లాటరీ పేరుచెప్పి.. ఊరి చివరకు తీసుకెళ్లి.. ఓ మహిళను | - | Sakshi
Sakshi News home page

లాటరీ పేరుచెప్పి.. ఊరి చివరకు తీసుకెళ్లి.. ఓ మహిళను

Published Sun, Aug 13 2023 1:42 AM | Last Updated on Sun, Aug 13 2023 8:24 AM

- - Sakshi

ఆదిలాబాద్‌: లాటరీలో రెండు తులాల బంగారం గెలుచుకున్నావని మాయమాటలు చెప్పి.. ఓ మహిళను ఊరి చివరకు తీసుకెళ్లి ఆమె మెడలోని బంగారు గొలుసు తీసుకుని పారిపోయిన ఘటన నిర్మిల్‌ జిల్లా కుంటాల మండలం కల్లూర్‌లో శనివారం జరిగింది. పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పెంట పెద్దమ్మ ఇంటికి ఒక వ్యక్తి బైక్‌పై వచ్చాడు. పెద్దమ అంటే ఎవరు అని అడిగాడు. అందుకు ఆమె తానేనని చెప్పింది. దీంతో ‘నీవు జియో నెట్‌వర్క్‌ నుంచి ఎయిర్‌టెల్‌కు మారావా’ అని అడిగాడు. అవునని పెద్దమ్మ చెప్పడంతో నెట్‌వర్క్‌ మారినందుకు లక్కీ లాటరీ తగిలిందని, రెండు తులాల బంగారం గెలుచుకున్నావని చెప్పాడు.

దీంతో ఉబ్బి తబ్బిబ్బయిన పెద్దమన్న.. తాను ఏం చేస్తే బంగారం ఇస్తారని అడిగింది. ఏమీ లేదని రూ.10 ఇవ్వాలని చెప్పాడు. ఏమీ ఆలోచించకుండా పెద్దమ్మ ఇంట్లోకి వెళ్లి రూ.10 అడిగితే రూ.110 ఇచ్చింది. రూ.100 సంతోషంగా ఇస్తున్నానని చెప్పింది. దీంతో ఆ డబ్బులు తీసుకున్న సదరు వ్యక్తి.. మెయిన్‌ రోడ్డు వద్ద ఆఫీసర్లు ఉన్నారని, తనతో వస్తే బంగారం ఇప్పిస్తానని చెప్పాడు. అందుకు సరే అన్న పెద్దమ్మ.. సదరు వ్యక్తి బైక్‌పై వెళ్లింది. సదరు వ్యక్తి ఊరి చివరన ఉన్న 61 నంబర్‌ జాతీయ రహదారి వద్ద వాసవీ కళాశాల వరకు తీసుకెళ్లాడు.

అక్కడ బైక్‌ ఆపి.. సమీపంలోని బైక్‌షోరూంలోకి వెళ్లాడు. కాసేపటికి వచ్చి.. పెద్దమను ఆమె మెడలో ఉన్న రెండు తులాల గొలుసు ఇవ్వమని అడిగాడు. వెంటనే ఆమె గొలుసు ఇచ్చింది. ఇక్కడే ఉండమని, గొలుసు తూకం వేసుకుని బంగారం తీసుకువస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఎంతసేపైనా సదరు వ్యక్తి రాకపోవడంతో పెద్దమ్మ షోరూంలోకి వెళ్లి అడిగింది. వారు అతనెవరో తమకు తెలియదని చెప్పడంతో మోసపోయానని గ్రహించింది. వెంటనే విలపిస్తూ కుంటాల పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. నిందితుడు బైక్‌ మహిళను బైక్‌పై వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయినట్లు పోలీసులు గుర్తించారు. ఈమేరకు దర్యాప్తు చేస్తున్న ఎస్సై హన్మాండ్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement