిస్తోందని వరుణ్ చెప్పారు. ఏటా 3-4 కొత్త మోడళ్లు ప్రవేశపెడతామని తెలిపారు.