ఆస్పత్రుల్లో ప్రసవాలతో మేలు
డుంబ్రిగుడ: గిరిజన గ్రామాల్లో మాతాశిశు మరణాల నివారణలో భాగంగా ఆస్పత్రిలో ప్రసవాలు జరిగేలా కృషి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ పద్మావతి సూచించారు. మంగళవారం ఆమె డుంబ్రిగుడ, కిల్లోగుడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు. మందులు భద్రపరిచే గది, ప్రసవ గదులతో పాటు బాలింతల వార్డు, శిశుజనన నిరీక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం రికార్డులను తనఖీ చేసి గర్భిణులకు అందుతున్న భోజన మెనూ వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గిరిజనుల పాలిట దేవాలయాలన్నారు. వీటి సేవలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఎప్పటికప్పుడు అప్పమత్తంగా ఉండి గిరిజనులకు వైద్య సేవలు అందించాలని సూచించారు. అనంతరం కిల్లోగుడ పీహెచ్‌సీని సందర్శించిన ఆమె గిరిజనులకు అందుతున్న వైద్యం సేవల వివరాలు తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితిలో ఇళ్లల్లో ప్రసవాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జమాల్ బాషా, డుంబ్రిగుడ, కిల్లోగుడ వైద్యాధికారులు పి. రాంబాబు, అంబిక, నజీజ్ పాల్గొన్నారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ పద్మావతి
Comments
Please login to add a commentAdd a comment