నిరుద్యోగులను ముంచేసిన మహిళా హోంగార్డు
సాక్షి, ఒంగోలు: ప్రజలకు రక్షణగా నిలిచి అన్యాయాలను అడ్డుకోవాల్సిన ఓ మహిళా హోంగార్డు.. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసింది. డీజీపీ పేరుతో స్టాంపులు తయారుచేసి ఒకే కుటుంబంలో ముగ్గురికి నకిలీ నియామకపత్రాలిచ్చింది. లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ నిరుద్యోగులను ముంచేసింది. ఓ నిరుద్యోగి చేసిన ఫిర్యాదుతో ఈ మోసం బయటపడింది. ఈ వివరాలను జిల్లా ఎస్పీ మలికాగర్గ్ సోమవారం మీడియాకు వెల్లడించారు.
ఒంగోలుకు చెందిన చెట్ల వాణి తండ్రి పోలీస్ శాఖలో పనిచేసేవారు. పెళ్లయిన తర్వాత ఆమె భర్త నిరాదరణకు గురయ్యింది. తల్లిదండ్రులు కూడా చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న అప్పటి డీజీపీ ఈమెను హోంగార్డుగా నియమించారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఆమె అడ్డదారులు తొక్కింది. సింగరాయకొండకు చెందిన షేక్ ఖాజాహుస్సేన్, కృష్ణలతో చేతులు కలిపింది. వీరు ముగ్గురూ కలిసి హోంగార్డు పోస్టులు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు ఎరవేసి మోసం చేయడం మొదలుపెట్టారు. ఈక్రమంలో వాణికి ఒంగోలు బలరాం కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్లు పరిచయమయ్యాడు. హోంగార్డు పోస్టులు ఇప్పిస్తున్నానని చెప్పడంతో నమ్మిన వెంకటేశ్వర్లు.. డిగ్రీ చదువుతున్న తన అల్లుడు శివకుమార్‌రెడ్డికి ఉద్యోగం ఇప్పించాలని కోరాడు. ఇందుకోసం ఆమె అడిగిన రూ.60 వేలను రెండు దఫాల్లో చెల్లించారు. అయితే ఆమె ఇచ్చిన నియామకపత్రం నకిలీదని తెలియడంతో బాధితుడు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. చెట్ల వాణి, హుస్సేన్, కృష్ణ చేసిన మరికొన్ని మోసాలు కూడా బయటపడ్డాయి. ఒక కేసులో తండ్రి, కుమారుడు, కుమార్తెకు నకిలీ నియామక పత్రాలిచ్చినట్లు వెల్లడైంది. ఇప్పటి వరకు ఐదుగురి వద్ద నుంచి రూ.5 లక్షలకు పైగా వసూలు చేశారని ఎస్పీ తెలిపారు. నిందితులకు ఇందిరమ్మ కాలనీకి చెందిన జిరాక్స్ షాపు నిర్వహించే అరుణ, కొల్లు జయలక్ష్మి సహకరించారని వెల్లడించారు. ఐదుగురిని అరెస్టు చేసి డీజీపీ పేరుతో తయారు చేసిన స్టాంపులు, నకిలీ నియామకపత్రాలను సీజ్ చేశామన్నారు. కేసును వేగంగా దర్యాప్తు చేసిన డీఎస్పీ నాగరాజు, సీఐ సుభాషిణి, ఎస్సై ముక్కంటి, ఏఎస్సై గుర్రం ప్రసాద్ తదితరులను ఎస్పీ అభినందించారు.