లోక భూమారెడ్డి - Sakshi
ఆదిలాబాద్: బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, విజయ డెయిరీ డెవలప్‌మెంట్ మాజీ చైర్మన్ లోక భూమారెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఈయన తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేశారు. బీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్నారు. వయస్సు పైబడడంతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు ‘సాక్షి’తో పేర్కొన్నారు. 1978లో కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి పలు పదవుల్లో కొనసాగారు.
1981 నుంచి 1992 వరకు తలమడుగు మండలం రుయ్యాడి సర్పంచ్‌గా కొనసాగగా, ఆ సమయంలో పంచాయతీకి ఐదుసార్లు ఉత్తమ అవార్డులు దక్కాయి. 1992లో డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈయన చైర్మన్‌గా పనిచేసిన కాలంలో మూడు సార్లు (1992, 1993, 1995) ఉత్తమ బ్యాంక్‌గా అవార్డులు దక్కాయి. 2001లో బీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు కొనసాగారు. 2017 ఫిబ్రవరి 17న రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ చైర్మన్‌గా నియామకం అయ్యారు.
ఐదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగారు. అలాగే జిల్లా అధ్యక్షుడిగా 2021 వరకు పనిచేశారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అయితే ఇటీవల ఆయనకు పార్టీలో తగిన గుర్తింపు లేకపోవడంతో కొంత కాలంగా అంటిముట్టనట్టుగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో ఆ పార్టీలో చర్చ సాగుతోంది. ఈ విషయమై లోక భూమారెడ్డిని అడగగా, తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, మరే కారణం లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment