టూరిజంలో ఉమ్మడి విశాఖలో విస్తృత అవకాశాలు
సాక్షి, విశాఖపట్నం: పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉమ్మడి విశాఖ జిల్లాలో విస్తృతమైన అవకాశాలు, వనరులు ఉన్నాయని ఆయా జిల్లాల కలెక్టర్లు స్పష్టం చేశారు. నగరంలో నిర్వహించిన టూరిజం రీజనల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌ను టూరిజం మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక శాఖ కార్యదర్శి అజయ్‌జైన్, ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ బాలాజీతో పాటు కలెక్టర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లాలో ఉన్న టూరిజం అవకాశాలపై కలెక్టర్ హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ ఇన్వెస్టర్లతో కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. యారాడ, భీమిలి, సాగర్‌నగర్ బీచ్‌లతో పాటు బీచ్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అరకులో త్వరలోనే సీప్లేన్ ట్రయల్ రన్ నిర్వహిస్తామన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ అరకు మొదలుకొని లంబసింగి, మారేడుమిల్లి వరకు సహజ ప్రకృతి సౌందర్య ప్రదేశాలన్నింటిని కలిపి సర్క్యూట్‌గా చేస్తే పర్యాటకులను ఆకర్షించవచ్చన్నారు. మేఘాలయ, మిజోరాంలా అరకును సదరన్ రీజినల్ కల్చర్ హబ్‌గా చేస్తే బాగుంటుందని సూచించారు. ఈనెల 31 నుంచి జరిగే అరకు చలి ఉత్సవ్‌లో ఈ ప్రాంతంలోని కల్చర్‌ను, పర్యాటకంగా అభివృద్ధికి ఉన్న అవకాశాలను వివరిస్తామని తెలిపారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్‌కృష్ణన్ మాట్లాడుతూ జిల్లాలోని తంతడి, సీతపాలెంలో బీచ్ ఫ్రంట్ టూరిజాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.. స్థానికంగా 80 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉన్నప్పటికీ పర్యాటకులకు అవసరమైన రిసార్ట్స్‌లు, మౌలిక వసతులు లేవన్నారు. ఇన్వెస్టర్లు ఈ ప్రాంతంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ సదస్సులో జీసీసీ ఎండీ కల్పనాకుమారి, ఏపీటీడీసీ ఈడీ పద్మావతి, జిల్లా టూరిజం అధికారి జ్ఞానవేణి, ఏపీటీటీఏ అధ్యక్షుడు విజయ్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సులో అరకు కాఫీ, డెస్టినేషన్ వెడ్డింగ్‌లు–మైస్ (మీటింగ్‌లు, ప్రోత్సాహకాలు, సమావేశాలు, ప్రదర్శనలు), అడ్వెంచర్ టూరిజం రంగాలపై చర్చలు జరిగాయి.
పెట్టుబడిదారులకు వివరించిన మూడు జిల్లాల కలెక్టర్లు
Comments
Please login to add a commentAdd a comment