నామ్‌కే వాస్తేగా ‘బడి బాట’, ‘ప్రైవేటు’కే తల్లిదండ్రుల మొగ్గు | - | Sakshi
Sakshi News home page

నామ్‌కే వాస్తేగా ‘బడి బాట’, ‘ప్రైవేటు’కే తల్లిదండ్రుల మొగ్గు

Published Thu, Jun 29 2023 12:48 AM | Last Updated on Thu, Jun 29 2023 12:22 PM

మొక్కు‘బడి’! - Sakshi

మొక్కు‘బడి’!

ఆదిలాబాద్‌టౌన్‌: ఈ సారి చిన్నారుల అడుగులు సర్కారు బడి వైపు పడలేదు.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని చేపట్టింది. దాదాపు నెల పాటు ఈ కార్యక్రమం కొనసాగించినా ఆశించిన మేర ప్రయోజనం చేకూరలేనట్టు తెలుస్తోంది. బడిబయట పిల్లలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులను పాఠశాలల్లో చేర్పించాల్సి ఉన్నప్పటికీ విద్యా శాఖాధికారుల అలసత్వమో, ఉపాధ్యాయుల నిర్లక్ష్యమేమో గానీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మాత్రం పెరగలేదు. చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేట్‌లోనే చేర్పించారు.

విద్యా శాఖాధికారుల లెక్కల ప్రకారం బడిబాటలో భాగంగా 3,717 మంది విద్యార్థులు సర్కారు బడుల్లో చేరినట్లు చెబుతున్నారు. మరోవైపు ప్రైవేట్‌ యాజమాన్యాలు నెల పాటు జిల్లాలోని ఆయా గ్రామాల్లో తిరుగుతూ తల్లిదండ్రులను ఒప్పించి వారి పిల్లలను తమ పాఠశాలల్లో చేర్పించుకున్నారు. ఆ తర్వాత సర్కారు ఉపాధ్యాయులు గ్రామాల్లో నామ్‌కే వాస్తేగా బడిబాట కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థుల సంఖ్య పెరగకపోవడంతో జూలై 6వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని పొడిగించినట్లు అధికారులు చెబుతున్నారు.

ప్రైవేటు వైపే మొగ్గు..
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతులు లేకపోవడంతో తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేట్‌లోనే చేర్పించినట్లు తెలుస్తోంది. గతేడాది నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టినా ఆశించిన ఫలితాలు రాకపోవడం గమనార్హం. 1,236 అంగన్‌వాడీ కేంద్రాల్లో దాదాపు 13వేల మంది చిన్నారులు 1వ తరగతిలో చేరాల్సి ఉండగా, ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం 2,687 మంది మాత్రమే చేరారు. మిగతా వారంతా ప్రైవేట్‌లోనే చేరినట్లు తెలుస్తోంది. జిల్లాలో ఈసారి ప్రైవేట్‌ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులు కేవలం 104 మంది ఉండగా, కొత్త అడ్మిషన్లు మరో 926నమోదైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇక 6 నుంచి 14 ఏళ్లలోపు బడిబయట ఉన్న 225 మంది చిన్నారులను గుర్తించినట్లు చెబుతున్నారు. అయితే వీరిలో ఎంతమంది బడిలో చేరారనే సమాచారం విద్యా శాఖాధికారుల వద్ద లేకపోవడం గమనార్హం.

వెక్కిరిస్తున్న ఖాళీలతో..
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. మొత్తం 3,028 మంది ఉపాధ్యాయుల పోస్టులు ఉండగా, ఇందులో 577 ఖాళీగా ఉన్నాయి. ఉపాధ్యాయులు ఉన్నచోట విద్యార్థులు లేకపోవడం.. విద్యార్థులు ఉన్నచోట ఉపాధ్యాయులు లేని పరిస్థితి. ఒక్క విద్యార్థి కూడా లేని పాఠశాలలు జిల్లాలో పది ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాగే దాదాపు ఒక్క ఉపాధ్యాయుడు లేని మరో పది వరకు పాఠశాలలు ఉండడం గమనార్హం. ఈ పాఠశాలలకు సమీపంలోని ఉపాధ్యాయులతో సర్దుబాటు చేసినా ఫలితం ఉండని పరిస్థితి.

మౌలిక వసతులు కరువు..
సర్కారు బడుల్లో మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థుల సంఖ్య పెరగడం లేదని తెలుస్తోంది. జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న గ్రామాలతో పాటు దాదాపు 30 నుంచి 40కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల విద్యార్థులు సైతం జిల్లా కేంద్రంలోని ప్రై వేట్‌ పాఠశాలలకు వచ్చి చదువులు కొనసాగిస్తున్నా రు. ఆయా గ్రామాల నుంచి ప్రైవేట్‌ పాఠశాలల బ స్సులు ఉదయం విద్యార్థులను తీసుకెళ్లి, సాయంత్ర ం వదిలేస్తున్నారు.

దీంతోపాటు ఆటోల్లో సైతం వి ద్యార్థులను తల్లిదండ్రులు ప్రైవేట్‌ పాఠశాలలకు పంపిస్తున్నారు. ఆయా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా తల్లిదండ్రులు వారిని అక్కడ చేర్పించడం లేదు. తాగునీరు, మరుగుదొడ్లు, ఆటస్థలం, ఇతర మౌలిక వసతులు లేని కారణంగా మొగ్గు చూపడం లేదు. మన ఊరు–మనబడి కింద మొదటి విడతలో 237 పాఠశాలలను ఎంపిక చేసినా ఇందులో ఇప్పటివరకు కనీసం 50శాతం కూడా పూర్తి కాలేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో ఇట్టే తెలిసిపోతుంది.

పకడ్బందీగా బడిబాట..
బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపడుతున్నాం. అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుతున్న, బడిబయట ఉన్న చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు చేపట్టాం. తల్లిదండ్రులు పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించాలి. మౌలిక వసతులతో పాటు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజన పథకం అందిస్తున్నాం. బడిబాటలో భాగంగా ఇప్పటివరకు 3,717 మందిని చేర్పించడం జరిగింది. జూలై 6వరకు ఈ కార్యక్రమం చేపడతాం.
– ప్రణీత, డీఈవో

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement