యుక్తేశ్వర గిరి
యోగి కథ
క్రియాయోగ విద్యకు ప్రాచుర్యం కల్పించిన మహావతార్ బాబా శిష్యపరంపరలోని అగ్రగణ్యుల్లో యుక్తేశ్వర గిరి ఒకరు. బెంగాల్‌లోని సెరామ్‌పూర్ పట్టణంలో 1855 మే 10న ఒక సంపన్న కుటుంబంలో జన్మించారు. తండ్రి క్షేత్రనాథ్ కారర్, తల్లి కాదంబిని. యుక్తేశ్వర గిరి అసలు పేరు ప్రియానాథ్ కారర్. బాల్యంలో చురుకైన విద్యార్థిగా ఉండేవారు. శ్రీరామ్పూర్లోని క్రిస్టియన్ మిషనరీ కాలేజీలో, కలకత్తా మెడికల్ కాలేజీలో విద్యాభ్యాసం కొనసాగించారు. కాలేజీలో చదువుతుండగానే బైబిల్‌పై ఆసక్తి పెంచుకున్నారు. సన్యాసం స్వీకరించాక రాసిన ‘ద హోలీ సైన్స్’ గ్రంథంలో బైబిల్ సూక్తులకు, యోగసూత్రాలకు గల సారూప్యతను కూలంకషంగా వివరించారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోవడంతో కుటుంబ భారాన్ని మోశారు. కాలేజీ చదువు పూర్తయ్యాక పెళ్లి చేసుకున్నారు. కూతురు పుట్టిన కొన్నాళ్లకే భార్య మరణించడంతో సన్యాసం స్వీకరించారు. కుంభమేళాలో పాల్గొనేందుకు 1884లో అలహాబాద్ వెళ్లినప్పుడు యుక్తేశ్వర గిరికి గురువు లాహిరి మహాశయుడు తారసపడ్డారు.
లాహిరి మహాశయునితో కాశీకి వెళ్లి, ఆయన వద్ద క్రియాయోగ విద్యను నేర్చుకున్నారు. సెరామ్పూర్లోని తన పూర్వీకుల రెండంతస్తుల ఇంటిని ఆశ్రమంగా మార్చి, అక్కడే శిష్యులకు వసతి సౌకర్యాలన్నీ కల్పించి, వారికి యోగవిద్యను బోధించేవారు. కొంతకాలానికి ఒడిశాలోని పూరీలో కూడా మరో ఆశ్రమం స్థాపించారు. యుక్తేశ్వర గిరికి జ్యోతిషంలోనూ అపారమైన పాండిత్యం ఉండేది. యోగసాధనతో పాటు జ్యోతిషశాస్త్రంలో విస్తృత పరిశోధనలు చేసేవారు. వివిధ సమస్యలతో సతమతమయ్యే శిష్యులకు, సందర్శకులకు జ్యోతిషపరమైన పరిష్కారాలు సూచించి, వారికి ఉపశమనం కలిగించేవారు. యుక్తేశ్వర గిరి శిష్యులలో ఒకరైన పరమహంస యోగానంద విదేశాలలో యోగవిద్యకు ప్రాచుర్యం కల్పించి ప్రఖ్యాతి పొందారు. పూరీ ఆశ్రమంలో ఉండగా, 1936 మార్చి 9న మహాసమాధి పొందారు.