సాగో దుంపల లోడు వాహనాన్ని అడ్డుకున్న రైతులు
గంగవరం : గిట్టు బాటు ధర నిర్ణయించకుండా గిరిజన రైతులను మభ్యపెట్టి సాగో దుంపలను తరలిస్తుండగా ఓ వాహనాన్ని రైతులు అడ్డుకున్నారు. మంగళవారం పోతురాజుబాబు గుడి సమీపంలో దుంపల లోడుతో ఉన్న వ్యాన్ను రైతులు అడ్డుకుని, స్థానిక ఉపసర్పంచ్ పరదా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ వెంకటేశ్వరరావు దొర, రైతులు రాజు, నరసింహరావు తదితరులు మాట్లాడుతూ సాగో దుంపలకు మిల్లుల యజమానులు ఇంకా ధర నిర్ణయించలేదని, ధర నిర్ణయించాకే రవాణా చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. గిట్టుబాటు ధర కోసం మిల్లు యజమానులు, వ్యాపారులు, రైతులు మధ్య చర్చలు జరగాల్సి ఉందన్నారు. ఇంతలో ఓ దళారి దొరమామిడి గ్రామానికి చెందిన గిరిజన రైతులను మభ్యపెట్టి పెద్దాపురం మిల్లుకు దుంపల లోడును రవాణా చేయడానికి సిద్ధపడినట్టు చెప్పారు. సరైన గిట్టుబాటు ధర లభించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. గత ఏడాది పుట్టు (230 కిలోలు) రూ.1,600కు కొనుగోలు చేశారని, ఈ ఏడాది కనీస గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు.
ధర నిర్ణయించకుండా తరలింపుపై ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment