కోవిడ్‌.. అలర్ట్‌! 'జేఎన్‌–1 వేరియంట్‌' రూపంలో ముప్పు! | Sakshi
Sakshi News home page

కోవిడ్‌.. అలర్ట్‌! 'జేఎన్‌–1 వేరియంట్‌' రూపంలో ముప్పు!

Published Thu, Dec 21 2023 12:00 AM

- - Sakshi

ఆదిలాబాద్‌: కోవిడ్‌.. రెండేళ్ల క్రితం ప్రపంచాన్నే ఉక్కిరి బిక్కిరి చేసిన విషయం విదితమే. మహమ్మారి ముప్పు తప్పిందని భావిస్తున్న తరుణంలో మరోసారి తాజాగా కేసులు నమోదవుతుండడం కలకలం రేపుతోంది. జేఎన్‌–1 వేరియంట్‌ రూపంలో ముప్పు పొంచి ఉండటాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో కొత్త వేరియంట్‌ ప్రభావం ఇంకా కనిపించనప్పటికి కేంద్రం ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్‌ అయింది.

వైరస్‌ కట్టడి దిశగా ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెల 14న కోవిడ్‌ మాక్‌ డ్రిల్‌ నిర్వహించిన అధికారులు జిల్లాలోని వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందిని అప్రమత్తం చేశారు. కోవిడ్‌ టెస్టుల నిర్వహణతో పాటు ఐసోలేషన్‌ వార్డుల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. పీపీఈ కిట్స్‌, మాస్కులను సిద్ధంగా ఉంచారు. వేరియంట్‌ బారిన పడకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలే శ్రేయస్కరమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

కొత్త వేరియంట్‌ కలవరం..
ప్రస్తుతం జేఎన్‌–1 వేరియంట్‌ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. 2020–21లో ప్రబలిన కోవిడ్‌ వైరస్‌తో జిల్లాలో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. వేలాది మంది వైరస్‌ బారిన పడి ఆసుపత్రుల్లో చేరాల్సి వచ్చింది. రెండేళ్లుగా కొత్తగా కేసులేమి నమోదు కాకపోవడంతో కోవిడ్‌ ముప్పు పూర్తిగా తొలగిపోయిందని అందరూ భావించారు. అయితే వైరస్‌ మళ్లీ కొత్త రూపంలో నమోదు కావడం జిల్లావాసులను కలవరానికి గురిచేస్తోంది.

శీతాకాలం కావడంతో పాటు ఈ నెలాఖరు వరకు శుభ కార్యాలు ఎక్కువగా ఉండటం, క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకలు రానున్నాయి. వీటిల్లో జనం పెద్ద సంఖ్యలో గుమిగూడే అవకాశముంటుంది. దీంతో వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశముండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. అయితే మాస్క్‌లు ధరించడంతో పాటు భౌతిక దూరం వంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా వైరస్‌ నుంచి రక్షణ పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

కట్టడికి వైద్యారోగ్యశాఖ సన్నద్ధం!
ప్రమాదకరమైన కొత్త వేరియంట్‌ కట్టడికి జిల్లా వైద్యారోగ్యశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఈ నెల 14న మాక్‌ డ్రిల్‌ నిర్వహించింది. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ బోఽధనాసుపత్రితో పాటు పీహెచ్‌సీలు, యూహెచ్‌సీలు, సివిల్‌ కమ్యూనిటీ ఆసుపత్రులు కలిపి 96తో పాటు ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలోని వైద్యులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. నిర్ధారణ పరీక్షలతో పాటు పాజిటివ్‌గా తేలిన వారికి చికిత్స అందించేలా వారికి దిశా నిర్దేశం చేశారు.

వైద్యులు, సిబ్బందికి అవసరమైన మాస్కులు 1,47,270, పీపీఈ కిట్స్‌ 12,740ని సిద్ధంగా ఉంచారు. రిమ్స్‌, ఇతర ఆసుపత్రుల్లో కలిపి 1436 బెడ్స్‌ను సిద్ధం చేశారు. రిమ్స్‌లో వంద పడకలతో కూడిన ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఆక్సిజన్‌తో కూడిన 455 పడకలు, 135 పడకలతో ఐసీయూ, వెంటిలేటర్స్‌తో కూడిన 157 పడకలను రిమ్స్‌లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే 19 అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచనున్నారు.

  • జిల్లాలో కోవిడ్‌ టెస్టుల వివరాలు : 7,40,181
  • పాజిటివ్‌గా తేలిన కేసులు : 19,707
  • జిల్లాలో సంభవించిన మరణాలు : 92
  • ఫస్ట్‌ డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నవారు : 5,52,815
  • సెకండ్‌ డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వారు : 5,55,884
  • ప్రికాషన్‌ డోస్‌ తీసుకున్న వారు : 2,65,780

ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉండాలి
కొత్త వేరియంట్‌ కట్టడికి జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాం. వైరస్‌ నియంత్రణకు అనుసరించాల్సిన కార్యాచరణపై ఇప్పటికే మాక్‌ డ్రిల్‌ నిర్వహించి ఏర్పాట్లు పూర్తి చేశాం. మాస్కులు, పీపీఈ కిట్లతో పాటు చికిత్సకు అవసరమైన మెడిసిన్‌ను అందుబాటులో ఉంచాం. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్షం చేయకుండా వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకు చికిత్స పొందాలి. – రాథోడ్‌ నరేందర్‌, డీఎంహెచ్‌వో

Advertisement
 
Advertisement
 
Advertisement