వరల్డ్ విజన్ ఇండియా బ్లాగథాన్
ఐదేళ్లలోపు చిన్నారులు చాలామందిలో గల పోషకాహార లోపంపై అవగాహన కల్పించేందుకు ‘యూత్ కీ ఆవాజ్’తో కలసి ‘వరల్డ్ విజన్ ఇండియా’ బ్లాగథాన్ ప్రారంభించింది. ప్రపంచ వ్యాప్తంగా తక్కువ బరువు గల ఐదేళ్లలోపు చిన్నారుల్లో నాలుగో వంతు మంది భారత్లోనే ఉన్నారని, దేశ జనాభాలో 40 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ‘వరల్డ్ విజన్ ఇండియా’ సీఈవో డాక్టర్ జయకుమార్ క్రిస్టియన్ పేర్కొన్నారు.
ఈ విషయంపై అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియాను.. ముఖ్యంగా బ్లాగులను ఉపయోగించుకోవాలనుకుంటున్నామని, అందుకే బ్లాగథాన్ ప్రారంభించామని ఆయన తెలిపారు. ఇందులో పాల్గొనే వారు ‘ఆకలి అంటే..’ అనే అంశంపై వీడియో, వ్యాసం, కవిత, డూడుల్ లేదా ఫొటోస్టోరీ వంటివి www.youthkiawaaz.com/hungeris/ వెబ్సైట్లో ఈ నెల 20వ తేదీలోగా పోస్ట్ చేయవచ్చని చెప్పారు. పోస్ట్ చేసిన వాటిలో ఉత్తమ ఎంట్రీలకు ‘మోటో ఈ’ మొబైల్ ఫోన్ బహూకరించనున్నట్లు ప్రకటించారు.