అడ్డతీగల: భవిత కేంద్రంలోని ప్రత్యేకావసరాల విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన విద్యను అందించాల్సిన అవసరం ఉందని జిల్లా విద్యాశాఖ అకడమిక్ మోనిటరింగ్ ఆఫీసర్ కె.భాస్కరరావు చెప్పారు. మంగళవారం అడ్డతీగలలోని భవిత కేంద్రం, ఎమ్మార్సీ సెంటర్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిత విద్యార్థులకు ఆట, పాటలతో పాటు చిత్రలేఖనం, తదితర అంశాల్లో కూడా అవగాహన కల్పించాలన్నారు. ప్రతి రోజు ఐఈఆర్‌టీలు విధుల కు హాజరై విద్యార్థులకు తగిన రీతిలో తర్ఫీదు ఇవ్వాలన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేయాలని చెప్పారు. ఎమ్మార్సీ సిబ్బందితో సమావేశం నిర్వహించి విద్యా శాఖ కార్యక్రమాలతో పాటు ఉపాద్యాయుల విధులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు క్రోడీకరించుకుని అప్‌టుడేట్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో పి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.