ఆసిఫాబాద్‌రూరల్/మందమర్రిరూరల్: ప్రమాదవశాత్తు స్కూటీపై నుంచి పడి మహిళ టీచర్ మృతిచెందగా మరో టీచర్‌కు తీవ్ర గాయాలైన సంఘటన శనివారం మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... మందమర్రికి చెందిన మంజుల (34), మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన చెందిన నిర్మల వాంకిడి మండలంలో వేర్వేరు ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. మంజుల నార్లాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా, నిర్మల వాంకిడి ఉన్నత పాఠశాలలో ఎస్‌ఏగా విధులు నిర్వహిస్తున్నారు.
వీరు ఇటీవల బదిలీపై జిల్లాకు వచ్చారు. నిత్యం బస్సులో ఆసిఫాబాద్‌కు వచ్చి అక్కడి నుంచి స్కూటీపై వాంకిడికి వెళ్తుంటారు. శనివారం కూడా ఆసిఫాబాద్‌కు వచ్చి స్కూటీపై వాంకిడికి వెళ్తున్న క్రమంలో ఇప్పల్ నవెగాం వద్ద ఎదురుగా లారీ వస్తుండగా గాలికి మంజుల ముఖానికి చున్ని అడ్డు రాగా చేతితో తొలగించే క్రమంలో స్కూటీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు కిందపడ్డారు. అటువైపు నుంచి వస్తున్న మరో ఉపాధ్యాయుడు గమనించి 108 అంబులెన్స్‌లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. ప్రథమ చికిత్స అనంతరం మంచిర్యాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మంజుల మృతిచెందింది.
మందమర్రిలో విషాదం...
మందమర్రి పట్టణంలోని దీపక్‌నగర్‌కు చెందిన నామని సురేష్ గతంలో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న క్రమంలో సంగారెడ్డికి చెందిన మంజులతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 2017లో ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
వీరికి అరుషీ(7), దక్ష(3) కూతుర్లు ఉన్నారు. మంజుల హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా.. సురేష్ తండ్రి సింగరేణిలో ఉద్యోగం చేసి మెడికల్ అన్‌ఫిట్ కావడంతో అతడికి ఉద్యోగం రాగా కాసిపేట గనిలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఏడాదిన్నర క్రితం మంజులకు కుమురం భీం జిల్లాకు బదిలీపై వచ్చింది. మంజుల అంత్యక్రియలను చిన్నకూతురుతో చేయిస్తుండడం స్థానికులను కలిచివేసింది.
Comments
Please login to add a commentAdd a comment